Weightage marks
-
ఈఏపీసెట్‌లో ‘ఇంటర్’కు వెయిటేజీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈఏపీసెట్–2023లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంటర్ మార్కులకు 25 శాతం మేర వెయిటేజీ ఇచ్చి ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులను ప్రకటించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన ఇంటర్ మార్కుల వెయిటేజీ విధానాన్ని పునరుద్ధరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ఇదే విషయాన్ని ఇటీవల విడుదలైన ఈఏపీసెట్ నోటిఫికేషన్లో కూడా పొందుపరిచింది. కాగా ఈఏపీసెట్‌కు దరఖాస్తు చేయడానికి ఇంటర్లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని స్పష్టం చేసింది. సెట్‌కు ఆన్లైన్ దరఖాస్తులను ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 15 వరకు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుములతో మే 14 వరకు స్వీకరిస్తారు. ఇందులో భాగంగా మే 15 నుంచి 18 వరకు ఎంపీసీ విభాగం, మే 22, 23 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారు. కాగా ఈఏపీసెట్ దరఖాస్తు, ఇతర అంశాల్లో విద్యార్థులకు సహకారం అందించడానికి రాష్ట్రంలో అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోనూ రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యా మండలి ప్రతిపాదనల మేరకు.. కరోనాకు ముందు వరకు ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ అమల్లో ఉండేది. ఇందులో భాగంగా ఈఏపీసెట్‌లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించేవారు. ఈ ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు సీట్లు కేటాయించేవారు. అయితే కరోనా వల్ల 2020, 2021 విద్యా సంవత్సరాల పరీక్షలు జరగలేదు. దీంతో ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం ఎత్తేసింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ ఈఏపీసెట్‌లోని మార్కులనే పూర్తిగా పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను కేటాయించింది. 2022 నుంచి పరిస్థితులు సద్దుమణిగి ఇంటర్ తరగతులు సజావుగా సాగుతుండడంతో ఉన్నత విద్యామండలి ప్రతిపాదనల మేరకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ విధానాన్ని ప్రభుత్వం పునరుద్ధరించింది. ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ రాసిన విద్యార్థులు 2022లో ఫస్టియర్ పరీక్షలు రాశారు. ఫస్టియర్, సెకండియర్ పరీక్షలను విద్యార్థులంతా పూర్తిస్థాయిలో రాయడంతో ఇంటర్ మార్కులకు ఈఏపీసెట్–2023లో వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలి నివేదించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం, ఈఏపీసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులను ప్రకటించనున్నారు. సిలబస్‌పైనా స్పష్టత కాగా ఈఏపీసెట్–2023 సిలబస్‌పైనా ఉన్నత విద్యామండలి స్పష్టతనిచ్చింది. కరోనా సమయంలో తరగతులు, పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు వెనుకబడ్డారు. దీంతో ఇంటర్ బోర్డు 30 శాతం మేర సిలబస్‌ను కుదించింది. అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు కుదించిన సిలబస్‌నే పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈఏపీసెట్ పరీక్షల్లోనూ ఉన్నత విద్యామండలి.. బోర్డు నిర్ణయించిన విధానాన్నే అనుసరించాల్సి వచ్చింది. బోర్డు తీసేసిన అంశాలను సిలబస్ నుంచి మినహాయించి ఈఏపీసెట్‌ను నిర్వహించింది. 2022లో కూడా 30 శాతం సిలబస్ కుదింపు అంశాన్నే కొనసాగించింది. అప్పట్లో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ఆ 30 శాతం సిలబస్‌పై బోధన జరగలేదు. ఆ విద్యార్థులు ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. వీరు ఇంటర్ ఫస్టియర్‌లో బోర్డు మినహాయించిన 30 శాతం అంశాలను అధ్యయనం చేయలేదు. దీంతో ఈసారి కూడా ఈఏపీసెట్ సిలబస్‌లో ఇంటర్ సెకండియర్ సిలబస్‌ను పూర్తిగా, ఫస్టియర్ సిలబస్‌ను 30 శాతం మేర కుదించి పరీక్ష నిర్వహించనున్నారు. ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే నర్సింగ్ సీట్లు కాగా ఈసారి కొత్తగా నర్సింగ్ సీట్లనూ ఈఏపీసెట్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి అనుబంధ నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. రాష్ట్రంలో 2023–24 విద్యా సంవత్సరంలో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు ఏపీ ఈఏపీసెట్–2023 ర్యాంకుల ఆధారంగానే ఉంటాయని తెలిపింది. డాక్టర్ వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుందని వెల్లడించింది. -
స్టాఫ్‌నర్స్‌ల ఆందోళన.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్సు పోస్టులకు వెయిటేజీ మార్కులు కలపడంలో అర్హులైన తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన కొందరు అధికారులు అవకతవకలకు పాల్పడ్డారని మండిపడ్డారు. మొదటి జాబితాలో అసలైన వారికి వెయిటేజీ మార్కులిచ్చి, సవరణ జాబితాలో వాటిని తీసేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సు పోస్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) తుది సవరణ జాబితాను సోమవారం ప్రకటించింది. అందులో అర్హులైన అభ్యర్థులు అనేక మందికి వెయిటేజీ కలపలేదు. దీంతో అన్యాయం జరిగిందంటూ ఆ అభ్యర్థులు మంగళవారం ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయానికి చేరుకుని ధర్నా చేపట్టారు. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. అసలేం జరిగింది? 2017 నవంబర్‌లో 3,311 స్టాఫ్ నర్సు పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. బీఎస్సీ, ఎంఎస్సీ, జనరల్ నర్సింగ్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసిన వారిలో అనేక మంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తున్నారు. కొందరు ప్రైవేట్‌లోనూ పనిచేస్తున్నారు. 2018 మార్చిలో స్టాఫ్ నర్స్ పోస్టులకు పరీక్ష జరిగింది. 150 మార్కులకు ఈ పరీక్ష నిర్వహించారు. అలాగే 30 మార్కులు వెయిటేజీగా నిర్ధారించారు. సర్వీసుకు గరిష్టంగా 20, అకడమిక్‌కు 10 వరకు వెయిటేజీ మార్కులుగా పేర్కొన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న వారికి గరిష్టంగా వారి సర్వీసును బట్టి 20 మార్కులు కలపాలనేది ఉద్దేశం.. ఆ ప్రకారం 2020 నవంబర్ 7వ తేదీన మొదటి మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. అయితే కాంట్రాక్టు నర్సులకే కాకుండా, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేవారు తప్పుడు కాంట్రాక్టు సర్టిఫికెట్ పెట్టినా వెయిటేజీ ఇచ్చారని కొందరు ఆరోపించారు. దీనిపై ఏర్పాటైన కమిటీ ఆ మొదటి మెరిట్ లిస్టును రద్దు చేసింది. తప్పులు సరిదిద్దాక సవరణ రెండో జాబితాను టీఎస్పీఎస్సీ సోమవారం విడుదల చేసింది. అయితే అనేక మంది అసలైన కాంట్రాక్టు స్టాఫ్ నర్సుల వెయిటేజీని ఈ జాబితాలో తొలగించడంతో దుమారం రేగింది. మొదటి జాబితాలో ఉన్నప్పటికీ, సవరణ జాబితాలో చాలా మందికి వెయిటేజీ మార్కులను కలపలేదు. ఉదాహరణకు: మొదటి జాబితాలో వంద ర్యాంకున్నవారు, వెయిటేజీ మార్కులు వేయకపోవడం వల్ల సవరణ జాబితాలో ఏకంగా 2 వేలకు ర్యాంకు పడిపోయిన పరిస్థితి నెలకొంది. కొందరి వెయిటేజీ మార్కులను తక్కువగా వేశారు. పైగా దాని ప్రకారమే ఈ నెల 24 నుంచి సెలెక్షన్ వెరిఫికేషన్ ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. అయితే జాబితా తప్పులు తడకగా రూపొందించారంటూ టీఎస్పీఎస్సీ అధికారుల వద్ద ఫిర్యాదు చేయగా.. వైద్య, ఆరోగ్యశాఖ పంపిన వివరాల ఆధారంగానే వెయిటేజీ ఖరారు చేశామని వారు పేర్కొన్నట్లు అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్ష రాసిన వారిలో దాదాపు 2 వేల మంది కాంట్రాక్టు నర్సులు ఉంటారని అంచనా. సర్వీస్ మార్కులు తొలగించటం అన్యాయం.. నాకు మొదటి జాబితాలో కాంట్రాక్టు సర్వీస్ వెయిటేజీ మార్కులు 16, అకడమిక్ వెయిటేజీ మార్కులు 10 కలిశాయి. దీంతో నా ర్యాంక్ 35గా ఉంది. ఇప్పుడు సవరణ జాబితాలో సర్వీస్ మార్కులు 16 తీసి.. కేవలం అకడమిక్ మార్కులు 10 మాత్రమే వేశారు. దీంతో నా ర్యాంకు మొదటి జాబితా ప్రకారం 35 ఉంటే, సవరణ జాబితాలో ఏకంగా 773కు పోయింది. అలాగే ఒక కాంట్రాక్టు స్టాఫ్ నర్సుకు మొదటి జాబితాలో 500 ర్యాంకు ఉండగా, సవరణ జాబితాలో అది దాదాపు 5 వేలకు చేరింది. మాకు అన్యాయం జరిగినందున న్యాయం చేయాలని కోరుతున్నాం.. – నవనీత, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ -
ఎంసెట్‌లో వెయిటేజీ రద్దు?
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కులకు ఇస్తున్న 25% వెయిటేజీ విధానం ఆశించిన ప్రయోజనాన్ని చేకూర్చలేకపోతుం డటంతో దాన్ని రద్దు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇం టర్ చదువుకు ప్రాధాన్యం పెంచడంతో పాటు ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఈ విధా నాన్ని 2008లో అమల్లోకి తీసుకురాగా నాటి నుంచి కార్పొ రేట్ కాలేజీలు దీన్ని అనుకూలంగా మార్చుకున్నాయన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఇంటర్ ప్రాక్టికల్స్‌లో తమ విద్యార్థుల సామ ర్థ్యం మేరకు మార్కులు వేస్తుండగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం తమ విద్యార్థులకు అక్రమంగా 120కి 120 మార్కులు వేసుకొని ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు కొల్లగొడుతూ విద్యా వ్యాపారం సాగిస్తున్నాయన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెయిటేజీ విధానాన్ని రద్దు చేసే యోచనలో ప్రభుత్వ వర్గాలు పడ్డాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలోనే ఈ మేరకు కసరత్తు జరిగినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం ఈ అంశం తెలం గాణ, ఏపీ ఉమ్మడి ప్రవేశాల విధానంతో ముడిపడి ఉన్నందు వల్ల ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్‌తోనూ చర్చించాల్సి వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అదేమీ సమస్య కాబోదని, ప్రభుత్వం తలచుకుంటే సులభమేనని అధికారులు చెబుతున్నారు. వెయిటేజీ ఎందుకు వచ్చిందంటే.. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం 1983లో ఎంసెట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కొన్నాళ్లు అది బాగానే ఉన్నా కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ కంటే ఎంసెట్ శిక్షణకు ప్రాధాన్యాన్ని పెంచాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు సమస్యలు మొదలయ్యాయి. జూనియర్ కాలేజీలు రెండుగా విడిపోయాయి. ప్రభుత్వ కాలేజీలు కేవలం ఇంటర్ చదువుకే ప్రాధాన్యం ఇవ్వగా కార్పొరేట్ కాలేజీలు సీట్ల కోసం ఎంసెట్‌కు ప్రాధాన్యం పెంచుతూ పోయాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఎంసెట్ వంటి శిక్షణ లేక ఎంసెట్‌లో వెనుకబడిపోవడం, కార్పొరేట్ కాలేజీలు ప్రత్యేక శిక్షణల పేరుతో ముందుకు సాగడంతో ఇంటర్ విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై అప్పట్లో ప్రభుత్వం ప్రొఫెసర్ దయారత్నం కమిటీని నియమించింది. అమలుకు నోచుకోని మిగతా సిఫారసులు.. ప్రొఫెసర్ దయారత్నం కమిటీ ఇంటర్ విద్యపై అనేక కోణాల్లో అధ్యయనం చేసి 12 ప్రధాన అంశాలపై సిఫారసులు చేసింది. అందులో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ప్రధాన అంశంగా పేర్కొంది. దాంతోపాటు ఎంసెట్ ప్రాధాన్యాన్ని తగ్గించి ఇంటర్ ప్రాధాన్యాన్ని పెంచేలా సిఫారసులు చేసింది. భవిష్యత్తులో ఎంసెట్ అవసరమే లేకుండా ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టేలా సిఫారసు చేసింది. అందులో భాగంగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో మొదటి ఏడాది ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ (ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ఖరారు చేసేలా) ఇవ్వాలని సూచించింది. ఆ తరువాత సంవత్సరాల్లో ఏటా ఇంటర్ వెయిటేజీని 50 శాతం, 75 శాతం ఇచ్చేలా, చివరకు 100 శాతం ఇంటర్ మార్కులతోనే ప్రవేశాలు చేపట్టేలా సిఫారసు చేసింది. ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం పెంచిన నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేసుకోకుండా చూసేలా మరో సిఫారసు చేసింది. అందుకే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. అయితే ఆ సిఫారసుల్లో 25 శాతం వెయిటేజీని 2008లో అమల్లోకి తెచ్చారు. ఆ తరువాత కాలంలో మిగతా సిఫారసులను అమలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. నష్టపోతున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు... ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ లేకపోవడం, ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ వల్ల ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల విద్యార్థులకు కూడా నష్టం తప్పట్లేదు. ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో ఎక్కువ మార్కులు వేయట్లేదు. నాలుగు సబ్జెక్టులకుగాను ప్రాక్టికల్ మార్కులు ఒక్కో దాంట్లో 30 చొప్పున 120 ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఆయా కాలేజీల ఫ్యాకల్టీ... విద్యార్థులకు వచ్చిన మేరకే మార్కులను వేస్తున్నారు. మరోవైపు ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం లేకపోవడంతో కార్పొరేట్ కాలేజీలు తమ విద్యార్థుల్లో ఎక్కువ మందికి 120కి 120 మార్కులను వేసుకుంటున్నాయి. దీంతో కార్పొరేట్ కాలేజీల విద్యార్థులకు ప్రాక్టికల్ మార్కులు స్కోరింగ్‌కు బాగా ఉపయోగపడి మంచి ర్యాంకులు వస్తుండగా, ఇవేవీ లేని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల్లో వెనుకబడిపోతున్నారు. పైగా ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల నియామకం లేక కొందరు రెగ్యులర్ లెక్చరర్లు, మరికొందరు కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొట్టుస్తుండటం, ఎంసెట్ కోసం ప్రత్యేక శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిపై 2012లో అప్పటి ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన అసెంబ్లీ కమిటీ కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దుకే సిఫారసు చేసింది. 2014లో రాష్ట్ర విభజన తరువాత దీనిపై చర్చ జరిగినా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మళ్లీ ఈ అంశంపై మళ్లీ ఆలోచనలు మొదలయ్యాయి. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులపై ఒత్తిడి... ప్రభుత్వ కాలేజీల్లో ఎంసెట్ శిక్షణపై ప్రత్యేక విధానం ఏమీ లేదు. పైగా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సరిపడా లెక్చరర్లు లేరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కాలేజీలు, గ్రామీణప్రాంత కాలేజీల్లో చదివే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంటర్‌తోపాటు ఎంసెట్ శిక్షణ తీసుకోలేని విద్యార్థులు నష్టపోతున్నారు. – డాక్టర్ పి. మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు రద్దు చేయడమే మంచిది ఇంటర్లో ప్రాక్టికల్స్ మార్కుల విధానంపై అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తే మంచిది. దీనిపై అవసరమైతే ప్రభుత్వానికి లేఖ రాస్తాం. జేఈఈలో ఇంటర్‌కు ఉన్న 40 శాతం వెయిటేజీ మార్కులను ఇప్పటికే తొలగించారు. – ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్ -
వెయిటేజ్ దరఖాస్తులు 1.08 లక్షలు
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు కోరుతూ 1,08,667 మంది దరఖాస్తుల్లో కోరినట్టు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువ మందికి వెయిటేజ్ మార్కులు పొందడానికి అర్హత లేకపోయినా దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్.. వెయిటేజ్ మార్కులు కోరిన వారందరి వివరాలను ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన వివిధ శాఖలకు పంపారు. వారికి వెయిటేజ్ పొందే అర్హత ఉందా? లేదా? ఉంటే ఎవరికి ఎన్ని మార్కులు వెయిటేజ్ ఇస్తున్నది మంగళవారం ఉదయంలోగా సీల్డ్ కవర్లో పంపాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ఉద్యోగాలకు సంబంధిత శాఖలు తమ శాఖలో అదే ఉద్యోగంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వారి సర్వీసు కాలాన్ని బట్టి గరిష్టంగా 15 మార్కులు వెయిటేజ్ ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్లలో ప్రకటించాయి. నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ఉదాహరణకు ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో ఏఎన్ఎంగా పనిచేసే మహిళా అభ్యర్థికి ఏఎన్ఎం ఉద్యోగ రాతపరీక్షలో మాత్రమే వెయిటేజ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్ వంటి పోస్టులకు అదనంగా దరఖాస్తు చేసుకున్నా ఆ రెండు పోస్టులకు వెయిటేజ్ ఉండదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ మహిళా అభ్యర్థి ఏఎన్ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకోకుండా డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా వెయిటేజ్ పొందేందుకు అర్హత ఉండదని అంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారంతా తాము ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటూ వెయిటేజ్ కోరినట్టు అధికారులు గుర్తించారు. వెయిటేజ్‌పై నేడు స్పష్టత దరఖాస్తుల్లో వెయిటేజ్ మార్కులు కోరిన 1,08,667 మందిలో ఎంతమంది అర్హులో మంగళవారం ఉదయం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు సీల్డ్ కవర్ ద్వారా వివరాలు తెలియజేస్తాయని అంటున్నారు. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించే ముందు రాతపరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కలిపి తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంటున్నారు. -
కాంట్రాక్టు సర్వీసుకు వెయిటేజీ మార్కులు
- 1,775 పారా మెడికల్ పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు జారీ - టీఎస్పీఎస్సీ ద్వారానే స్టాఫ్ నర్సు, ఏఎన్ఎం ఉద్యోగాలు సాక్షి, హైదరాబాద్: వైద్య సేవల్లో కీలకమైన పారామెడికల్ పోస్టుల భర్తీలో నెలకొన్న అయోమయానికి తెరపడింది. పోస్టులవారీగా అర్హతలు, ఎంపిక విధానాలను ప్రభుత్వం ఖరారు చేసింది. పోస్టుల భర్తీలో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ మార్కులు కలపాలని నిర్ణయించింది. విద్యార్హతలు, ఎంపిక పద్ధతులను ఖరారు చేస్తూ మార్గదర్శకాలు రూపొందించింది. కాంట్రాక్టు పద్ధతిలో వరుసగా 6 నెలలు పని చేసిన వారికే వెయిటేజీ మార్కులు ఉంటాయని పేర్కొంది. క్రమశిక్షణారాహిత్యంతో కాంట్రాక్టు సర్వీసు నుంచి తొలగించిన వారికి వెయిటేజీ మార్కులు ఉండవని స్పష్టం చేసింది. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పని చేసిన వారికి అదనంగా వెయిటేజీ మార్కులు ఉంటాయని, పని చేసిన కాలానికి తగినట్లుగా మార్కుల కేటాయింపు ఉంటుందని తెలిపింది. వైద్యశాఖలో 1,775 పారామెడికల్ పోస్టుల భర్తీకి ఈ ఏడాది మేలో అనుమతినిచ్చిన ప్రభుత్వం వాటిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యార్హతలు, ఎంపిక పద్ధతిపై స్పష్టత లేకపోవడంతో పోస్టుల భర్తీ విషయంలో విధానాలను నిర్దిష్టంగా తెలపాలని టీఎస్పీఎస్సీ ప్రభుత్వాన్ని కోరింది. ఈ నేపథ్యంలో వైద్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంప గా వాటిని ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వోద్యోగాల భర్తీలో కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రా« దాన్యత ఇవ్వరాదనే ప్రభుత్వ సర్వీసు నిబంధనల్లోని 9బి అంశాన్ని ఈ పోస్టుల భర్తీకి మినహాయించింది. వైద్య శాఖలో పారామెడికల్ ఆప్తాల్మిక్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, రేడియోగ్రాఫర్, గ్రేడ్–2 ల్యాబ్ టెక్నీషియన్, గ్రేడ్–2 ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, ఎంపీహెచ్ఏ(ఎఫ్), ఫిజియోథెరపిస్ట్ పోస్టుల్లో ఎక్కువ మంది కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నారు. -
ఇంటర్ వెయిటేజి మార్కులతో ఎంసెట్ ర్యాంకులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన ఇంటర్మీడియట్ పరీక్షల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ఖరారు చేస్తామని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు తెలిపారు. వీరిని మొదటి దశ కౌనె ్సలింగ్లో అనుమతిస్తామన్నారు. ఇక అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు వెయిటేజీ ఇచ్చి రెండో దశలో ర్యాంకులను ఖరారు చేస్తామని, ఆ తర్వాత కౌన్సెలింగ్‌కు వారిని అనుమతిస్తామని వెల్లడించారు. ఎంసెట్‌లో వచ్చే మార్కులకు 75 శాతం వెయిటేజీ, ఇంటర్మీడియట్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఈ ర్యాంకులను ఖరారు చేయనున్నట్టు తెలిపారు.