
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షల్లో వెయిటేజ్ మార్కులు కోరుతూ 1,08,667 మంది దరఖాస్తుల్లో కోరినట్టు పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. వీరిలో ఎక్కువ మందికి వెయిటేజ్ మార్కులు పొందడానికి అర్హత లేకపోయినా దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్.. వెయిటేజ్ మార్కులు కోరిన వారందరి వివరాలను ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసిన వివిధ శాఖలకు పంపారు. వారికి వెయిటేజ్ పొందే అర్హత ఉందా? లేదా? ఉంటే ఎవరికి ఎన్ని మార్కులు వెయిటేజ్ ఇస్తున్నది మంగళవారం ఉదయంలోగా సీల్డ్ కవర్‌లో పంపాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే.
కొన్ని ఉద్యోగాలకు సంబంధిత శాఖలు తమ శాఖలో అదే ఉద్యోగంలో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేసే వారికి వారి సర్వీసు కాలాన్ని బట్టి గరిష్టంగా 15 మార్కులు వెయిటేజ్ ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్లలో ప్రకటించాయి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. ఉదాహరణకు ప్రస్తుతం కాంట్రాక్ట్ పద్ధతిలో ఏఎన్‌ఎంగా పనిచేసే మహిళా అభ్యర్థికి ఏఎన్‌ఎం ఉద్యోగ రాతపరీక్షలో మాత్రమే వెయిటేజ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీస్ వంటి పోస్టులకు అదనంగా దరఖాస్తు చేసుకున్నా ఆ రెండు పోస్టులకు వెయిటేజ్ ఉండదని పేర్కొంటున్నారు. అంతేకాకుండా ఆ మహిళా అభ్యర్థి ఏఎన్‌ఎం పోస్టుకు దరఖాస్తు చేసుకోకుండా డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా వెయిటేజ్ పొందేందుకు అర్హత ఉండదని అంటున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నవారంతా తాము ప్రభుత్వంలో పనిచేస్తున్నామంటూ వెయిటేజ్ కోరినట్టు అధికారులు గుర్తించారు.
వెయిటేజ్‌పై నేడు స్పష్టత
దరఖాస్తుల్లో వెయిటేజ్ మార్కులు కోరిన 1,08,667 మందిలో ఎంతమంది అర్హులో మంగళవారం ఉదయం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రభుత్వ శాఖలు సీల్డ్ కవర్ ద్వారా వివరాలు తెలియజేస్తాయని అంటున్నారు. ఆ తర్వాత ఫలితాలు ప్రకటించే ముందు రాతపరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కులతో కలిపి తుది ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొంటున్నారు.