సాక్షి, అమరావతి: మంచిని.. మంచి అని చెప్పే సంస్కారం చంద్రబాబుకు లేదని వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాలనలో గ్రామ పంచాయతీలను పక్కన పెట్టి.. జన్మభూమి కమిటీల పేరుతో దోచుకుతిన్నారని మండిపడ్డారు. గ్రామ సచివాలయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలందరికీ అందించాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పార్లమెంటు, అసెంబ్లీల తర్వాత నేడు గ్రామాల్లో సచివాలయాలు కనిపిస్తున్నాయన్నారు. విమర్శలు చేసేవారు ఒక్కసారి రాజ్యాంగ స్ఫూర్తిని చదుకోవాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పండగ వాతావరణం నెలకొందని.. 4 నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రతి ఏడాది జనవరిలో ఖాళీ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని ఉమ్మారెడ్డి స్పష్టం చేశారు. గ్రామ వలంటీర్ వ్యవస్థ ప్రజలతో మమేకమయ్యే వ్యవస్థ అని పేర్కొన్నారు.
గర్వంగా చెప్పుకుంటున్నారు..
కేవలం 8 రోజుల్లో పరీక్షలు నిర్వహించి ఉద్యోగ నియామకాలు జరపడం ఒక చరిత్ర అని.. అభినందించాల్సింది పోయి చంద్రబాబు విమర్శలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. మా స్వశక్తిపై ఉద్యోగం సంపాదించాం అని అభ్యర్థులు గర్వంగా చెబుతున్నారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చదువుకుని.. ఆయన తనయుడు వైఎస్ జగన్ చలువతో ఉద్యోగాలు సంపాదించామని ఎంతో సంతోషంగా చెబుతున్నారన్నారు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని చంద్రబాబు లేఖ రాశారని.. ఎక్కడ తీసేశారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. నిరుద్యోగులకు సీఎం జగన్ లక్షల ఉద్యోగాలను కల్పిస్తే.. అనుభవం గల వ్యక్తినని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బాబోస్తే.. జాబొస్తుందని చెప్పి నిరుద్యోగులను చంద్రబాబు నట్టేట ముంచారన్నారు. చంద్రబాబు ఇచ్చిన పసుపు-కుంకుమ టోకెన్లను బ్యాంక్‌లు తిరస్కరిస్తున్నాయని తెలిపారు. 42 వేల కోట్ల కాంట్రాక్ట్ బకాయిలు ఉన్నాయన్నారు.
(చదవండి: వైఎస్ జగన్ పాలన @ గ్రామ స్వరాజ్యం)
చావును కూడా రాజకీయం చేయలేదా..?
కోడెల శివప్రసాదరావు మృతి చెందిన మరుసటి రోజున టెలికాన్ఫరెన్స్ పెట్టి.. ఆయన మరణాన్ని పార్టీకి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. స్వపక్షం వెన్నుపోటు వలనే కోడెల చనిపోయారని విమర్శించారు. చలో ఆత్మకూరుకి కోడెలను పిలవకుండా ఆయన్ని కుమిలిపోయేవిధంగా చేశారన్నారు. ప్రభుత్వ లాంఛనాలతో కోడెలకు అంత్యక్రియలు వద్దంటూ చంద్రబాబు రాజకీయాలు చేశారని విమర్శించారు. 1000 పింఛన్ ఇస్తే.. మీ పార్టీ సభ్యత్వం కోసం వృద్ధుల నుంచి 100 రూపాయలు కట్టించుకున్న చరిత్ర మీదని చంద్రబాబును దుయ్యబట్టారు. వలంటీర్ల వ్యవస్థపై వైఎస్ జగన్‌కు మంచిపేరు రావడంతో చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. నాలుగు నెలల్లోనే పరిపాలన బాగోలేదంటూ చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని... మీరు పరిపాలన బ్రహ్మాండంగా చేసి ఉంటే ఎందుకంతా బ్రహ్మాండంగా ప్రజలు చీ కొట్టారని ఎద్దేవా చేశారు. గ్రామ స్వరాజ్యం పాలననే లక్ష్యంగా సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పనిచేయాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment