![Ummareddy Venkateswarlu Fires On Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2020/05/28/ummm_0.jpg.webp?itok=PWcCOfwE)
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏదో విధంగా కించపరుస్తూ మాట్లాడటమే టీడీపీ అధినేత చంద్రబాబు పనిగా పెట్టుకున్నారని శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక తప్పుడు సమాచారం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చంద్రబాబు, టీడీపీ నేతలు ప్రతి దాన్నీ రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలివీ..
► టీడీపీ మహానాడులోని 68 తీర్మానాలు మొన్నటి ఎన్నికల్లో ముద్రించిన 60 పేజీల మేనిఫెస్టో ప్రతిబింబిస్తున్నాయి తప్ప మరేమీ లేదు.
► టీడీపీ మేనిఫెస్టోను 2019లో ప్రజలు తిరస్కరించి వారిని ఓడించిన విధంగానే ఈ మహానాడు తీర్మానాలను కూడా ప్రజలు స్వీకరించరు.
► మహానాడులో 2014–19 వరకూ తాను చేసిన తప్పులపై చంద్రబాబు చర్చించాలి.
► తుగ్లక్ పాలన అని దిగజారి మాట్లాడటంతో పాటు బలిపీఠంపై బడుగుల సంక్షేమం అంటూ తీర్మానం పెట్టాలనుకోవడం దుర్మార్గం.
► గతంలో జరిగిన బీసీ సదస్సులో బీసీలకు 50 శాతం సీట్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు కేవలం 29 శాతం మాత్రమే ఇచ్చారు. ఆయనకు ఎంత సేపూ ఇతరులను విమర్శించడమే తప్ప తాను ఏం చేశాననేది ఆలోచించరు.
► సీఎం వైఎస్ జగన్ 2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 60 శాతం దాకా సీట్లు ఇవ్వడంతో పాటుగా ఎన్నికల అనంతరం మంత్రివర్గంలోనూ అదే స్థాయిలో కేటాయించి కీలకమైన శాఖలను బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారు.
► చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో మైనారిటీలు, ఎస్టీలకు మంత్రి పదవులు ఇవ్వలేదు.
► రైతుల రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తానని చెప్పి చివరకు ఏం చేశారో అందరికీ తెలుసు.
► మహానాడును ఒక క్రతువులాగా నిర్వహిస్తున్నారు తప్ప వాస్తవాలకు అనుగుణంగా జరపాలనే యోచన లేకుండా పోయింది.
► చంద్రబాబు తన తొలి సంతకానికి తూట్లు పొడిస్తే జగన్ తాను చేసిన తొలి సంతకాలను అమలు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీతో సహా చంద్రబాబు పెట్టి పోయిన బకాయిలన్నీ జగన్ తీర్చేశారు.
Comments
Please login to add a commentAdd a comment