విజయవాడ సిటీ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రజలంతా హర్షిస్తుండగా, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం హాస్యాస్పదమైన ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చేపట్టి పక్షం రోజులు కూడా కాకముందే ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి చంద్రబాబు ఇంకా కోలుకోలేదేమోనని ఎద్దేవా చేశారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విజయవాడలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. టీడీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టుల్లో చోటుచేసుకున్న అవినీతిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ చెబితే, చంద్రబాబు నాయడు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఉమ్మారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే...
‘‘ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే కేబినెట్ సమావేశాలు నిర్వహించి.. నిధుల కేటాయింపులు, బిల్లుల చెల్లింపులు చేసిన చరిత్ర చంద్రబాబుది. సాగునీటి ప్రాజెక్టులను ఏకపక్షంగా నిలిపివేయడం సరికాదని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉంది. నిలిపివేసిన ప్రాజెక్టులు ఒక్కటి చూపించగలరా? టీడీపీ పాలనలో ప్రాజెక్టుల అంచనా వ్యయాలను ఇబ్బడిముబ్బడిగా పెంచారని, దీన్ని సమీక్షించి చర్యలు తీసుకుంటామని వైఎస్ జగన్ చెప్పారు. పెంచిన అంచనాలను సమీక్షించవద్దనేది చంద్రబాబు ఉద్దేశమా? ప్రాజెక్టులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆపుతోందంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తల హత్యలు బాబుకు కనిపించలేదా?
రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, అక్రమంగా కేసులు పెడుతున్నారని చంద్రబాబు అనడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్‌సీపీ నేత నారాయణరెడ్డి హత్య, చిత్తూరులో జంట హత్యలు జరిగాయి. అవి చంద్రబాబుకు చిన్న విషయాలుగా కనిపిస్తున్నాయా? అప్పటి టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మహిళా తహసీల్దార్ వనజాక్షిని జుట్టు పట్టుకొని ఈడ్చిపారేస్తే చంద్రబాబుకు అది చిన్న విషయంగా కనిపించింది. దాదాపు 800 మంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టిన విషయం చంద్రబాబుకు గుర్తుకురాలేదా? నరసరావుపేటలో దాడులు జరుగుతున్నాయని చంద్రబాబు అంటున్నారు.. ఆయన వాటిని ఆధారాలతో నిరూపించాలి. గతంలో చంద్రబాబు చేయించిన హత్యలు, అరాచకాలు, అవమానాలు, అక్రమ కేసులపై ఎప్పుడైనా విచారణ జరిగిందా?విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సాక్షాత్తూ అప్పటి ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగింది. దానిపై విచారణ జరిపించండి అని కోరితే కోడి కత్తి అంటూ హేళనగా మాట్లాడారు.
రివర్స్ టెండరింగ్ అంటే ఉలుకెందుకు?
ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు తేలితే రివర్స్ టెండరింగ్ చేపడతామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చెబితే చంద్రబాబు ఎందుకు ఉలికిపడుతున్నారు? ఆనాడు కృష్ణా నది కరకట్ట దగ్గర అక్రమ కట్టడాలు నిర్మించారని చంద్రబాబు చెప్పారు. అక్కడ ఉన్న వారికి జిల్లా కలెక్టర్‌తో నోటీసులు ఇప్పించిన విషయం వాస్తవం కాదా? 21 కట్టడాలను తొలగిస్తామని అప్పటి జల వనరుల శాఖ మంత్రి చెప్పలేదా? ఆనాడు చంద్రబాబు చెప్పిన మాట ఆచరణకు నోచుకోలేదు. పైగా రూ.4.3 కోట్లతో కరకట్ట పక్కన అనుమతి లేని స్థలంలో ప్రజావేదిక నిర్మించారు. కరకట్టపై అక్రమ కట్టడాల విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల జరిమానా విధించినా టీడీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. కృష్ణా నదిని ఆక్రమించి కొత్త ఐలాండ్ నిర్మించాలని కుట్ర చేశారు. ప్రజా వేదికను తనకు కేటాయించాలని చంద్రబాబు అనడం దుస్సాహసమే’’ అని ఉమ్మరెడ్డి వెంకటేశ్వర్లు తేల్చిచెప్పారు.
అవినీతిపై చర్యలు తీసుకుంటే భయమెందుకు?
Published Wed, Jun 12 2019 4:28 AM | Last Updated on Wed, Jun 12 2019 5:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment