
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 19 రకాలైన 16,208 ఉద్యోగాలకు జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. మొత్తంగా 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.
ఈ ఉద్యోగాల నియామకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ.. ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఒకవేళ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే.. ఈ ఉద్యోగాల రాత పరీక్షలు మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందని కూడా తెలిపారు. రానున్న వారం పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలించి రాత పరీక్షల తేదీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment