Nodal agency
-
ఆ రెండు జిల్లాల అభివృద్దికి కొత్త ప్రాజెక్ట్: సీఎం కేసీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ నగరానికి ఆనుకుని ఉన్న రంగారెడ్డి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల సమీకృతాభివృద్ధి, సమస్యలకు శాశ్వత పరిష్కారం, ఏకీకృత విధానం ఏర్పాటు కోసం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ముఖ్య పట్టణాల్లో.. సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక వసతుల అభివృద్ధి, డ్రైనేజీ, నాలాల మరమ్మతులు వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనిపై సీఎం శుక్రవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘‘హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా పురోగమిస్తోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేయాలి. హైదరాబాద్‌తోపాటు సమ్మిళిత అభివృద్ధిని కొనసాగించేలా సమీకృత విధానాన్ని రూపొందించాలి. ఇందుకు నిరంతర పర్యవేక్షణ కోసం సీఎస్ అధ్యక్షతననోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేద్దాం’’ అని కేసీఆర్ చెప్పారు. ప్రణాళికలు సిద్ధం చేయండి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రజలకు విద్య, వైద్యం వంటి అన్ని సౌకర్యాలను మరింతగా అందుబాటులోకి తేవాలని కేసీఆర్ అన్నారు. ‘‘ఏ నియోజకవర్గం పరిధిలో ఏ సమస్యలున్నాయనే దానిని ఒక ప్రాజెక్టు రూపంలో స్థానిక ఎమ్మెల్యేలు రూపొందించాలి. మౌలిక వసతుల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులతో కలిసి ప్రణాళికలను సిద్ధం చేయాలి. నోడల్ అధికారి అధ్యక్షతన తరచూ సమావేశం కావాలి. అందులో ఏయే శాఖల భాగస్వామ్యం ఉండాలి, ఖర్చు ఎంతవుతుందన్న అంశాన్నింటినీ ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి చర్చించాలి. నెలకోసారి ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లతో సీఎస్ క్రమం తప్పకుండా సమావేశం కావాలి. నోడల్ అధికారి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షించాలి. సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు సమకూర్చడానికి సిద్ధంగా ఉంది’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో అద్భుతమైన వాతావరణం హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ విమానాశ్రయం, అద్భుతమైన వాతావరణ పరిస్థితులున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మిషన్ భగీరథ తాగునీరు నిరంతరం అందుతోందని, నీటి అవసరాల కోసం అతిపెద్ద రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకుంటున్నామని వివరించారు. ‘‘ఈ రెండు జిల్లాల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలి. సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయాలి. నాణ్యమైన విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్మాణం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, వరదల ముంపు రాకుండా చర్యలు తీసుకోవాలి. రెవెన్యూ, భూరిజిస్ట్రేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారాలను అన్వేషించాలి. తద్వారా ఈ రెండు జిల్లాలు భవిష్యత్తులో హైదరాబాద్ తో పోటీ పడాలి..’’ అని కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. నిధుల సమీకరణపై దృష్టి సమగ్రాభివృద్ధికి సంబంధించి నిధుల సమీకరణపై దృష్టి పెట్టాలని సీఎం కేసీఆర్ సూచించారు. నోడల్ ఏజెన్సీ ఏర్పాటుతో హైదరాబాద్ నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి వీలవుతుందన్నారు. అన్ని దిక్కుల్లో అన్ని రకాల పనులు సమాంతరంగా కొనసాగేలా చూడాలన్నారు. సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రావు, ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, బేతి సుభాష్ రెడ్డి, అరికెపూడి గాంధీ, కె.పి వివేకానంద, కాలె యాదయ్య, మాధవరం కృష్ణారావు, అధికారులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్ష!
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 19 రకాలైన 16,208 ఉద్యోగాలకు జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 7 వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించారు. మొత్తంగా 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఉద్యోగాల నియామకానికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ శాఖ.. ఏప్రిల్ మొదటి వారంలో రాత పరీక్షలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. ఒకవేళ రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే.. ఈ ఉద్యోగాల రాత పరీక్షలు మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉందని కూడా తెలిపారు. రానున్న వారం పది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాన్ని పరిశీలించి రాత పరీక్షల తేదీలపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. -
రుణాల పంపిణీకి ఉమ్మడి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ విషయంలో ఉమ్మడి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని వర్గాల పేదలకు సబ్సిడీ రుణ సాయాన్ని ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రుణాల పంపిణీ విషయంలో కార్పొరేషన్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేసింది. ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం ద్వారా అన్ని కార్పొరేషన్లు ఒకేసారి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 4న జీవో విడుదల చేసింది. డిసెంబరు నాటికి రుణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, అందుకు తేదీలను కూడా ఖరారు చేసింది. రుణాల పంపిణీ కోసం సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించాలని, ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. గతంలో రుణాల మంజూరు విషయంలో కార్పొరేషన్లు మార్చిలో నిర్ణయం తీసుకోవడం, మార్చి అయిపోయిన తరువాత ఆర్థిక సంవత్సరం మారిందంటూ పట్టించుకోకుండా వదిలేయడం వంటివి జరిగేవి. అధికారుల ద్వారానే ఎంపిక రుణాలు పొందే లబ్ధిదారులను బ్యాంకు అధికారులు, ఎంపీడీవో, కార్పొరేషన్ల ప్రతినిధులు ఎంపిక చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో జన్మభూమి కమిటీల సభ్యులు సంతకాలు చేస్తేనే రుణాలు తీసుకునేందుకు పేదలు అర్హత సాధించేవారు. ఆ పరిస్థితిని ప్రభుత్వం మార్చేసింది. అర్హుల జాబితాను నేరుగా కార్పొరేషన్ ఈడీకి పంపిస్తే, వారు కలెక్టర్ అనుమతి తీసుకుని నిధుల కోసం కమిషనర్‌కు పంపిస్తారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబరులో గ్రౌండింగ్ అయిన యూనిట్లకు జనవరిలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) ఇవ్వాలి. ఫిబ్రవరిలో యూనిట్‌ను కార్పొరేషన్ ఈడీ సందర్శించి పరిశీలించాల్సి ఉంటుంది. మార్చిలో నిర్దేశిత ఏజెన్సీ ద్వారా యూనిట్ పనితీరును మరోసారి పరిశీలించాలి. రుణాల పంపిణీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు ఒకేసారి రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
ఎంత ఖర్చు చేశారు?
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలకోసం అమలుచేస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక బడ్జెట్లో ఈ రెండు కేటగిరీల్లో రూ.26,145 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,452 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,693 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి లక్ష్యాలు నిర్దేశించింది. వార్షిక సంవత్సరం పూర్తయ్యేలోపు కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిశాయి. ప్రస్తుతం నాల్గో త్రైమాసికం కొనసాగుతోంది. ఈక్రమంలో మూడు త్రైమాసికాలలో వినియోగానికి సంబంధించిన వివరాలను నోడల్ ఏజెన్సీలకు ఇవ్వాలి. కానీ గత ఆర్నెళ్లుగా ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చుపై అయోమయం నెలకొంది. శాఖల వారీగా లక్ష్యసాధనకు సంబంధించిన వివరాలేవీ నోడల్ ఏజెన్సీలకు ఇవ్వడం లేదు. దీంతో ఈ పద్దు కింద ఎంత ఖర్చు జరిగింది, లక్ష్యాలు ఏమిటనేదానిపై అస్పష్టత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణకు ప్రభుత్వం రెండు నోడల్ ఏజెన్సీలను ఏర్పాటుచేసింది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధినిధి నోడల్ ఏజెన్సీగా ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీగా గిరిజన శాఖను నియమించింది. ఈ శాఖలు ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ సమావేశాలు, నోడల్ ఏజెన్సీ మీటింగ్‌లు, పురోగతిపై సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. ఈక్రమంలో ఎస్డీఎఫ్ నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడంతో వినియోగానికి సంబంధించిన సమాచారం సమర్పించాలని పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తాజాగా వివరాలు సమర్పించని ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేస్తున్నాయి. త్వరలో నోడల్ ఏజెన్సీ సమావేశం ఉండడంతో ఆలోపు వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశాయి. -
అక్టోబర్‌లో ఎస్సీ ఎస్డీఎఫ్ నోడల్ ఏజెన్సీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన నోడల్ ఏజెన్సీని సమావేశపర్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు వేగిరం చేసింది. వాస్తవానికి ఈ కమిటీ ప్రతి ఆరు నెలలకోసారి సమావేశం కావాలి. కానీ మార్గదర్శకాల విడుదలలో జాప్యం కావడంతో సమావేశం ఆలస్యమైంది. అయితే వచ్చే నెల రెండో వారంలో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్ ఏజెన్సీ సమావేశం నిర్వహించనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ ఎస్డీఎఫ్ కింద 44 ప్రభుత్వ విభాగాలకు రూ.14,350 కోట్లు కేటాయించగా.. ఇందులో ఇప్పటివరకు రూ.4,550 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగే నోడల్ ఏజెన్సీ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్, టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, వీసీ ఎండీ తదితరులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
సౌర విద్యుత్ విధానానికి ఓకే
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్ విధానం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రైవేటు సంస్థలు ఏర్పాటుచేసే సౌర, పవన విద్యుత్ పార్కులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు నెడ్‌క్యాప్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ.. వచ్చే ఐదేళ్ళలో 9 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పాదన లక్ష్యంగా సంస్థలకు పలు రాయితీలను ప్రకటించింది. సరఫరా లైన్లు వాడుకున్నా పంపిణీ నష్టం లేకుండా విద్యుత్ సుంకం వంద శాతం రీయింబర్స్ చేయాలని నిర్ణయించింది. ఉత్పత్తిని నిరాటంకంగా చేసుకునేందుకు వీలుగా ఈ పాలసీని అమలు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడ సోలార్ పార్కులు ఏర్పాటు చేసినా భూ మార్పిడికి సులభంగా అనుమతులు ఇవ్వడంతో పాటు, విద్యుత్‌ను రాష్ట్ర పరిధిలో అమ్ముకుంటే సర్‌చార్జీ విధించకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సర్కారు భూములను దీర్ఘకాలిక లీజులతో ఇవ్వడంతో పాటు భూమిని ముందే అప్పగించేందుకు గాను కలెక్టర్లకు నిర్ణయాధికారాలను అప్పగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ వివరాలను, తీసుకున్న నిర్ణయాల్ని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీడియాకు వివరించారు. 2019 నాటికి ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 2015-16 సంవత్సరానికి రాష్ట్రంలో 58,191 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఇందుకు రూ.30,300 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. చార్జీల పెంపు అనివార్యమంటూనే.. సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గించడంతో పాటు విద్యుత్ చౌర్యం అరికట్టడం ద్వారా చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు పల్లె పేర్కొన్నారు. అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణ ఇలావుండగా బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద అక్రమ లే అవుట్లను, భవనాలను క్రమబద్దీకరించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు. అయితే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోనూ, ప్రభుత్వ భూముల్లోనూ, నీటి వనరుల్లో (వాటర్ బాడీస్) మాత్రం ఈ క్రమబద్దీకరణ వర్తించదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి 187 కేసులు నమోదైతే, 181 కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆరు కేసులు పరిశీలనలో ఉన్నట్లు పల్లె చెప్పారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయని, వీటి పరిష్కారానికి సీఎస్ నేతృత్వంలో ఆర్అండ్బీ, పోలీస్, రవాణా, ఆర్టీసీ అధికారులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పీహెచ్సీ వైద్యుల నుంచి జిల్లా స్థాయి వరకు, ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్వైన్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించామన్నారు. కంపెనీలకు భూ కేటాయింపులు గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద పదెకరాల్లో అమెరికా కంపెనీ పై డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించింది. ఎకరం రూ.కోటి చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే పలు కంపెనీలకు జరిపిన కేటాయింపుల వివరాలు కూడా మంత్రి సవివరంగా వెల్లడించారు. -
‘రూసా’ అమలుకు త్వరలో నోడల్ ఏజెన్సీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకాన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీని నాలుగైదు రోజుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాము నోటిఫై చేసే విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూసా పథకాన్ని అమలు చేస్తామని, ఆ విభాగం ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు తెలియజేయనుంది. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు దృష్టి సారించారు. రాష్ట్ర విభజన జరగకముందు రూసా అమలుకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అయితే విభ జన జరిగిన నేపథ్యంలో ఇటీవల ఏపీ ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు వేర్వేరుగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది. ఏపీకి నోడల్ ఆఫీసర్‌గా కళాశాల విద్యా కమిషనర్ వ్యవహరిస్తారని పేర్కొంది. అయితే కళాశాల విద్యా కమిషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా పేర్కొనడం పట్ల అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నత విద్యా మండలికే ఆ బాధ్యతలు అప్పగించాలని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి పథకం అమలుకు ఎవరు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారనే విషయాన్ని కేంద్రానికి తెలియజేయలేదు. త్వరలోనే నోడల్ ఆఫీసర్‌ను నోటిఫై చేస్తూ కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను ప్రస్తుత తెలంగాణ కళాశాల విద్య కమిషనర్‌కే అప్పగించే అవకాశం ఉంది. అయితే ఆ బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలికే అప్పగించాలనే వాదన ఉంది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం ప్రకటించనుంది. ఆ తర్వాత రూసా కింద నిధులు విడుదల కానున్నాయి. ఇక రూసా కింద రాష్ట్రలో మూడు కొత్త యూనివర్సిటీలు, రెండు క్లస్టర్ యూనివర్సిటీలు, 4 కొత్త మోడల్ డిగ్రీ కాలేజీలు, మరో 4 డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీలుగా అప్‌గ్రేడ్ చేయడం, 7 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రతిపాదించారు. ఒక్కో కాలేజీని రూ.26 కోట్లతో గజ్వేల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, వరంగల్‌లో (మహిళ) ఏర్పాటు చేయనున్నారు.