సౌర విద్యుత్ విధానానికి ఓకే
- కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్ విధానం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రైవేటు సంస్థలు ఏర్పాటుచేసే సౌర, పవన విద్యుత్ పార్కులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు నెడ్‌క్యాప్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ.. వచ్చే ఐదేళ్ళలో 9 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పాదన లక్ష్యంగా సంస్థలకు పలు రాయితీలను ప్రకటించింది.
సరఫరా లైన్లు వాడుకున్నా పంపిణీ నష్టం లేకుండా విద్యుత్ సుంకం వంద శాతం రీయింబర్స్ చేయాలని నిర్ణయించింది. ఉత్పత్తిని నిరాటంకంగా చేసుకునేందుకు వీలుగా ఈ పాలసీని అమలు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడ సోలార్ పార్కులు ఏర్పాటు చేసినా భూ మార్పిడికి సులభంగా అనుమతులు ఇవ్వడంతో పాటు, విద్యుత్‌ను రాష్ట్ర పరిధిలో అమ్ముకుంటే సర్‌చార్జీ విధించకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సర్కారు భూములను దీర్ఘకాలిక లీజులతో ఇవ్వడంతో పాటు భూమిని ముందే అప్పగించేందుకు గాను కలెక్టర్లకు నిర్ణయాధికారాలను అప్పగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ వివరాలను, తీసుకున్న నిర్ణయాల్ని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీడియాకు వివరించారు.
2019 నాటికి ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 2015-16 సంవత్సరానికి రాష్ట్రంలో 58,191 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఇందుకు రూ.30,300 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. చార్జీల పెంపు అనివార్యమంటూనే.. సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గించడంతో పాటు విద్యుత్ చౌర్యం అరికట్టడం ద్వారా చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు పల్లె పేర్కొన్నారు.
అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణ
ఇలావుండగా బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద అక్రమ లే అవుట్లను, భవనాలను క్రమబద్దీకరించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు. అయితే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్‌డీఏ) పరిధిలోనూ, ప్రభుత్వ భూముల్లోనూ, నీటి వనరుల్లో (వాటర్ బాడీస్) మాత్రం ఈ క్రమబద్దీకరణ వర్తించదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి 187 కేసులు నమోదైతే, 181 కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆరు కేసులు పరిశీలనలో ఉన్నట్లు పల్లె చెప్పారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయని, వీటి పరిష్కారానికి సీఎస్ నేతృత్వంలో ఆర్‌అండ్‌బీ, పోలీస్, రవాణా, ఆర్టీసీ అధికారులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పీహెచ్‌సీ వైద్యుల నుంచి జిల్లా స్థాయి వరకు, ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్వైన్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించామన్నారు.
కంపెనీలకు భూ కేటాయింపులు
గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద పదెకరాల్లో అమెరికా కంపెనీ పై డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించింది. ఎకరం రూ.కోటి చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే పలు కంపెనీలకు జరిపిన కేటాయింపుల వివరాలు కూడా మంత్రి సవివరంగా వెల్లడించారు.