Palle Raghunatha Reddy
-
బతికుండగానే తండ్రికి నరకం చూపిన 'పల్లె' ముఖ్య అనుచరుడు
పున్నామనరకం నుంచి తప్పించువాడు పుత్రుడంటారు. కానీ ఊరందరికీ నీతులు చెప్పే ఓ పచ్చనేత తండ్రికి మాత్రం బతికుండగానే నరకం చూపించాడు. వేళకింత భోజనం కూడా పెట్టకుండా వేధించాడు. ప్రభుత్వం ఇచ్చే సామాజిక పింఛన్ కూడా లాగేసుకునే కుమారుడు.. తనను తీవ్రంగా వేధించడాన్ని భరించలేని ఆ 67 ఏళ్ల వృద్ధుడు పాఠశాల భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సాక్షి, పుట్టపర్తి అర్బన్: పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని ఎనుములపల్లికి చెందిన గుట్లపల్లి అంజినప్ప (67)కు ఒక్కగానొక్క సంతానం గుట్లపల్లి గంగాధర్. అంజినప్ప భార్య 15 ఏళ్ల క్రితమే మరణించగా...కుమారుడి వద్దే కాలం గడుపుతున్నాడు. పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అనుచరుడైన గంగాధర్ ఆస్తి అంతా రాయించుకుని తండ్రి బాగోగులు పూర్తిగా విస్మరించాడు. కనీసం వేళకింత భోజనం కూడా పెట్టేవాడు కాదు. చివరకు ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ డబ్బు కూడా లాగేసుకునేవాడు. దీంతో అంజినప్ప వృద్ధాప్యంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవాడు. ఇటీవల కుమారుడు ఈసడింపులు ఎక్కువకావడంతో మనోవేదనకు గురైన అంజినప్ప బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం పైకెక్కి కిందకుదూకి ఆత్మహత్య చేసుకున్నారు. అయితే దీన్ని సాధారణ మరణంగా చిత్రీకరించిన గంగాధర్... గుట్టు చప్పుడు కాకుండా తండ్రి మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఆవరణలో ఉంచాడు. దీన్ని చుట్టుప్రక్కల వారు గమనించడంతో విషయం పోలీసుల వరకూ చేరింది. ఈ విషయంపై అర్బన్ సీఐ బాలసుబ్రహ్మణ్యంరెడ్డిని వివరణ కోరగా... సంఘటన గురించి తమకూ తెలిసిందని, కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపుతామన్నారు. -
'పల్లె..' ఇవేం నీతిమాలిన పనులు?.. ఆడియో వైరల్
పుట్టపర్తి: అధ్యాపకుడిగా పిల్లలకు నీతులు బోధించిన టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి రాజకీయ నేతగా తాను మాత్రం నీతిమాలిన చర్యలకు ఒడిగట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతపై తప్పుడు కేసు పెట్టాలంటూ ఒక అంగన్వాడీ కార్యకర్తకు సలహా ఇస్తున్న ఆడియో శనివారం సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం ఎద్దులవాండ్లపల్లి మినీ అంగన్వాడీ కార్యకర్త అనసూయ విధులకు తరచూ గైర్హాజరవుతోంది. ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారాన్ని కూడా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సరిగా పంపిణీ చేయడం లేదు. ఈ విషయంపై స్థానికుల విజ్ఞప్తి మేరకు అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత సతీష్ యాదవ్ కొన్ని రోజుల క్రితం ఐసీడీఎస్ సూపర్వైజర్ గంగాదేవికి ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని అనసూయ ఫోన్లో టీడీపీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై పల్లె ఆమెకు తప్పుడు సలహాలు ఇచ్చారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విన్నవించుకుంటున్నట్లుగా ఓ వీడియో రికార్డ్ చెయ్. సీఎం గారూ.. మీరు మహిళలకు ఎంతో మేలు చేస్తున్నారు.. కానీ మా ఊర్లో సతీష్ యాదవ్ అనే వ్యక్తి నన్ను వేధిస్తున్నాడు, నాకు లొంగి కోరిక తీర్చాలి.. లేదంటే నీ ఉద్యోగం పీకించేస్తా అంటూ భయాందోళనకు గురిచేస్తున్నాడు. అతడి నుంచి నాకు రక్షణ కల్పించండి.. లేదంటే నేను ఆత్మహత్య చేసుకుంటానని రికార్డు చెయ్.. ఆ వీడియో వైరల్ చెయ్.. దీన్ని సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు రూపంలో అందజేయి’ అంటూ పల్లె రఘునాథరెడ్డి అంగన్వాడీ కార్యకర్తకు చెప్పడం ఆ ఆడియోలో బట్టబయలైంది. ఇది విన్న పలువురు విద్యావేత్తగా చెప్పుకునే పల్లె రఘునాథరెడ్డి చెప్పాల్సిన మాటలేనా ఇవి? అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా అంగన్వాడీ కార్యకర్త విషయంలో స్థానిక ఎంపీడీవో ఆజాద్ తనకు ఫోన్ చేసి బెదిరించారంటూ సతీష్ యాదవ్ నల్లమాడ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. -
అనంతలో జేసీ దివాకర్ రెడ్డికి ఝలక్
-
పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
► ప్రోత్సహిస్తున్న అనుబంధ కళాశాలల సిబ్బంది ► పల్లె కళాశాలలో అడ్డూఅదుపు లేని వైనం ఎస్కేయూ: డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించిన అనుబంధ కళాశాలల యాజమాన్యాలు మరో అడుగు ముందుకు వేశారుు. తమ పరిధిని విస్తరించుకుని పీజీ పరీక్షల్లో సైతం బరితెగింపు ధోరణిలో మాస్ కాపీయింగ్‌ను అమలు చేస్తున్నారుు. మరోవైపు అనుబంధ పీజీ కళాశాలలు సిబ్బంది కూడా భారీ దందాకు తెరతీశారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేలు వసూలు చేసుకుని కాపీరుుంగ్కు సహకారం అందిస్తున్నారు. మంగళవారం ఎస్కేయూ క్యాంపస్ కళాశాలల్లో మాత్రం మెస్‌బిల్లులు, కోర్సు ఫీజులు విద్యార్థులు చెల్లించలేదని పరీక్ష నిలిచిపోయింది. అనుబంధ పీజీ కళాశాలల్లో మాత్రం మంగళవారం యథావిధిగా పరీక్షలు జరిగాయి. సెల్ఫ్ సెంటర్లలో ఇష్టారాజ్యం పీజీ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ కళాశాలల్లోని పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే సెల్ఫ్ సెంటర్ల పేరుతో అనుమతులు ఇవ్వడంతో చూచిరాత పరీక్షలను తలపించాయి. కదిరిలోని వివేకానంద పీజీ కళాశాల మంత్రి పల్లె రఘనాథరెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో ఒకటి. ఇక్కడ మంగళవారం జరిగిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలో విద్యార్థులు నేరుగా సెల్‌ఫోన్ నుంచి మెటీరియల్‌ను డౌన్లోడ్ చేసుకొని రాసుకున్నారు. మరికొంత మంది పుస్తకాలను చూసి చూచిరాత పరీక్షలు రాశారు. ఎస్కేయూ పరీక్షల అధికారులు రెండు తనిఖీ బృందాలను నియమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కళాశాలకు రానక్కర్లేదు ఎస్కేయూ అనుబంధ పీజీ సెంటర్లలో ఇష్టానుసారంగా విధానాలు అమలుచేస్తున్నా, ప్రశ్నించేవారు కరువయ్యారు. అడ్మిషన్ పొందినప్పటి నుంచి విద్యార్థి ఏ ఒక్క రోజు కళాశాలకు రావాల్సిన అవసరం ఉండదు. నేరుగా పరీక్షలకు హాజరై కళాశాలలు నిర్ధేశించిన మొత్తం కడితే విద్యార్థులు చూసిరాయడానికి కావలసిన అన్ని తతంగాలు నడిపిస్తారు. ప్రైవేటు అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు ఉన్నట్లు కూడా తెలియవంటే ఏ స్థాయిలో తరగతులు జరుగుతున్నాయో ..అర్థం చేసుకోవచ్చునని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. -
700 మంది వెళితే తిరిగి వచ్చినవారు 93 మంది మాత్రమే!
విశాఖపట్నం: ప్రభుత్వ అంచనా ప్రకారం ఏపీ నుంచి నేపాల్‌కు 700 మంది పర్యాటకులు వెళ్లారని సమాచార పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి రఘునాథ రెడ్డి తెలిపారు. అయితే వారిలో 93 మంది మాత్రమే తిరిగి వచ్చారని ఆయన చెప్పారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, మైనారిటీల సంక్షేమం చూడవలసిన బాధ్యతలను అప్పగిస్తూ మంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షులుగా వ్యవహరిస్తారని, ఎస్పీ, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారని ఆయన తెలిపారు. పేద, మైనార్టీల వివాహాలకు ప్రభుత్వ సహాయాన్ని 25 వేల రూపాయల నుంచి 50 వేల రూపాయలకు పెంచుతూ జీఓ జారీ చేసినట్లు మంత్రి పల్లె చెప్పారు. -
సమాజ హితంతో ముందుకెళ్దాం
ఓసీ సంక్షేమ సంఘం ఐకమత్యమే మన బలం పేద విద్యార్థులకు అండగా నిలుద్దాం సాక్షి, హైదరాబాద్: సమాజ హితమే రెడ్ల లక్షణమని, అనాదిగా వస్తున్న ఈ సంప్రదాయన్ని కొనసాగిద్దామని హోంమంత్రి నాయిని నర్సిం హారెడ్డి అన్నారు. ఓసీ సంక్షేమ సంఘం, రెడ్డి ఐక్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైన రెడ్డిజన లోక్‌సభ, శాసనసభ, శాసనమండలి సభ్యులకు ఆత్మీయ అభినంద సభ నిర్వహించారు. ఈ సం దర్భంగా నాయిని మాట్లాడుతూ అన్ని వర్గాలవారు బాగుంటేనే సమాజం బాగుంటుందన్నారు. ఓసీల్లోనూ పేదలకు అండగా నిలుద్దామన్నారు. ఏపీ ఐటీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ అందరికీ సామాజిక న్యాయం జరగాల్సి ఉందన్నారు. ఒకప్పుడు బాగున్న ఓసీలు.. రిజర్వేషన్లు లేక ఇబ్బందులు ఎదుక్కొంటున్నారన్నారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ గతం ఘనం గా, భవిష్యత్తు ఆందోళనకరంగా ఉందని చెప్పా రు. అనంతరం రెడ్డి ప్రజాప్రతినిధులందరినీ సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి, తెలంగాణ మంత్రు లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు అమరనాథరెడ్డి, సి. రామచంద్రారెడ్డి, వై. సాయిప్రసాద్ రెడ్డి, వై. బాలనాగిరెడ్డి, బి.రాజేంద్రనాథ్ రెడ్డి, బి. రాజశేఖర్‌రెడ్డి, జి. శ్రీకాంత్ రెడ్డి, ఆర్.ప్రతాప్ రెడ్డి, జె.వెంకటరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి. కరుణాకర్‌రెడ్డి, హోలిమేరీ, నలందా గ్రూఫ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ ఎ.వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సౌర విద్యుత్ విధానానికి ఓకే
కేబినెట్ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్ విధానం అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రైవేటు సంస్థలు ఏర్పాటుచేసే సౌర, పవన విద్యుత్ పార్కులకు సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు నెడ్‌క్యాప్‌ను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ.. వచ్చే ఐదేళ్ళలో 9 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుదుత్పాదన లక్ష్యంగా సంస్థలకు పలు రాయితీలను ప్రకటించింది. సరఫరా లైన్లు వాడుకున్నా పంపిణీ నష్టం లేకుండా విద్యుత్ సుంకం వంద శాతం రీయింబర్స్ చేయాలని నిర్ణయించింది. ఉత్పత్తిని నిరాటంకంగా చేసుకునేందుకు వీలుగా ఈ పాలసీని అమలు చేస్తామని తెలిపింది. రాష్ట్రంలో ఎక్కడ సోలార్ పార్కులు ఏర్పాటు చేసినా భూ మార్పిడికి సులభంగా అనుమతులు ఇవ్వడంతో పాటు, విద్యుత్‌ను రాష్ట్ర పరిధిలో అమ్ముకుంటే సర్‌చార్జీ విధించకుండా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులకు సర్కారు భూములను దీర్ఘకాలిక లీజులతో ఇవ్వడంతో పాటు భూమిని ముందే అప్పగించేందుకు గాను కలెక్టర్లకు నిర్ణయాధికారాలను అప్పగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. సోమవారం సచివాలయంలో సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ వివరాలను, తీసుకున్న నిర్ణయాల్ని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి మీడియాకు వివరించారు. 2019 నాటికి ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. 2015-16 సంవత్సరానికి రాష్ట్రంలో 58,191 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని, ఇందుకు రూ.30,300 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. చార్జీల పెంపు అనివార్యమంటూనే.. సరఫరా, పంపిణీ నష్టాలు తగ్గించడంతో పాటు విద్యుత్ చౌర్యం అరికట్టడం ద్వారా చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమైనట్టు పల్లె పేర్కొన్నారు. అక్రమ లే అవుట్ల క్రమబద్దీకరణ ఇలావుండగా బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్) కింద అక్రమ లే అవుట్లను, భవనాలను క్రమబద్దీకరించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి వివరించారు. అయితే రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీఏ) పరిధిలోనూ, ప్రభుత్వ భూముల్లోనూ, నీటి వనరుల్లో (వాటర్ బాడీస్) మాత్రం ఈ క్రమబద్దీకరణ వర్తించదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి 187 కేసులు నమోదైతే, 181 కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఆరు కేసులు పరిశీలనలో ఉన్నట్లు పల్లె చెప్పారు. ‘రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు కలవరపెడుతున్నాయని, వీటి పరిష్కారానికి సీఎస్ నేతృత్వంలో ఆర్అండ్బీ, పోలీస్, రవాణా, ఆర్టీసీ అధికారులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. పీహెచ్సీ వైద్యుల నుంచి జిల్లా స్థాయి వరకు, ఎమ్మార్వో నుంచి కలెక్టర్ వరకు క్షేత్ర స్థాయిలో పర్యటించి స్వైన్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా ఆదేశించామన్నారు. కంపెనీలకు భూ కేటాయింపులు గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద పదెకరాల్లో అమెరికా కంపెనీ పై డేటా సెంటర్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదించింది. ఎకరం రూ.కోటి చొప్పున 33 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే పలు కంపెనీలకు జరిపిన కేటాయింపుల వివరాలు కూడా మంత్రి సవివరంగా వెల్లడించారు. -
మంత్రి పల్లె రఘునాథరెడ్డికి గాయాలు: నిమ్స్ కు తరలింపు
హైదరాబాద్: సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రి పల్లె రఘునాథరెడ్డి కాలు జారిపడ్డారు. ఆయనకు రక్తపు గాయాలయ్యాయి. హుటాహుటిన ఆయనను నిమ్స్‌కు తరలించారు. సుగర్ వ్యాధి ఉన్న ఆయనకు గతంలోనే కాలిపై ఒక గాయం అయింది. ఈ రోజు కాలు జారిపడటంతో ఆ గాయంపైనే మళ్లీ గాయం అయింది. దాంతో రక్తం కారింది. ఆయన ఛాంబర్లో రక్తపు మరకలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు నిమ్స్‌లో చికిత్స చేస్తున్నారు. **