పీజీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్
► ప్రోత్సహిస్తున్న అనుబంధ కళాశాలల సిబ్బంది
► పల్లె కళాశాలలో అడ్డూఅదుపు లేని వైనం
ఎస్కేయూ: డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించిన అనుబంధ కళాశాలల యాజమాన్యాలు మరో అడుగు ముందుకు వేశారుు. తమ పరిధిని విస్తరించుకుని పీజీ పరీక్షల్లో సైతం బరితెగింపు ధోరణిలో మాస్ కాపీయింగ్‌ను అమలు చేస్తున్నారుు. మరోవైపు అనుబంధ పీజీ కళాశాలలు సిబ్బంది కూడా భారీ దందాకు తెరతీశారు. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 వేలు వసూలు చేసుకుని కాపీరుుంగ్‌కు సహకారం అందిస్తున్నారు. మంగళవారం ఎస్కేయూ క్యాంపస్ కళాశాలల్లో మాత్రం మెస్‌బిల్లులు, కోర్సు ఫీజులు విద్యార్థులు చెల్లించలేదని పరీక్ష నిలిచిపోయింది. అనుబంధ పీజీ కళాశాలల్లో మాత్రం మంగళవారం యథావిధిగా పరీక్షలు జరిగాయి.
సెల్ఫ్ సెంటర్లలో ఇష్టారాజ్యం
పీజీ అనుబంధ కళాశాలల్లోని విద్యార్థులను సమీపంలోని ప్రభుత్వ కళాశాలల్లోని పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే సెల్ఫ్ సెంటర్ల పేరుతో అనుమతులు ఇవ్వడంతో చూచిరాత పరీక్షలను తలపించాయి. కదిరిలోని వివేకానంద పీజీ కళాశాల మంత్రి పల్లె రఘనాథరెడ్డికి చెందిన విద్యాసంస్థల్లో ఒకటి. ఇక్కడ మంగళవారం జరిగిన పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలో విద్యార్థులు నేరుగా సెల్‌ఫోన్ నుంచి మెటీరియల్‌ను డౌన్‌లోడ్ చేసుకొని రాసుకున్నారు. మరికొంత మంది పుస్తకాలను చూసి చూచిరాత పరీక్షలు రాశారు. ఎస్కేయూ పరీక్షల అధికారులు రెండు తనిఖీ బృందాలను నియమించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
కళాశాలకు రానక్కర్లేదు
ఎస్కేయూ అనుబంధ పీజీ సెంటర్లలో ఇష్టానుసారంగా విధానాలు అమలుచేస్తున్నా, ప్రశ్నించేవారు కరువయ్యారు. అడ్మిషన్ పొందినప్పటి నుంచి విద్యార్థి ఏ ఒక్క రోజు కళాశాలకు రావాల్సిన అవసరం ఉండదు. నేరుగా పరీక్షలకు హాజరై కళాశాలలు నిర్ధేశించిన మొత్తం కడితే విద్యార్థులు చూసిరాయడానికి కావలసిన అన్ని తతంగాలు నడిపిస్తారు. ప్రైవేటు అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు ఉన్నట్లు కూడా తెలియవంటే ఏ స్థాయిలో తరగతులు జరుగుతున్నాయో ..అర్థం చేసుకోవచ్చునని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.