సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ విషయంలో ఉమ్మడి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని వర్గాల పేదలకు సబ్సిడీ రుణ సాయాన్ని ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రుణాల పంపిణీ విషయంలో కార్పొరేషన్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేసింది. ఆన్‌లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం ద్వారా అన్ని కార్పొరేషన్లు ఒకేసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఈ నెల 4న జీవో విడుదల చేసింది. డిసెంబరు నాటికి రుణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, అందుకు తేదీలను కూడా ఖరారు చేసింది. రుణాల పంపిణీ కోసం సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించాలని, ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. గతంలో రుణాల మంజూరు విషయంలో కార్పొరేషన్లు మార్చిలో నిర్ణయం తీసుకోవడం, మార్చి అయిపోయిన తరువాత ఆర్థిక సంవత్సరం మారిందంటూ పట్టించుకోకుండా వదిలేయడం వంటివి జరిగేవి.
అధికారుల ద్వారానే ఎంపిక
రుణాలు పొందే లబ్ధిదారులను బ్యాంకు అధికారులు, ఎంపీడీవో, కార్పొరేషన్‌ల ప్రతినిధులు ఎంపిక చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో జన్మభూమి కమిటీల సభ్యులు సంతకాలు చేస్తేనే రుణాలు తీసుకునేందుకు పేదలు అర్హత సాధించేవారు. ఆ పరిస్థితిని ప్రభుత్వం మార్చేసింది. అర్హుల జాబితాను నేరుగా కార్పొరేషన్ ఈడీకి పంపిస్తే, వారు కలెక్టర్ అనుమతి తీసుకుని నిధుల కోసం కమిషనర్‌కు పంపిస్తారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబరులో గ్రౌండింగ్ అయిన యూనిట్లకు జనవరిలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) ఇవ్వాలి.
ఫిబ్రవరిలో యూనిట్‌ను కార్పొరేషన్ ఈడీ సందర్శించి పరిశీలించాల్సి ఉంటుంది. మార్చిలో నిర్దేశిత ఏజెన్సీ ద్వారా యూనిట్ పనితీరును మరోసారి పరిశీలించాలి. రుణాల పంపిణీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర కార్పొరేషన్‌ల ద్వారా లబ్ధిదారులకు ఒకేసారి రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రుణాల పంపిణీకి ఉమ్మడి ప్రణాళిక
Published Mon, Sep 9 2019 4:03 AM | Last Updated on Mon, Sep 9 2019 5:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment