Loans Distribution
-
'మహిళా సంక్షేమమే మా తొలి ప్రాధాన్యత'
సాక్షి, విశాఖపట్నం : విశాఖ తగరపువలస జూట్ మిల్స్ గ్రౌండ్లో మహిళా సంఘాలకు రుణ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, జీవీఎంసీ కమిషనర్ జి. సృజన తదితరులు హాజరయ్యారు. ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పది సంవత్సరాల పోరాటం తర్వాత వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన అయిదు నెలల కాలంలోనే మేనిఫెస్టోలోని 80శాతం హామీలను నెరవేర్చామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే అన్ని వర్గాలకు మేలు చేసే 20 బిల్లులను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దేశంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50శాతం మేర రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతు భరోసా పథకం ద్వారా రైతలకు అండగా నిలబడుతున్నామని తలిపారు. కృష్ణా ,గోదావరి నదీ జలాల వినియోగంపై ఇతర రాష్ట్రాలతో సఖ్యతగా మెలుగుతూనే పరిష్కార మార్గాలకు ప్రత్యేక ప్రణాళిక నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఆదాయ వనరులిచ్చే మద్యాన్ని ఏ రాష్ట్రం వదులుకోదు, కానీ మా ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సంపూర్ణ మద్య నిషేదం రాష్ట్రంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నట్టు స్పష్టం చేశారు. దీనిలో భాగంగానే తొలిదశలో బెల్టు షాపుల నియంత్రణకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ అయిదేళ్ల పాలనలో పేదలకు 25 లక్షల ఇళ్లను ఇవ్వబోతున్నట్లు ఆయన తెలిపారు. విశాఖను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంపీ విజయసాయిరెడ్డి నిరంతరం కష్టపడుతున్నారని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. ప్రజాతీర్పును సహించలేకే టీడీపీ నేతలు బురద జల్లుతున్నారని విమర్శించారు. లోకేష్ రాజకీయ జీవితం ముగిసిపోయందన్న ఉక్రోశంలో చంద్రబాబు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని అమర్నాథ్ దుయ్యబట్టారు. నవరత్నాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. విశాఖ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రయత్నం కొనసాగిస్తామని వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ తెలిపారు. సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం విశాఖపట్నంలోని మధురవాడలో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల ఇంగ్లీషు మీడియం స్కూల్ లో రాష్ట్ర స్దాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీ వాణి సైన్స్ ఎగ్జిబిషన్‌ను లాంచనంగా ప్రారంభించారు . కార్యక్రమానికి పర్యాటక శాఖ మంత్రి ముత్తం శెట్టి శ్రీనివాసరావు, పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి బాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
రుణాల పంపిణీకి ఉమ్మడి ప్రణాళిక
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు తదితర కార్పొరేషన్ల ద్వారా రుణాల పంపిణీ విషయంలో ఉమ్మడి ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అన్ని వర్గాల పేదలకు సబ్సిడీ రుణ సాయాన్ని ఒకేసారి అందించేందుకు చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రుణాల పంపిణీ విషయంలో కార్పొరేషన్లు ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తుచేసింది. ఆన్లైన్ బెనిఫిషరీ మానిటరింగ్ సిస్టం ద్వారా అన్ని కార్పొరేషన్లు ఒకేసారి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ నెల 4న జీవో విడుదల చేసింది. డిసెంబరు నాటికి రుణాలు గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ, అందుకు తేదీలను కూడా ఖరారు చేసింది. రుణాల పంపిణీ కోసం సెప్టెంబరు నెలాఖరు వరకు దరఖాస్తులను స్వీకరించాలని, ఆ తరువాత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కావాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర్వులు ప్రభుత్వం ఇవ్వడం ఇదే మొదటిసారి. గతంలో రుణాల మంజూరు విషయంలో కార్పొరేషన్లు మార్చిలో నిర్ణయం తీసుకోవడం, మార్చి అయిపోయిన తరువాత ఆర్థిక సంవత్సరం మారిందంటూ పట్టించుకోకుండా వదిలేయడం వంటివి జరిగేవి. అధికారుల ద్వారానే ఎంపిక రుణాలు పొందే లబ్ధిదారులను బ్యాంకు అధికారులు, ఎంపీడీవో, కార్పొరేషన్ల ప్రతినిధులు ఎంపిక చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతంలో జన్మభూమి కమిటీల సభ్యులు సంతకాలు చేస్తేనే రుణాలు తీసుకునేందుకు పేదలు అర్హత సాధించేవారు. ఆ పరిస్థితిని ప్రభుత్వం మార్చేసింది. అర్హుల జాబితాను నేరుగా కార్పొరేషన్ ఈడీకి పంపిస్తే, వారు కలెక్టర్ అనుమతి తీసుకుని నిధుల కోసం కమిషనర్‌కు పంపిస్తారు. దీంతో ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబరులో గ్రౌండింగ్ అయిన యూనిట్లకు జనవరిలో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు(యూసీ) ఇవ్వాలి. ఫిబ్రవరిలో యూనిట్‌ను కార్పొరేషన్ ఈడీ సందర్శించి పరిశీలించాల్సి ఉంటుంది. మార్చిలో నిర్దేశిత ఏజెన్సీ ద్వారా యూనిట్ పనితీరును మరోసారి పరిశీలించాలి. రుణాల పంపిణీకి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు ఒకేసారి రుణాలు ఇవ్వాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
రుణాలిలా ..బతికేది ఎలా?
సాక్షి, అమరావతి: జీవనోపాధి కోసం ఎదురు చూస్తున్న షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వారికి రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రతి సంవత్సరం బ్యాంకు లింకేజ్డ్, నాన్ బ్యాంక్ లింకేజ్డ్ రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. నేషనల్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ పరిస్థితిని గమనిస్తే దళితుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. లక్ష్యాలు చూస్తే ఘనంగా ఉంటున్నాయి. ఆచరణలో మాత్రం వెక్కిరిస్తోంది. నిర్దేశిత లక్ష్యంలో మూడోవంతు మందికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. 2018–19లో ఇప్పటిదాకా లక్ష్యంలో కేవలం 8 శాతం మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేయడం గమనార్హం. సాకులు చెబుతున్న ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 80,002 మంది ఎస్సీలకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రూ.1,351.95 కోట్ల విలువైన యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ, 2018 డిసెంబరు 12వ తేదీ నాటికి కేవలం రూ.78.48 కోట్ల విలువైన యూనిట్లు 5,730 మందికి మాత్రమే పంపిణీ చేశారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకులను ఒప్పించి రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం సాకులు చెబుతూ తప్పించుకుంటోందని ఎస్సీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇది ప్రభుత్వ అసమర్థత ‘‘పేద ఎస్సీలకు రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వ అసమర్థత బయటపడుతోంది. ఎంతోమంది పేద ఎస్సీలు ప్రభుత్వ సాయం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాచరణ ప్రణాళికలు మాత్రం గొప్పగా ఉంటున్నాయి. రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం విఫలమవుతోంది’’ – కరవది సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి, దళిత హక్కుల పోరాట సమితి దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి ‘‘మరో నెలన్నరలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణాలు ఇవ్వలేమని ప్రభుత్వం తప్పించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి. బ్యాంకు లింకేజీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ – ఆండ్ర మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం -
రుణాల పంపిణీలో నిర్లక్ష్యం వద్దు!
– డిపాజిట్ల షేర్, రుణాల శాతంలో వ్యత్యాసం ఎందుకు? – బ్యాంకర్లను సూటిగా ప్రశ్నించిన కలెక్టర్ శ్రీదేవి మహబూబ్‌నగర్ న్యూటౌన్ : ‘అన్ని రంగాల్లో వ్యవసాయానిదే ప్రధాన పాత్ర.. రైతులకు కాలం కలిసిరాక వలసలు పోతూ, ఆత్మహత్యలకు పాల్పడుతూ దుర్భర జీవితాలు గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారిని ఆర్థికంగా ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.. వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ఎన్నో సమావేశాల్లో చర్చిస్తున్నా, ప్రభుత్వం ఆదేశిస్తున్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడంలేదు.. బ్యాంకర్లు తీరు మార్చుకోకపోతే ఆర్బీఐకి ఫిర్యాదు చేస్తా.. నని కలెక్టర్ డా.టీకే శ్రీదేవి హెచ్చరించారు. శుక్రవారం రెవెన్యూ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాంకర్ల సమీక్ష, సంప్రదింపుల సమావేశానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2016–17 సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళిక అమలుపై బ్యాంకర్లు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు అనుసరిస్తున్న తీరు ఏమాత్రం బాలేదని అసంతప్తిని వ్యక్తం చేశారు. డిపాజిట్ల షేర్‌కు, వ్యవసాయ, వ్యవసాయ అనుబంద రంగాలు, ఎంఎస్ఎంఈ రుణాల తీరును పరిశీలించి పురోగతిలో వ్యత్యాసంపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకర్ల తీరు మార్చుకోవాలని, వ్యవసాయ రుణాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శించరాదని సూచించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువ శాతం మంది ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నందున వ్యవసాయ రంగానికి నిర్దేశించిన ప్రకారం బ్యాంకర్లు రుణాలు అందజేయాలని ఆదేశించారు. లక్ష్యం పూర్తికావాలి బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జూన్ 30 నాటికి రుణ ప్రణాళికలో 34 శాతం లక్ష్యాలు సాధించగా వ్యవసాయ రంగానికి సంబంధించి 29 శాతం, కాల పరిమితి రుణాల కింద 14 శాతం, వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలకు 9 శాతం రుణాలు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ కాల పరిమితి రుణాలకు కేవలం 14 శాతం మాత్రమే బ్యాంకర్లు రుణాలివ్వడం సరికాదన్నారు. ముఖ్యంగా పాడి పరిశ్రమ రంగంలో కూడా జిల్లాలోని ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నందున ఈ రంగంలో కూడా రుణాలను ఎక్కువగా ఇవ్వాలని కోరారు. అలాగే జిల్లాలో అత్యధికంగా గొర్రెలు, పశు సంపద ఉందని, వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ, మత్స్య, అనుబంధ రంగాల్లో కూడా ఎక్కువగా ఆదాయం పొందేందుకు ఆస్కారం ఉన్నందున వీటిపై ఎక్కువ దష్టి కేంద్రీకరించాలని చెప్పారు. హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి బ్యాంకుల ద్వారా అందజేసే వివిధ రుణాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకు ఎల్డీఎం కార్యాలయంలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఐఈసీ మెటిరియల్‌ను కూడా సిద్ధంగా ఉంచాలని, వీలైతే ఎంపీడీఓ కార్యాలయంలో కూడా ఇలాంటి సమాచారాన్ని ఏర్పాటుచేస్తే లబ్ధిదారులకు అవకాశాలు ఉపయోగించుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ముద్ర రుణాలకు సంబంధించి అవగాహన కల్పించేందుకు సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. సారా మానేసిన కుటుంబాలకు రుణాలు ఇవ్వాలని కోరామని, ఆ ప్రక్రియ వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ వెంకటయ్యను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఎస్టీ, డీఆర్డీఏ, మెప్మాల ద్వారా బ్యాంకుల అనుసంధానంతో అమలుచేసే పథకాలపై సమీక్ష నిర్వహించారు. ఎల్డీఎం పార్థసారథి, టికె.బాలాజీరావ్, నాబార్డు ఏజీఎం అమితాబ్ ఘోష్, జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘రుణ’రంగం..!
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రుణాల పంపిణీ ఇప్పటికీ తేలలేదు. దాదాపు రూ.30 వేల కోట్ల అప్పులపై తెలంగాణ, ఏపీల మధ్య పీటముడి పడింది. రాష్ట్ర విభజన ముందు వరకు సమైక్య రాష్ట్రానికి రూ. 1.78 లక్షల కోట్ల అప్పు ఉంది. గత బడ్జెట్ నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను పంపిణీ చేసింది. పక్కాగా ఉన్న ఆడిట్ లెక్కల ప్రకారం రూ.1.48 లక్షల కోట్ల అప్పులు పంపిణీ చేయగా, రూ.30 వేల కోట్ల అప్పుల పంపకం పూర్తి కాలేదు. ప్రస్తుతం వీటికి వడ్డీని ఏపీ సర్కారే చెల్లిస్తోంది. నాబార్డు, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి వివిధ పథకాలకు విడుదలైన నిధులు, మౌలిక సదుపాయాలకు జైకా విడుదల చేసిన నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణకు రాష్ట్రానికి మంజూరైన నిధుల విషయంలోనే గందరగోళం నెలకొంది. వీటిలో తెలంగాణ ప్రాంతానికి ఎంత ఖర్చు చేశారు.. ఏపీలోని జిల్లాలకు ఎంత కేటాయించారనే అంశంపై మల్లగుల్లాలు తొలగిపోలేదు. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదిదాటినా ఈ వివాదం సమసిపోలేదు. ఆర్టీసీది ఒక మచ్చుతునక... మిగులు అప్పును అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం రికార్డుల ఆధారంగా పంచుకోవాలా? లేక తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించి ఆస్తులు, అప్పుల విభజనకు నియమించిన షీలా బిడే కమిటీ సూచనల మేరకు పంచాలా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వివరాలన్నీ తమకు తాముగా సిద్ధం చేసుకున్నాయి. ఉమ్మ డి రాష్ట్రంలో జమా ఖర్చుల వివరాలన్నీ ఏజీ కార్యాలయం రికార్డు చేసింది. ఏజీ రికార్డులే అప్పుల పంపిణీకి కీలకంగా మారాయి. కానీ, కొన్ని సంస్థల్లో ప్రభుత్వం చూపిస్తున్న పెట్టుబడుల లెక్కల్లో తేడాలుండటంతో వివాదాస్పదమైంది. ఉదాహరణకు ఆర్టీసీ లాంటి సంస్థకు ఉమ్మడి ప్రభుత్వం వివిధ రూపాల్లో దాదాపు రూ. 5 వేల కోట్లు కేటాయించినట్లు ఏజీ రికార్డులు చెబుతున్నాయి. కానీ తమకు ఉమ్మడి రా ష్ట్రం కేవలం రూ.2 వేల కోట్లే కేటాయిం చిందని, మిగతా చెల్లింపులన్నీ బకాయిలని ఆర్టీసీ లెక్కలు వేలెత్తి చూపుతున్నాయి. దీంతో మిగతా రూ.3 వేల కోట్లను రుణంగా పరిగణిం చాలా? లేదా? అనేది చిక్కుముడి. ఆర్టీసీ తరహాలో మిగతా సంస్థల్లోనూ ఇలాంటి తేడాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. సరిచూసుకోవాలి ప్రధానంగా తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థల పెట్టుబడులు, ఖర్చుల వివరాల్లోనే ఈ గందరగోళం ఉంది. అందుకే ఏజీ రికార్డుల్లో ఉన్న రుణాలు నిజంగా పంపిణీ అయ్యాయా? గ్రాంట్లుగా మంజూరయ్యాయా? లేక సర్కారు రుణంగా ఇస్తే సంస్థలు గ్రాంట్లుగా చూపించుకున్నాయా? అనేది సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన అప్పును ఏజీ రికార్డుల ప్రకారం పంచాలంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. ఇది సరికాదంటూ తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. సంస్థల దగ్గరున్న రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. లేకుంటే షీలాబిడే కమిటీ సైతం భవిష్యత్తులో ఈ విషయాన్ని వేలెత్తి చూపుతుందని తెలంగాణ వాదిస్తోంది. అప్పుల వడ్డీల భారం పడుతుండటంతో పాటు.. వడ్డీల చెల్లింపుల విషయంలోనూ రుణాలిచ్చిన సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో వీలైనంత త్వరగాఅప్పులు పంచుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులు సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చారు. వచ్చే వారం వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్రం జోక్యం చేసుకొని ఏజీని రంగంలోకి దింపే అవకాశముంది.