‘రుణ’రంగం..! | Joint State In the The Distribution of loans | Sakshi
Sakshi News home page

‘రుణ’రంగం..!

Published Mon, Jul 20 2015 1:10 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

‘రుణ’రంగం..! - Sakshi

‘రుణ’రంగం..!

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రుణాల పంపిణీ ఇప్పటికీ తేలలేదు. దాదాపు రూ.30 వేల కోట్ల అప్పులపై తెలంగాణ, ఏపీల మధ్య పీటముడి పడింది. రాష్ట్ర విభజన ముందు వరకు సమైక్య రాష్ట్రానికి రూ. 1.78 లక్షల కోట్ల అప్పు ఉంది. గత బడ్జెట్ నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పులను పంపిణీ చేసింది. పక్కాగా ఉన్న ఆడిట్ లెక్కల ప్రకారం రూ.1.48 లక్షల కోట్ల అప్పులు పంపిణీ చేయగా, రూ.30 వేల కోట్ల అప్పుల పంపకం పూర్తి కాలేదు. ప్రస్తుతం వీటికి వడ్డీని ఏపీ సర్కారే చెల్లిస్తోంది.

నాబార్డు, ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి వివిధ పథకాలకు విడుదలైన నిధులు, మౌలిక సదుపాయాలకు జైకా విడుదల చేసిన నిధులు, కేంద్ర ప్రభుత్వ పథకాల నిర్వహణకు రాష్ట్రానికి మంజూరైన నిధుల విషయంలోనే గందరగోళం నెలకొంది. వీటిలో తెలంగాణ ప్రాంతానికి ఎంత ఖర్చు చేశారు.. ఏపీలోని జిల్లాలకు ఎంత కేటాయించారనే అంశంపై మల్లగుల్లాలు తొలగిపోలేదు. ఇరు రాష్ట్రాల్లోనూ కొత్త ప్రభుత్వాలు ఏర్పడి ఏడాదిదాటినా ఈ వివాదం సమసిపోలేదు.
 
ఆర్టీసీది ఒక మచ్చుతునక...
మిగులు అప్పును అకౌంటెంట్ జనరల్ (ఏజీ) కార్యాలయం రికార్డుల ఆధారంగా పంచుకోవాలా? లేక తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థలకు సంబంధించి ఆస్తులు, అప్పుల విభజనకు నియమించిన షీలా బిడే కమిటీ సూచనల మేరకు పంచాలా? అనేది ప్రశ్నార్థకంగా ఉంది. విభజన అనంతరం ఇరు రాష్ట్రాలు ఆస్తులు, అప్పులు, పెట్టుబడుల వివరాలన్నీ తమకు తాముగా సిద్ధం చేసుకున్నాయి. ఉమ్మ డి రాష్ట్రంలో జమా ఖర్చుల వివరాలన్నీ ఏజీ కార్యాలయం రికార్డు చేసింది. ఏజీ రికార్డులే అప్పుల పంపిణీకి కీలకంగా మారాయి. కానీ, కొన్ని సంస్థల్లో ప్రభుత్వం చూపిస్తున్న పెట్టుబడుల లెక్కల్లో తేడాలుండటంతో వివాదాస్పదమైంది.

ఉదాహరణకు ఆర్టీసీ లాంటి సంస్థకు ఉమ్మడి ప్రభుత్వం వివిధ రూపాల్లో దాదాపు రూ. 5 వేల కోట్లు కేటాయించినట్లు ఏజీ రికార్డులు చెబుతున్నాయి. కానీ తమకు ఉమ్మడి రా ష్ట్రం కేవలం రూ.2 వేల కోట్లే కేటాయిం చిందని, మిగతా చెల్లింపులన్నీ బకాయిలని ఆర్టీసీ లెక్కలు వేలెత్తి చూపుతున్నాయి. దీంతో మిగతా రూ.3 వేల కోట్లను రుణంగా పరిగణిం చాలా? లేదా? అనేది చిక్కుముడి. ఆర్టీసీ తరహాలో మిగతా సంస్థల్లోనూ ఇలాంటి తేడాలున్నాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
 
సరిచూసుకోవాలి
ప్రధానంగా తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థల పెట్టుబడులు, ఖర్చుల వివరాల్లోనే ఈ గందరగోళం ఉంది. అందుకే ఏజీ రికార్డుల్లో ఉన్న రుణాలు నిజంగా పంపిణీ అయ్యాయా? గ్రాంట్లుగా మంజూరయ్యాయా? లేక సర్కారు రుణంగా ఇస్తే సంస్థలు గ్రాంట్లుగా చూపించుకున్నాయా? అనేది సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన అప్పును ఏజీ రికార్డుల ప్రకారం పంచాలంటూ ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది.

ఇది సరికాదంటూ తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. సంస్థల దగ్గరున్న రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతోంది. లేకుంటే షీలాబిడే కమిటీ సైతం భవిష్యత్తులో ఈ విషయాన్ని వేలెత్తి చూపుతుందని తెలంగాణ వాదిస్తోంది. అప్పుల వడ్డీల భారం పడుతుండటంతో పాటు.. వడ్డీల చెల్లింపుల విషయంలోనూ రుణాలిచ్చిన సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో వీలైనంత త్వరగాఅప్పులు పంచుకోవాలని రెండు రాష్ట్రాల అధికారులు సూచనప్రాయంగా అంగీకారానికి వచ్చారు. వచ్చే వారం వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఏకాభిప్రాయం కుదరకపోతే కేంద్రం జోక్యం చేసుకొని ఏజీని రంగంలోకి దింపే అవకాశముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement