సిరిసిల్ల: విదేశాల్లో స్థిరపడ్డ వారంతా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి చూపుతున్నారు. వారంతా నిత్యం ఇక్కడ ఉన్న మిత్రులతో టచ్‌లో ఉంటున్నారు. పోలింగ్ సరళి, స్థానిక రాజకీయాలపై చర్చిస్తున్నారు. జనం ఎటు వైపు ఓట్లు వేశారు.. ఎంత పోలింగ్ జరిగింది.. ఎవరు గెలుస్తారంటూ.. ఫోన్‌లలో మిత్రులను ఆరా తీస్తున్నారు. ఆదివారం ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో శనివారం రాత్రి నుంచే మిత్రులకు, బంధువులకు ఫోన్‌లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లా అంతటా వలసలే..
కరీంనగర్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గల్ఫ్ దేశాల్లో 1.20 లక్షల మంది ఉపాధి పొందుతుండగా వారి కుటుంబాలకు చెందిన మరో 5 లక్షల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, మానకొండూరు, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాలకు చెందిన వారు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉన్నారు. ఎన్నికల సమయంలో వాళ్లంతా ఓటుహక్కు వినియోగించుకోలేకపోయినా కుటుంబసభ్యులతో ఫోన్‌లో టచ్‌లో ఉన్నారు. ప్రతీక్షణం ఎన్నికల సరళిపై ఆరా తీశారు.
ఎన్నారై పాలసీపై ఆశలు..
కేరళ తరహాలో విదేశీ విధానంపై తెలంగాణ ప్రభు త్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని గల్ఫ్ వలసజీవులు ఆశిస్తున్నారు. నిజానికి వీసా ఉండి గల్ఫ్ దేశాలకు వెళ్లే వారికి తక్కువ వడ్డీతో బ్యాంకు రుణవసతి కల్పించడం, గల్ఫ్ సమస్యల పరిష్కారానికి జిల్లా కేంద్రంలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం, నకిలీ ఏజెంట్లను కట్టడిచేయడం, చట్టబద్ధమైన ఏజెన్సీల ద్వారా గల్ఫ్ దేశాలకు పంపడం, పొరుగుదేశాలకు వెళ్లేవారికి ఏదో ఒక రంగంలో నైపుణ్య శిక్షణనివ్వడం, అక్కడి పరిస్థితులపై ముందే అవగాహన కల్పించడం వంటి విధానాలను ఎన్నారై పాలసీలో రూపొందించాలని గల్ఫ్ వలస జీవులు కోరుతున్నారు.
రూ.వంద కోట్ల బడ్జెట్‌ను ఏటా కేటాయిస్తూ గల్ఫ్ వలసజీవుల ఇబ్బందులను పరిష్కరించాలని వలస కార్మికులు కోరుతున్నారు. మనుషులు అక్కడే ఉన్నప్పటికీ మనసులు మాత్రం ఎన్నికల ఫలితాలపైనే ఉన్నా యి. తమ సొంత నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారు.. మెజార్టీ ఎంత వస్తుందని ఆరా తీస్తున్నారు.
నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి..
మాది వేములవాడ నియోజకవర్గంలోని కోనరావుపేట మండలం శివంగాలపల్లె. నేను మలేసియాలో దశాబ్దకాలంగా ఉద్యోగం చేస్తున్న. తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ప్రతిరోజూ పరిశీలిస్తున్న. ప్రచార సభలను కూడా టీవీల్లో చూశాను. ఎన్నికల సరళి, ఎగ్జిట్ పోల్స్‌ను కూడా తెలుసుకుంటున్నాం. ఏ ప్రభుత్వం ఏర్పడుతుందో అనే ఆసక్తి మా దగ్గర ఉండే తెలంగాణ వాసులు అందరిలోనూ ఉంది. – శివంగాల రమేశ్, మలేసియా
ఏ పార్టీ గెలుస్తుందోనని..
మాది సిరిసిల్ల. ఎక్కడ ఉన్నా.. ఇండియాలో.. ప్రధానంగా మన తెలంగాణ రాజకీయాలపై ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని చూస్తున్నాం. సోషల్ మీడియా, వాట్సాప్‌లలో వచ్చే వాటిని పరిశీలిస్తుంటాం. ఇటీవల ఇక్కడ వీకెండ్స్‌లో రాజకీయాలపైనే చర్చలు సాగుతున్నాయి. ఈసారి తెలంగాణలో ఎన్నికలు భిన్నంగా ఉన్నా యి. ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠగా ఉంది. – నక్క శశికుమార్, హాంకాంగ్
గల్ఫ్‌కార్మికుల బాధలు తీరాలి
మాది కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం. ఎవరు గెలిచినా గల్ఫ్ కార్మికుల బాధలు తీర్చే ప్రభుత్వం రావాలి. నిజానికి ఎన్‌ఆర్‌ఐ పాలసీ తెస్తామని హామీ ఇచ్చి విస్మరించారు. గల్ఫ్ కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేస్తామన్నారు. కానీ అమలు కాలేదు. గల్ఫ్ కార్మికులకు దీర్ఘకాలిక ప్రయోజనం కలిగించే ప్రభుత్వాలు రావాలని ఆశిస్తున్నాం. ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఉంది. – ఎస్వీ రెడ్డి, దుబాయ్
Comments
Please login to add a commentAdd a comment