ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి  | Telangana interested in AP education reforms | Sakshi
Sakshi News home page

ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి 

Published Sat, Aug 12 2023 4:00 AM | Last Updated on Sat, Aug 12 2023 7:31 PM

Telangana interested in AP education reforms - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆసక్తి చూపుతోంది. గత నాలుగేళ్లుగా మన విద్యాశాఖలో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీని వినియోగించి అనేక విజయాలు సాధించారు. విద్యార్థి దినచర్యను పాఠశాల నుంచి రాష్ట్రస్థాయిలో ప్రిన్సిపల్‌ కార్యాదర్శి, ముఖ్యమంత్రి వరకు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు బడిబయటి పిల్లలను ట్రాక్‌ చేయడంలో సాధించిన విజయాలు, మధ్యాహ్న భోజనం అమలు తీరును తెలంగాణ అధికారులు పరిశీలించారు.

ఇటీవల ఏపీకి వచ్చిన తెలంగాణ సమగ్ర శిక్ష అధికారులు ఇక్కడి అధికారులతో సమావేశమై ఐటీ వినియోగంతో సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 58,685 పాఠశాలలు, 70.64 లక్షలమంది విద్యార్థులు, మూడులక్షలకు పైగా ఉపాధ్యాయులను నూరుశాతం పర్యవేక్షిస్తున్న తీరుకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సిమ్స్‌) ద్వారా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఒక్కటి చేయడాన్ని అడిగి తెలుసుకున్నారు.

యాప్స్‌ ద్వారా విద్యార్థుల హాజరు తీసుకోవడం, అదే సమయంలో మధ్యాహ్న భోజనం చేసేవారి సంఖ్యను లెక్కించడం, పాఠశాల ప్రాంగణంలోనే ఉపాధ్యాయుల హాజరును ఫేషియల్‌ రికగ్నిషన్‌ ద్వారా నమోదు చేయడాన్ని అభినందించారు. రాష్ట్రస్థాయిలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ అమలును తమ రాష్ట్రంలోను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపించారు.  

సిమ్స్, యాప్స్‌ పనితీరును వివరించిన అధికారులు 
విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం (సిమ్స్‌), దానికి అనుసంధానంగా కీలక విభాగాలకు మొబైల్‌ యాప్స్‌ రూపకల్పన ద్వారా విద్యార్థి ట్రాకింగ్‌ను ఏపీ సమగ్ర శిక్ష అధికారులు తెలంగాణ అధికారుల బృందానికి వివరించారు. ఇందులో ప్రధానంగా స్కూల్‌ ఇన్ఫర్మేషన్‌ విభాగంలో పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం అమలు, చేస్తున్న మార్పులను నమోదు చేస్తారు.

టీచర్స్‌ ప్రొఫైల్‌లో వారి హాజరు, ఎన్‌వోసీ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, సెలవులు, గ్రీవెన్స్‌ వంటివి, విద్యార్థుల విభాగంలో ఆధార్‌ నంబరు ఆధారంగా విద్యార్థి పాఠశాలలో ఉన్నారా, బడిబయట ఉన్నారా అని ట్రాకింగ్‌ చేసి, గ్రామ, వార్డు కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరించి వారిని తిరిగి బడిలో చేరుస్తున్నారు. ఇలా గత విద్యాసంవత్సరంలో సుమారు లక్షమంది పిల్లలను తిరిగి బడిలో చేర్చారు. ఐటీ సంస్కరణలతో తక్కువ కాలంలోనే వేగవంతమైన విజయా­లు నమోదు చేయడాన్ని తెలంగాణ అధికారులు అభినందించారు.

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ద్వారా ప్రతి పాఠశాలను, విద్యార్థిని ప్రతిరోజు పర్యవేక్షించడం, వారి పనితీరును తెలుసుకోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటిలో కొన్నింటిని తెలంగాణలోను అమలు చే­యా­లని నిర్ణయించారు. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం ‘మనబడి: నాడు–నేడు’ పథకాన్ని ప్రవేశపెట్టి సాధించిన విజయాన్ని పరిశీలించిన తెలంగాణ అధికారులు వారి రాష్ట్రంలో ‘మన ఊరు–మన బడి’ పేరుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టా­రు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement