సాక్షి, అమరావతి: జీవనోపాధి కోసం ఎదురు చూస్తున్న షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వారికి రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రతి సంవత్సరం బ్యాంకు లింకేజ్డ్, నాన్ బ్యాంక్ లింకేజ్డ్ రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. నేషనల్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ పరిస్థితిని గమనిస్తే దళితుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. లక్ష్యాలు చూస్తే ఘనంగా ఉంటున్నాయి. ఆచరణలో మాత్రం వెక్కిరిస్తోంది. నిర్దేశిత లక్ష్యంలో మూడోవంతు మందికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. 2018–19లో ఇప్పటిదాకా లక్ష్యంలో కేవలం 8 శాతం మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేయడం గమనార్హం.
సాకులు చెబుతున్న ప్రభుత్వం
2018–19 ఆర్థిక సంవత్సరంలో 80,002 మంది ఎస్సీలకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రూ.1,351.95 కోట్ల విలువైన యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ, 2018 డిసెంబరు 12వ తేదీ నాటికి కేవలం రూ.78.48 కోట్ల విలువైన యూనిట్లు 5,730 మందికి మాత్రమే పంపిణీ చేశారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకులను ఒప్పించి రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం సాకులు చెబుతూ తప్పించుకుంటోందని ఎస్సీ సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఇది ప్రభుత్వ అసమర్థత
‘‘పేద ఎస్సీలకు రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వ అసమర్థత బయటపడుతోంది. ఎంతోమంది పేద ఎస్సీలు ప్రభుత్వ సాయం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాచరణ ప్రణాళికలు మాత్రం గొప్పగా ఉంటున్నాయి. రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం విఫలమవుతోంది’’
– కరవది సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి, దళిత హక్కుల పోరాట సమితి
దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి
‘‘మరో నెలన్నరలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణాలు ఇవ్వలేమని ప్రభుత్వం తప్పించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి. బ్యాంకు లింకేజీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’
– ఆండ్ర మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం
Comments
Please login to add a commentAdd a comment