State government funding
-
వెయ్యి కోసం ఎన్ని కష్టాలో
సాక్షి, పెద్దారవీడు: ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రభుత్వానికి రైతులపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. నాలుగున్నరేళ్లుగా రైతుల సంక్షేమాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం ఓట్ల కోసం ఒక్క సారిగా వరాల జల్లు కురిపించింది. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా రూ. 6 వేలు ప్రకటిస్తే దాన్ని తప్పుదోవ పట్టించిన చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించింది. కేంద్రం కంటే తామే ఎక్కువ రైతుల కష్టాలు తీరుస్తాన్నామంటూ ప్రకటించుకుంటోంది. రుణమాఫీ అంశాన్ని పూర్తిగా పక్కదారి పట్టించడానికి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రవేశ పెట్టిన అన్నదాతా సుఖీభవ పథకాన్ని తూతూ మంత్రంగా అమలు చేశారని రైతులు వాపోతున్నారు. కార్యాలయం చుట్టూ రైతుల ప్రదక్షిణలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఈ పథకానికి 19 పంచాయతీలలో 7,153 మంది రైతులను అర్హులుగా అధికారులు గుర్తించారు. ఇందులో ఇప్పటికీ రూ. 1,000 జమకాని రైతులు మండలంలో 950 మంది రైతులు ఉన్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 15 వేలు చెల్లించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సుఖీభవ పథకం ద్వారా రూ. 1,000, కేంద్ర ప్రభుత్వం రూ. 2 వేలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. ప్రస్తుతం అందిస్తున్న రూ. 1,000 చాలా మందికి రైతుల ఖాతాలో పడని పరిస్థితి. ఈ పరిస్థితి ఎక్కువగా బ్యాంకు అకౌంట్‌కు, రేషన్‌కార్డుకు, ఆధార్‌కార్డుకు అనుసంధానం కాని రైతుల ఖాతాలకు నగదు జమ కావడంలేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నగదు జమ కాని రైతులు వ్యవసాయ, రెవెన్యూ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ పనులు మానుకొని కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. దీని కన్నా గతంలో ప్రభుత్వం ప్రకటించిన విధంగా సంపూర్ణ రుణమాఫీ చేసి ఉంటే తమకు రుణ బాధలు తప్పేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి అర్హులందరికీ న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. ఒక్క రూపాయి జమ కాలేదు అన్నదాతా సుఖీభావ పథకం ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకూ బ్యాంకు ఖాతాలో ఒక్క రూపాయి కూడా పడలేదు. అధికారులను అడిగితే భూమికి సంబంధించిన ఆన్లైన్, ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జీరాక్స్ కాగితాలు ఇస్తే ఆన్లైన్లో నమోదు చేస్తామన్నారు. త్వరలో నగదు బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. – శిరసాని కాశిరెడ్డి, రైతు, రేగుమానిపల్లె గ్రామం తప్పులు సరి చేస్తున్నాం రైతులకు సంబంధించి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సరిగా లేకపోవడంతో మండల వ్యాప్తంగా 950 మంది రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద నగదు జమకాలేదు. ఇందులో 390 మంది రైతుల వివరాలు సరిచేసి అప్లోడ్ చేశాం. ఇంకా 560 మంది రైతుల వివరాలు సరిచేయాలి. మిగత రైతులు కూడా త్వరగా వచ్చి అప్లోడ్ చేసుకోవాలని సంబంధిత ఎంపీఈఓలకు గ్రామాల్లో రైతులకు తెలియజేయాలని చెప్పాం. అప్లోడ్ చేసిన వారానికి నగదు జమ అవుతుంది. –బుజ్జీబాయి, ఇన్చార్జి వ్యవసాయాధికారి, పెద్దారవీడు -
రుణాలిలా ..బతికేది ఎలా?
సాక్షి, అమరావతి: జీవనోపాధి కోసం ఎదురు చూస్తున్న షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) వారికి రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ప్రతి సంవత్సరం బ్యాంకు లింకేజ్డ్, నాన్ బ్యాంక్ లింకేజ్డ్ రుణాలు ఇవ్వాల్సి ఉండగా, ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. నేషనల్ షెడ్యూల్డ్ కులాల ఫైనాన్స్ కార్పొరేషన్, నేషనల్ సఫాయి కర్మచారీ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా కూడా రుణాలు ఇవ్వడం లేదు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ ద్వారా రుణాలు పంపిణీ చేయాల్సి ఉంటుంది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ యాక్షన్ ప్లాన్ పరిస్థితిని గమనిస్తే దళితుల సంక్షేమం పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. లక్ష్యాలు చూస్తే ఘనంగా ఉంటున్నాయి. ఆచరణలో మాత్రం వెక్కిరిస్తోంది. నిర్దేశిత లక్ష్యంలో మూడోవంతు మందికి కూడా రుణాలు ఇవ్వడం లేదు. 2018–19లో ఇప్పటిదాకా లక్ష్యంలో కేవలం 8 శాతం మందికి మాత్రమే రుణాలు పంపిణీ చేయడం గమనార్హం. సాకులు చెబుతున్న ప్రభుత్వం 2018–19 ఆర్థిక సంవత్సరంలో 80,002 మంది ఎస్సీలకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు రూ.1,351.95 కోట్ల విలువైన యూనిట్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కానీ, 2018 డిసెంబరు 12వ తేదీ నాటికి కేవలం రూ.78.48 కోట్ల విలువైన యూనిట్లు 5,730 మందికి మాత్రమే పంపిణీ చేశారు. రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయని ప్రభుత్వం చెబుతోంది. బ్యాంకులను ఒప్పించి రుణాలు ఇప్పించాల్సిన ప్రభుత్వం సాకులు చెబుతూ తప్పించుకుంటోందని ఎస్సీ సంఘాలు విమర్శిస్తున్నాయి. ఇది ప్రభుత్వ అసమర్థత ‘‘పేద ఎస్సీలకు రుణాలు ఇప్పించడంలో ప్రభుత్వ అసమర్థత బయటపడుతోంది. ఎంతోమంది పేద ఎస్సీలు ప్రభుత్వ సాయం అందక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యాచరణ ప్రణాళికలు మాత్రం గొప్పగా ఉంటున్నాయి. రుణాలు ఇచ్చే విషయంలో మాత్రం విఫలమవుతోంది’’ – కరవది సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి, దళిత హక్కుల పోరాట సమితి దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి ‘‘మరో నెలన్నరలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రుణాలు ఇవ్వలేమని ప్రభుత్వం తప్పించుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ రుణాలు ఇవ్వాలి. బ్యాంకు లింకేజీ లేని రుణాలు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ – ఆండ్ర మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం -
ఆధునికీకరణ అంతంతే..
దర్శి, న్యూస్‌లైన్: నాగార్జున సాగర్ కాల్వల ఆధునికీకరణ పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి. సాగర్ కుడి, ఎడమ కాల్వల ఆధునికీకరణ పనులను ప్రపంచ బ్యాంకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.4,400 కోట్లతో చేపట్టారు. ఈ పనులు ఈ ఏడాది ఆగస్టులోపు పూర్తికావాల్సి ఉంది. కాంట్రాక్టర్ల ఒప్పందం ప్రకారం ఈ పనులు మూడేళ్లలో పూర్తిచేసేలా టెండర్లు వేశారు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు సకాలంలో పనులు పూర్తిచేయలేకపోతున్నారు. కుడి కాలువకు రూ.2400 కోట్లు వెచ్చిస్తుండగా.. ప్రకాశం జిల్లాకు రూ.439.68 కోట్లు.. అందులో దర్శి, త్రిపురాంతకం, అద్దంకి, చీమకుర్తి సబ్డివిజన్లకు ఐదు ప్యాకేజీలుగా రూ.234.27 కోట్లు కేటాయించారు. ఈ ప్యాకేజీల్లో ఇప్పటి వరకు 218 కోట్లు ఖర్చు చేశారు. 16.27 కోట్ల విలువైన పనులు ఆగస్టు లోపు పూర్తి కావాల్సింది. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ కమిటీలకు 196.68 కోట్లు కేటాయించారు. అందులో గత ఏడాది 78 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. 118.68 కోట్ల విలువైన పనులు ఆగస్టులోపే కాంట్రాక్టర్లు పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం మెయిన్ కాలువలకు 60 శాతం పనులు పూర్తి కాగా మేజర్ కాలువలకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. డబ్ల్యూఏ ప్రెసిడెంట్ పరిధిలో మైనర్ కాలువల మరమ్మతులకు ఇప్పటి వరకు టెండర్లు పిలవలేదు. చివరి భూములకు అందని నీరు... ఆధునికీకరణ పనులు పూర్తికాకపోతే చివరి భూములకు నీరందే పరిస్థితి ఉండదు. ఖరీఫ్ పంటకు కాలువ నీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఆధునికీకరణ పనులు ముందుకు సాగకపోవడంతో ఈ ఏడాది కూడా చివరి భూముల రైతులు నీటిపై ఆశలు వదులుకున్నారు. ప్రధానంగా రజానగరం మేజరు, త్రిపురాంతకం మండలం ముడివేముల, దర్శి మండలం యర్ర ఓబనపల్లి మేజర్‌కు నీరందే పరిస్థితుల్లేవు. యర్ర ఓబనపల్లి మేజరుకు కాలువలు చేసినప్పటికీ నీరందక కాంట్రాక్టరు కాలువను పూడ్చివేశారు. దానిని వెడల్పు చేయకుండా మళ్లీ చేస్తే ఆ కాలువ పనులకు బిల్లులు రావని ఆపడంతో గత ఏడాది రైతులు నిరందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చేసిన పనులకు బిల్లులు సకాలంలో రావడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఏదేమైనా ఆధునీకరణ పనులు ఆగ స్టులోపు పూర్తయితేనే రైతులకు పూర్తి స్థాయిలో నీరందుతుంది. లేకపోతే చివరి భూములకు నీరందడం క ష్టంగా మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు చేసిన పనులు పూర్తి కాకుండానే మధ్యలోనే మరమ్మతులకు గురవుతున్నాయి.