సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకాన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీని నాలుగైదు రోజుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాము నోటిఫై చేసే విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూసా పథకాన్ని అమలు చేస్తామని, ఆ విభాగం ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు తెలియజేయనుంది. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు దృష్టి సారించారు. రాష్ట్ర విభజన జరగకముందు రూసా అమలుకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అయితే విభ జన జరిగిన నేపథ్యంలో ఇటీవల ఏపీ ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు వేర్వేరుగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది.
ఏపీకి నోడల్ ఆఫీసర్‌గా కళాశాల విద్యా కమిషనర్ వ్యవహరిస్తారని పేర్కొంది. అయితే కళాశాల విద్యా కమిషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా పేర్కొనడం పట్ల అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నత విద్యా మండలికే ఆ బాధ్యతలు అప్పగించాలని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి పథకం అమలుకు ఎవరు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారనే విషయాన్ని కేంద్రానికి తెలియజేయలేదు. త్వరలోనే నోడల్ ఆఫీసర్‌ను నోటిఫై చేస్తూ కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను ప్రస్తుత తెలంగాణ కళాశాల విద్య కమిషనర్‌కే అప్పగించే అవకాశం ఉంది.
అయితే ఆ బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలికే అప్పగించాలనే వాదన ఉంది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం ప్రకటించనుంది. ఆ తర్వాత రూసా కింద నిధులు విడుదల కానున్నాయి. ఇక రూసా కింద రాష్ట్రలో మూడు కొత్త యూనివర్సిటీలు, రెండు క్లస్టర్ యూనివర్సిటీలు, 4 కొత్త మోడల్ డిగ్రీ కాలేజీలు, మరో 4 డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీలుగా అప్‌గ్రేడ్ చేయడం, 7 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రతిపాదించారు. ఒక్కో కాలేజీని రూ.26 కోట్లతో గజ్వేల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, వరంగల్‌లో (మహిళ) ఏర్పాటు చేయనున్నారు.
‘రూసా’ అమలుకు త్వరలో నోడల్ ఏజెన్సీ
Published Mon, Sep 8 2014 12:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
Advertisement