‘రూసా’ పట్టని ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పన.. 300 డిగ్రీ కాలేజీల అభివృద్ధి.. 12 కొత్త యూనివర్సిటీల ఏర్పాటు.. వంటి అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలకు ఉద్దేశించిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ పథకానికి సంబంధించి.. గత నెల 30నే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉండగా.. గడువు దాటిపోయి వారం గడుస్తున్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర పడలేదు. వాస్తవానికి గత నెల 28వ తేదీన ఉన్నత విద్యామండలి ఈ ప్రతిపాదనలను కొలిక్కి తెచ్చి.. డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన దామోదర రాజనర్సింహ ఆమోదానికి పంపించింది.
ఫైలు తనవద్దకొచ్చిన మూడు గంటల్లోనే ఆయన సంతకం చేసి అదేరోజు(28న) ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపించారు. కానీ సీఎం ఇంతవరకు ఈ ప్రతిపాదనలకు ఆమోదమే తెలపలేదు. ఒకవైపు టీచర్ల బదిలీల వంటి ఫైళ్లపై చకచకా సంతకం పెట్టేస్తున్న ముఖ్యమంత్రికి.. ఎంతో కీలకమైన పథకానికి సంబంధించిన ఫైలును పట్టించుకునే తీరిక లేకపోవడం గమనార్హం. దీంతో రూ.2,600 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు ఇంతవరకు కేంద్రానికి చేరలేదు. ఫలితంగా రాష్ట్రానికి ఈ పథకం మంజూరే చిక్కుల్లో పడింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అధికారులు ఇంకా ఆలస్యం చేస్తే కష్టమని చెబుతుండటంతో ఉన్నత విద్యామండలి అధికారులకు పాలుపోవట్లేదు.