Rusa scheme
-
రూసా నిధుల్లో చేతివాటం!
సాక్షి, ఏఎన్‌యూ(కృష్ణా) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూసా(రాష్ట్రీయ ఉచ్చాతర్ శిక్షా అభియాన్) పథకం కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మంజూరైన నిధుల వినియోగంలో గందరగోళం నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని, అన్న(మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు) అండదండలను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వర్సిటీ లైబ్రేరియన్ కోడెల వెంకటరావు రూసా పథకం కింద పుస్తకాలు కొనుగోలు విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూసా నిధుల కింద పుస్తకాలు కొనుగోలు చేశానంటూ యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు సమర్పించిన బిల్లులకు చెల్లింపులు చేయాలని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తుండగా, వీటిలో స్పష్టత లేదంటూ కొందరు అధికారులు తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. దీంతో కొంత కాలంగా ఈ అంశం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. పుస్తకాల కొనుగోలుపై అభ్యంతరాలు: రూసా పథకం కింద 2015–16, 2016–17 సంవత్సరాలకు నిధుల కోసం ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్(డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్)లో రూ.18 లక్షలు పుస్తకాల కొనుగోలు కోసం ప్రతిపాదనలు పంపారు. రూసా నుంచి ఏఎన్‌యూకి 2018లో ఈ నిధులు వచ్చాయి. దీంతో పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదించిన రూ.18 లక్షల విషయం తెరమీదకు వచ్చింది. దీంతో ప్రతిపాదిత సంవత్సరాల్లో తాను రూ.11.90 లక్షలకు పుస్తకాలు కొనుగోలు చేశానంటూ యూనివర్సిటీ లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు వర్సిటీకి బిల్లులు సమర్పించారు. బిల్లులు పరిశీలించిన రూసా అధికారులు పుస్తకాలు అవసరమంటూ విభాగాధిపతులు, సబ్జెక్ట్ ఎక్స్‌ఫర్ట్స్, అధ్యాపకులు, బీఓఎస్ చైర్మన్లు, విద్యార్థులు ఎవరైనా కోరినట్లు లేఖలు ఉండాలని, ఎవరూ కోరకుండా ఎలా పుస్తకాలు కొనుగోలు చేశారో స్పష్టం చేయాలని కోరినట్లు సమాచారం. చెల్లింపులపై ఒత్తిడి పుస్తకాల కొనుగోలుకు సమర్పించిన రూ.11.90 లక్షల బిల్లులకు రూసా నిధుల నుంచి చెల్లింపులు చేయాలని కొందరు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో చెల్లింపులు చేయాలంటూ ఉన్నతాధికారులు సంబంధిత ఫైలుపై లిఖిత పూర్వకంగా రాస్తే తమకు అభ్యంతరం లేదని కూడా రూసా అధికారులు పేర్కొన్నారు. ఏ విధంగానైనా పని జరగాలని చూసిన కొందరు అధికారులు రూసాకు ప్రతిపాదనలు పంపిన సంవత్సరాలకు గాను పుస్తకాల కొనుగోలుకు దాదాపు రూ.7 లక్షలకు యూనివర్సిటీ నిధుల నుంచి చెల్లింపులు చేశామని, ఈ మొత్తాన్ని రూసా ఫండ్ నుంచి యూనివర్సిటీ జనరల్ ఫండ్ ఎకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని రిజిస్ట్రార్ కార్యాలయం, ఎకౌంట్స్ విభాగం కోరినట్లు తెలిసింది. తీరా ఆ బిల్లులను పరిశీలిస్తే వాటిలో రూ.3 లక్షలు పుస్తకాల బైండింగ్‌కు చెల్లింపులు చేశామని పేర్కొన్నట్లు సమాచారం. ఏఎన్‌యూ లైబ్రరీలో బైడింగ్ విభాగం, దానిలో ప్రత్యేకంగా ఉద్యోగులు ఉండగా, బయట వ్యక్తులతో బైండింగ్ చేయించినట్లు బిల్లులు పెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కొన్ని పుస్తకాలకు 28 శాతం వరకు డిస్కౌంట్, కొన్ని పుస్తకాలకు 20 వరకు మాత్రమే డిస్కౌంట్ ఇవ్వడంపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణాలతోనే చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది. కోడెల తీరుపై విమర్శలు లైబ్రరీకి పుస్తకాల కొనుగోలు విషయంలో లైబ్రేరియన్ డాక్టర్ కోడెల వెంకటరావు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుస్తకాల కొనుగోలు చేయాలని కొందరు కోరారని చెబుతూ తన సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురు అధ్యాపకులు, తనకు అనుకూలంగా నడుచుకునే ఓ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపాల్ నుంచి లేఖలు సమర్పించారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై రూసా డైరెక్టర్ ప్రొఫెసర్ జీవీఎస్ఆర్ ఆంజనేయులును వివరణ కోరగా, రూసా నిధుల పుస్తకాల కొనుగోలు బిల్లుల చెల్లింపు విషయం కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. బిల్లులపై ఆరోపణల విషయం తనకు తెలియదని తెలిపారు. చెల్లింపులు చేయమని ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా ఆదేశాలిస్తే వెంటనే చెల్లింపులు చేస్తామని వివరించారు. -
మరో.. సారీ!
పశ్చిమ’పై తనకు ప్రత్యేక అభిమానం అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే జిల్లాకు విద్యాపరంగా మరో అన్యాయం జరుగుతోంది. ప్రతిష్టాత్మక నిట్ ఏర్పాటులో ఊరించి ఉస్సూరనిపించిన సర్కారు తాజాగా రూసా పథకం కింద జిల్లాకు రావాల్సిన యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోయినా కిమ్మనడం లేదు. తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం రూసా పథకం కింద జిల్లాలో ఏర్పాటు చేయదలచిన మరో యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోయింది. గతంలో ప్రతిపాదించిన ఒంగోలు, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో యూనివర్సిటీలను ఏర్పాటు చేయకూడదని కేంద్ర నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ పథకంలో పీజీ కేంద్రాలను వర్సిటీలుగా మార్చాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను తిరిగి పరిశీలించిన కేంద్రంలోని ఈ వ్యవహారాలు చూసే అధికారులు తాజాగా కొత్త నిర్ణయాలను తీసుకున్నారు. అటానమస్ కళాశాలలను మాత్రమే యూనివర్శిటీలుగా రూసా పథకంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు, ఈ క్రమంలో తూర్పుగోదావరిలోని రాజమండ్రి, కాకినాడలో వర్శిటీలు రూసా పథకంలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లాకు మొండి చెయ్యి చూపించినట్టే. జిల్లాకు ఉపయుక్తంగా ఉండేది ఈ వర్శిటీ వస్తే, అకడమిక్ విద్యా కోర్సులకు భిన్నంగా, జిల్లాకు ఉపయుక్తంగా ఉండే, ైరె తాంగానికి మేలు చేసే, పరిశోధనలకు అవకాశం కల్గించే కోర్సులు అందుబాటులోకి వచ్చేవి. గతంలో వర్శిటీ ప్రతిపాదన వచ్చిన సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారుల బృందం కేంద్రానికి ఏఏ కోర్సులు ఏర్పాటు చేయాలనే విషయంలో ప్రతిపాదనలను పంపింది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకంలో జిల్లాకు ఒక యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి గాను 2014 లో కేంద్రం ప్రతిపాదనలను కోరింది. ఈ పథకం కింద జిల్లాలో వర్శిటీ ఏర్పాటుకు గాను ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం వంటి ప్రాంతాలను చూశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విమానాశ్రయ రన్‌వే సమీపంలో తాడేపల్లిగూడెంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ రూసా పథకంలో వర్శిటీకి అనుకూలమని నివేదికలను కేంద్రానికి సమర్పించారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఎన్నికలు ముగిశాక, ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికై దేవాదాయ ధర్మాదాయశాఖా మంత్రి అయిన పైడికొండల మాణిక్యాలరావు గూడెంకు మరో యూనివర్శిటీ రానుందని ప్రకటించారు. రూసా పథకంలోది కాకుండా మరో కొత్త వర్శిటీ వస్తుందని జిల్లా ప్రజలు ఆశించారు. కాని ఈ విషయంలోనే నిట్ మాదిరే నిరాశ ఎదురయింది. సమగ్ర నివేదిక సమర్పించినా.. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జీఎస్ఎన్ రాజు, రిజిస్ట్రార్, గూడెంలోని ఏయూ క్యాంపస్ ఇన్చార్జి ప్రత్యేకాధికారి జి.సుధాకర్‌లు సమగ్ర సమాచారం కేంద్రానికి అందచేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఉన్నత విద్యను చేరువ చేసే సంకల్పంతో కేంద్రంలోని మానవవనరుల మంత్రిత్వ శాఖ సేకరించిన వివరాల ఆధారంగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి అందించిన సమాచారం క్రోడీకరించుకొని కొత్తగా వర్సిటీలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ పథకంలో రాష్ట్రంలో 12 కొత్త వర్సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ గత ఏడాది ఫిబ్రవరి నుంచి వేగవంతం అయింది. ఒక్కో యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.55 కోట్లు వెచ్చించాలని, మూడేళ్లలో రూ.2600 కోట్లతో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చే యాలని అప్పట్లో భావించారు. కొత్త వర్సిటీల ఏర్పాటుకు వెచ్చించే నిధులలో 65 శాతం కేంద్రం వెచ్చిస్తుంది. మిగిలిన 35 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూసా పథకం, -
‘రూసా’ అమలుకు త్వరలో నోడల్ ఏజెన్సీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకాన్ని అమలు చేసే నోడల్ ఏజెన్సీని నాలుగైదు రోజుల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాము నోటిఫై చేసే విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూసా పథకాన్ని అమలు చేస్తామని, ఆ విభాగం ఆధ్వర్యంలో విద్యాభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని కేంద్ర మానవవనరుల మంత్రిత్వ శాఖకు తెలియజేయనుంది. విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు ఈ మేరకు దృష్టి సారించారు. రాష్ట్ర విభజన జరగకముందు రూసా అమలుకు కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు. అయితే విభ జన జరిగిన నేపథ్యంలో ఇటీవల ఏపీ ఉన్నత విద్యా మండలి ఆంధ్రప్రదేశ్‌కు, తెలంగాణకు వేర్వేరుగా ప్రతిపాదనలు కేంద్రానికి పంపించింది. ఏపీకి నోడల్ ఆఫీసర్‌గా కళాశాల విద్యా కమిషనర్ వ్యవహరిస్తారని పేర్కొంది. అయితే కళాశాల విద్యా కమిషనర్‌ను నోడల్ ఆఫీసర్‌గా పేర్కొనడం పట్ల అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నత విద్యా మండలికే ఆ బాధ్యతలు అప్పగించాలని అధికారులు పేర్కొన్నారు. తెలంగాణకు సంబంధించి పథకం అమలుకు ఎవరు నోడల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారనే విషయాన్ని కేంద్రానికి తెలియజేయలేదు. త్వరలోనే నోడల్ ఆఫీసర్‌ను నోటిఫై చేస్తూ కేంద్రానికి పంపించాలని నిర్ణయించారు. ఆ బాధ్యతలను ప్రస్తుత తెలంగాణ కళాశాల విద్య కమిషనర్‌కే అప్పగించే అవకాశం ఉంది. అయితే ఆ బాధ్యతలను తెలంగాణ ఉన్నత విద్యామండలికే అప్పగించాలనే వాదన ఉంది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం ప్రకటించనుంది. ఆ తర్వాత రూసా కింద నిధులు విడుదల కానున్నాయి. ఇక రూసా కింద రాష్ట్రలో మూడు కొత్త యూనివర్సిటీలు, రెండు క్లస్టర్ యూనివర్సిటీలు, 4 కొత్త మోడల్ డిగ్రీ కాలేజీలు, మరో 4 డిగ్రీ కాలేజీలను మోడల్ డిగ్రీలుగా అప్‌గ్రేడ్ చేయడం, 7 ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రతిపాదించారు. ఒక్కో కాలేజీని రూ.26 కోట్లతో గజ్వేల్, కరీంనగర్, నిజామాబాద్, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, వరంగల్‌లో (మహిళ) ఏర్పాటు చేయనున్నారు. -
‘రూసా’ పట్టని ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పన.. 300 డిగ్రీ కాలేజీల అభివృద్ధి.. 12 కొత్త యూనివర్సిటీల ఏర్పాటు.. వంటి అనేక విద్యాభివృద్ధి కార్యక్రమాలకు ఉద్దేశించిన రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్(రూసా) పథకంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఈ పథకానికి సంబంధించి.. గత నెల 30నే కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాల్సి ఉండగా.. గడువు దాటిపోయి వారం గడుస్తున్నా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదముద్ర పడలేదు. వాస్తవానికి గత నెల 28వ తేదీన ఉన్నత విద్యామండలి ఈ ప్రతిపాదనలను కొలిక్కి తెచ్చి.. డిప్యూటీ సీఎం, ఉన్నత విద్యాశాఖ మంత్రి అయిన దామోదర రాజనర్సింహ ఆమోదానికి పంపించింది. ఫైలు తనవద్దకొచ్చిన మూడు గంటల్లోనే ఆయన సంతకం చేసి అదేరోజు(28న) ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి పంపించారు. కానీ సీఎం ఇంతవరకు ఈ ప్రతిపాదనలకు ఆమోదమే తెలపలేదు. ఒకవైపు టీచర్ల బదిలీల వంటి ఫైళ్లపై చకచకా సంతకం పెట్టేస్తున్న ముఖ్యమంత్రికి.. ఎంతో కీలకమైన పథకానికి సంబంధించిన ఫైలును పట్టించుకునే తీరిక లేకపోవడం గమనార్హం. దీంతో రూ.2,600 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు ఇంతవరకు కేంద్రానికి చేరలేదు. ఫలితంగా రాష్ట్రానికి ఈ పథకం మంజూరే చిక్కుల్లో పడింది. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ అధికారులు ఇంకా ఆలస్యం చేస్తే కష్టమని చెబుతుండటంతో ఉన్నత విద్యామండలి అధికారులకు పాలుపోవట్లేదు. -
ఉన్నత విద్యాభివృద్ధికి ‘రూసా’ సాయం
వీసీల సమావేశంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకం అమలుపై వివిధ విశ్వవిద్యాలయాల వైస్ చాన్సలర్ల సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో పథకం అమలుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలను విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాలరెడ్డి వివరించారు. యూనివర్సిటీలు తమ ప్రతిపాదనలకు సంబంధించి అనుమానాలు ఉంటే డిసెంబర్ 13న జరిగే సమావేశంలో నివృత్తి చేసుకుని డిసెంబర్ 20లోపు సమర్పించాలని ఉపకులపతులను కోరారు. వాటిని క్రోడీకరించి రాష్ట్ర సమగ్ర నివేదికను జనవరి 10లోగా కేంద్రానికి సమర్పిస్తామన్నారు. ఫిబ్రవరి 28 లోగా రాష్ట్ర ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. ఏప్రిల్ 15 నాటికి కేంద్రం నిధులు విడుదల చేస్తుందని వివరించారు. అనంతరం రాష్ట్ర వాటా ఏప్రిల్ 30లోగా విడుదల చేయాల్సి ఉంటుందని తెలిపారు. రూసా పథకంలో చేపట్టే పనుల్లో.. 18 అంశాల్లో పనులకు సంబంధించి నిధుల కేటాయింపు, 500లకు పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంపునకు నిధుల ఖర్చు, 12బీ, 2ఎఫ్ గుర్తింపు కలిగి ఉన్న, లేకున్నా రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కళాశాలల అభివృద్ధి, ఎయిడెడ్ కళాశాలలకు మౌలిక వసతులు కల్పన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేగాక అటానమస్ కళాశాలలను వర్శిటీలుగా అప్‌గ్రేడ్ చేయడం, క్లస్టర్ కళాశాలలను కలుపుతూ వర్శిటీల ఏర్పాటు, మౌలిక వసతుల కోసం ఒక్కో వర్శిటీకి రూ. 20 కోట్లు కేటాయించడం, మోడల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేయడం, ప్రస్తుతమున్న డిగ్రీ కళాశాలలను మోడల్ డిగ్రీ కళాశాలలుగా అభివృద్ధిపరచడం, పదేళ్ల కాలంలో 40 అత్యుత్తమ ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు, తదితర అంశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ పథకం కింద వచ్చే మూడేళ్లలో రాష్ట్రానికి రూ. వెయ్యికోట్లకు పైగా నిధులు దక్కనున్నాయి. ఈ సమావేశంలో ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మాధ్యమిక విద్య కమిషనర్ అదర్‌సిన్హా, ఉన్నత విద్య ప్రత్యేక కార్యదర్శి ఆర్.ఎం.డోబ్రియాల్, మండలి వైస్ చైర్మన్ విజయ్‌ప్రకాశ్, కార్యదర్శి సతీష్‌రెడ్డి, అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు.