పశ్చిమ’పై తనకు ప్రత్యేక అభిమానం అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే జిల్లాకు విద్యాపరంగా మరో అన్యాయం జరుగుతోంది. ప్రతిష్టాత్మక నిట్ ఏర్పాటులో ఊరించి ఉస్సూరనిపించిన సర్కారు తాజాగా రూసా పథకం కింద జిల్లాకు రావాల్సిన యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోయినా కిమ్మనడం లేదు.
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం రూసా పథకం కింద జిల్లాలో ఏర్పాటు చేయదలచిన మరో యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోయింది. గతంలో ప్రతిపాదించిన ఒంగోలు, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో యూనివర్సిటీలను ఏర్పాటు చేయకూడదని కేంద్ర నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ పథకంలో పీజీ కేంద్రాలను వర్సిటీలుగా మార్చాలనుకున్నారు.
ఈ ప్రతిపాదనను తిరిగి పరిశీలించిన కేంద్రంలోని ఈ వ్యవహారాలు చూసే అధికారులు తాజాగా కొత్త నిర్ణయాలను తీసుకున్నారు. అటానమస్ కళాశాలలను మాత్రమే యూనివర్శిటీలుగా రూసా పథకంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు, ఈ క్రమంలో తూర్పుగోదావరిలోని రాజమండ్రి, కాకినాడలో వర్శిటీలు రూసా పథకంలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లాకు మొండి చెయ్యి చూపించినట్టే.
జిల్లాకు ఉపయుక్తంగా ఉండేది
ఈ వర్శిటీ వస్తే, అకడమిక్ విద్యా కోర్సులకు భిన్నంగా, జిల్లాకు ఉపయుక్తంగా ఉండే, ైరె తాంగానికి మేలు చేసే, పరిశోధనలకు అవకాశం కల్గించే కోర్సులు అందుబాటులోకి వచ్చేవి. గతంలో వర్శిటీ ప్రతిపాదన వచ్చిన సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారుల బృందం కేంద్రానికి ఏఏ కోర్సులు ఏర్పాటు చేయాలనే విషయంలో ప్రతిపాదనలను పంపింది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకంలో జిల్లాకు ఒక యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి గాను 2014 లో కేంద్రం ప్రతిపాదనలను కోరింది. ఈ పథకం కింద జిల్లాలో వర్శిటీ ఏర్పాటుకు గాను ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం వంటి ప్రాంతాలను చూశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విమానాశ్రయ రన్‌వే సమీపంలో తాడేపల్లిగూడెంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ రూసా పథకంలో వర్శిటీకి అనుకూలమని నివేదికలను కేంద్రానికి సమర్పించారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఎన్నికలు ముగిశాక, ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికై దేవాదాయ ధర్మాదాయశాఖా మంత్రి అయిన పైడికొండల మాణిక్యాలరావు గూడెంకు మరో యూనివర్శిటీ రానుందని ప్రకటించారు. రూసా పథకంలోది కాకుండా మరో కొత్త వర్శిటీ వస్తుందని జిల్లా ప్రజలు ఆశించారు. కాని ఈ విషయంలోనే నిట్ మాదిరే నిరాశ ఎదురయింది.
సమగ్ర నివేదిక సమర్పించినా..
ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జీఎస్‌ఎన్ రాజు, రిజిస్ట్రార్, గూడెంలోని ఏయూ క్యాంపస్ ఇన్‌చార్జి ప్రత్యేకాధికారి జి.సుధాకర్‌లు సమగ్ర సమాచారం కేంద్రానికి అందచేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఉన్నత విద్యను చేరువ చేసే సంకల్పంతో కేంద్రంలోని మానవవనరుల మంత్రిత్వ శాఖ సేకరించిన వివరాల ఆధారంగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి అందించిన సమాచారం క్రోడీకరించుకొని కొత్తగా వర్సిటీలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఈ క్రమంలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ పథకంలో రాష్ట్రంలో 12 కొత్త వర్సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ గత ఏడాది ఫిబ్రవరి నుంచి వేగవంతం అయింది. ఒక్కో యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.55 కోట్లు వెచ్చించాలని, మూడేళ్లలో రూ.2600 కోట్లతో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చే యాలని అప్పట్లో భావించారు. కొత్త వర్సిటీల ఏర్పాటుకు వెచ్చించే నిధులలో 65 శాతం కేంద్రం వెచ్చిస్తుంది. మిగిలిన 35 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూసా పథకం,