National Institute of Technology
-
ఎన్ఐటీ తిరుచ్చి .. గ్లోబల్ అలుమ్ని మీట్ 2025
సాక్షి, చైన్నె: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ –తిరుచ్చి, అధికారిక పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో ల్యాండ్ మార్క్ ఈవెంట్‌గా గ్లోబల్ అలుమ్ని మీట్ 2025 చైన్నె వేదికగా జరగనుంది. గిండి ఐటీసీ గ్రాండ్ చోళా వేదికగా జనవరి 4వ తేదీన ఈ మీట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులను ఒకచోట చేర్చే విధంగా కార్యక్రమానికి నిర్ణయించారు. 930 మందికి పైగా సీఈఓలు, 1,300 మందికి పైగా వివిధ సంస్థల వ్యవస్థాపకులు. సహ–వ్యవ స్థాపకులు, 48,000 మంది పూర్వ విద్యార్థుల డైనమిక్ నెట్‌వర్క్‌తో ఎన్ఐటీ తిరుచ్చి ఈ వేడుకకు నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర ఐటీ మంత్రి డాక్టర్ పళనివేల్ త్యాగరాజన్ పాల్గొననున్నారు. ఈ వివరాలను సోమ వారం స్థానికంగా జరిగిన సమావేశంలో ఎన్ఐటీ తిరుచ్చి డైరెక్టర్ జి అఖిల ప్రకటించారు. అలాగే, ఈ మీట్బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రముఖులైన పూ ర్వ విద్యార్థులను ఒకే వేదిక మీదకు తీసుకు రావ డం, పభావవంతమైన సహకారాన్ని ప్రోత్సహించడానికి ఒక శక్తివంతంగా ఈ వేదిక మారనున్నట్టు వివరించారు. 2025లో అకడమిక్ ఎక్స లెన్స్, అత్యాధునిక పరిశోదన , క్రీడా సౌకార్యలు, వంటి వాటిని మెరుగు పరిచే దిశగా ప్రత్యేక కార్యాచరణలో ఉన్నామన్నారు. ఆవిష్కరణల కేంద్రం పరిశోధన– వ్యవస్థాపకతను ప్రోత్సహించడానికి, పూర్వ విద్యార్థుల– విద్యార్థుల మెంటర్షిప్కు అధికారిక వేదికను అందించడానికి, స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను ప్రోత్స హించడానికి, ల్యాబ్‌ను అందించడంతో పాటు పరిశ్రమ నేతృత్వంలో ప్రాజెక్ట్‌లను పెంచడానికి ఈ మీట్ దోహదకరంగా ఉంటుందన్నారు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ హబ్ ప్లాట్‌ఫారమ్, గవర్నెన్స్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ టాలెంట్ , స్టార్టప్ ఆలోచనలను పెంపొందించడంతో పాటూ పరిశోధన మరియు ఆవిష్కరణలను చేయడమే లక్ష్యంగా నిర్ణయించామన్నా రు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు కె మహాలింగం మాట్లాడుతూ, తమ పూర్వ విద్యార్థుల నెట్వర్క్ విస్తారమైనదని, ప్రపంచవ్యాప్తంగా నిష్ణాతులని, ఇందుకు తగిన మార్గదర్శకత్వం, వ్యాపారం, నిధులు, ఆలోచనల కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిచనున్నారు. -
తీవ్ర ఆందోళనలు.. శ్రీనగర్ నిట్ మూసివేత, ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ శ్రీనగర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని (ఎన్ఐటీ) అధికారులు మూసివేశారు. ఓ విద్యార్థి మతపరమైన అంశంపై సోషల్ మీడియాలో ఓ పోస్టు చేయడంతో నిరసనగా కొందరు విద్యార్థులు ఆందోళనగు దిగారు. దీంతో ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఆందోళనలు ఇతర విద్యాసంస్థలకు కూడా వ్యాపించాయి. అప్రమత్తమైన ఎన్ఐటీ అధికారులు విద్యార్ధులకు శీతాకాల సెలవులను ముందుగానే ప్రకటించారు. గురువారం నుంచే సెలవులు అమల్లోకి వస్తామని యూనివర్సిటీ డీన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్టూడెంట్స్ అందరిని తక్షణమే క్యాంపస్, హాస్టళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారు. నిట్ వెబ్‌సైట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. కశ్మీర్‌లోని ఇతర డిగ్రీ కాలేజీలు కూడా శనివారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని ఆదేశించారు. డిసెంబర్ 20లోగా పరీక్షలు ఉండగా,.. వాటిని వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షలను సెలవుల అనంతరం నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే ఉన్నట్టుండి హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశించడంతో ఎన్ఐటీలో చదువుతున్న దాదాపు 300 మంది తెలుగు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీనగర్ నుంచి అత్యవసరంగా బయలుదేరేందుకు విమానాలు, రైలు సదుపాయం లేకపోవడంతో తమను ఆదుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. మరోవైపు స్థానికేతర నిట్వి ద్యార్థి సోషల్ మీడియాలో దైవదూషణతో కూడిన పోస్ట్ చేయడంతో మంగళవారం ఈ వివాదం చెలరేగింది. ఇది ఇన్స్టిట్యూట్లో భారీ నిరసనలకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో అభ్యంతరకరమైన పోస్టు చేసి ఇరువర్గాల మధ్య వివాదానికి కారణమైన యూట్యూబ్ వీడియోను పోస్టు చేసిన విద్యార్థిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు శ్రీనగర్ పోలీసులు తెలిపారు. -
JEE Mains Results 2022: మనదే హవా
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వంటి జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2022 పేపర్ 1 (బీఈ, బీటెక్) ఫలితాల్లో తెలుగు విద్యార్థులు దుమ్ము లేపేశారు. దేశవ్యాప్తంగా 24 మందికి 100 ఎన్టీఏ స్కోర్ రాగా ఇందులో పది మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థులే. ఈ పది మందిలో ఐదుగురు మన రాష్ట్ర విద్యార్థులు ఉండగా, మరో ఐదుగురు తెలంగాణ వారు ఉన్నారు. ఈ మేరకు జేఈఈ మెయిన్ స్కోర్లు, ర్యాంకులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. టాప్ 10 ర్యాంకుల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు చోటు దక్కించుకున్నారు. పెనికలపాటి రవికిషోర్ ఆరో ర్యాంకు, మెండ హిమవంశీ ఏడో ర్యాంకు.. పల్లి జలజాక్షి 9వ ర్యాంకు సాధించారు. వీరు ముగ్గురుతోపాటు ఏపీకే చెందిన పోలిశెట్టి కార్తికేయ, కొయ్యాన సుహాస్ 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో నిలిచారు. ఇక తెలంగాణ నుంచి రూపేష్ బియానీ, ధీరజ్ కురుకుంద, జాస్తి యశ్వంత్ వీవీఎస్, బుస శివనాగ వెంకట ఆదిత్య, అనికేత్ ఛటోపాధ్యాయ 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన వారిలో ఉన్నారు. కాగా జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకును శ్రేణిక్ మోహన్ సకల (మహారాష్ట్ర), రెండో ర్యాంకును నవ్య (రాజస్థాన్) సాధించారు. 100 ఎన్టీఏ స్కోర్ సాధించిన 24 మందిలో ఇద్దరే బాలికలు. మిగతా 22 మంది బాలురే. పెరిగిన జనరల్ కటాఫ్.. కాగా జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించి అడ్వాన్స్డ్ పరీక్షకు ఎంపికయ్యేందుకు జనరల్ విభాగం కటాఫ్ స్కోర్ గతేడాది కంటే పెరిగింది. మరోవైపు ఇతర కేటగిరీల్లో మాత్రం కటాఫ్ స్కోర్ తగ్గింది. జేఈఈ మెయిన్‌లో టాప్‌లో నిలిచిన 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణిస్తారు. వీరు మాత్రమే అడ్వాన్స్డ్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఓపెన్ కేటగిరీలో 1,01,250, ఈడబ్ల్యూఎస్ 25,000, ఓబీసీ 67,500, ఎస్సీలు 37,500, ఎస్టీలు 18,750 మందిని ఎంపిక చేస్తారు. ఈ అన్ని కేటగిరీల్లోనూ 0.05 శాతం దివ్యాంగులకు కేటాయిస్తారు. మొదటి సెషన్లోనే అధికం జేఈఈ మెయిన్‌ను 2021లో కరోనా దృష్ట్యా నాలుగుసార్లు నిర్వహించగా ఈసారి మాత్రం రెండు సెషన్లకే పరిమితం చేశారు. జూన్ 24 నుంచి 30 వరకు మొదటి సెషన్, జూలై 25 నుంచి 30 వరకు రెండో సెషన్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా మొత్తం 10,26,799 మంది దరఖాస్తు చేసుకోగా 9,05,590 మంది హాజరయ్యారు. రెండు సెషన్లలోనూ పరీక్ష రాసిన వారు 4,04,256 మంది ఉన్నారు. అత్యధికంగా మొదటి సెషన్లో 8,72,970 మంది దరఖాస్తు చేయగా 7,69,604 మంది హాజరయ్యారు. రెండో సెషన్‌కు 6,22,034 మంది దరఖాస్తు చేయగా 5,40,242 మంది పరీక్ష రాశారు. పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల్లో 6,48,555 మంది బాలురు కాగా 2,57,031 మంది బాలికలున్నారు. ఐదుగురి ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు ఎన్టీఏ పేర్కొంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు.ఇక పేపర్–2కు సంబంధించిన బీఆర్క్, బీప్లానింగ్ ఫలితాలను త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది. అడ్వాన్స్‌డ్‌కు 11 వరకు దరఖాస్తు గడువు.. కాగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియను ఐఐటీ –బాంబే ఆదివారం (ఆగస్టు 7) నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే మెయిన్ ఫలితాలు సోమవారం వెలువడడంతో ఒక రోజు ఆలస్యంగా ఈ ప్రక్రియను చేపట్టింది. ఈ నెల 11 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు ఉంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఫీజును 12 సాయంత్రం 5 గంటల లోపు చెల్లించాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డులను 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఆగస్టు 28న జరుగుతుంది. ప్రొవిజినల్ ఆన్సర్ కీ సెప్టెంబర్ 1న ప్రకటిస్తారు. వాటిపై అదే నెల 3, 4 తేదీల్లో అభ్యర్థుల అభిప్రాయాలను తీసుకొని ఫైనల్ కీని, తుది ఫలితాలను సెప్టెంబర్ 11న విడుదల చేస్తారు. బీఆర్క్కి సంబంధించిన ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను 14న నిర్వహించి 17న ఫలితాలు ప్రకటిస్తారు. కాగా బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 12 నుంచి ప్రారంభమవుతుంది. ఐఐటీ బాంబేలో చేరతా.. మాది గుంటూరు. నాన్న ఆదినారాయణ ప్రైవేటు సంస్థలో లైబ్రేరియన్‌గా పనిచేస్తారు. అమ్మ నందకుమారి స్టాఫ్ నర్సు. ఇంటర్మీడియెట్‌లో 962 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్‌లో ఆలిండియా స్థాయిలో ఆరో ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ప్రణాళికాబద్ధంగానే చదవడంతోనే ఇంత చక్కటి ర్యాంకు సాధించగలిగా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎంచుకుంటా. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా. – పెనికలపాటి రవికిషోర్, జేఈఈ మెయిన్, ఆలిండియా 6వ ర్యాంకర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా.. మాది.. శ్రీకాకుళం. నాన్న రవిశంకర్, అమ్మ స్వరాజ్యలక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులే. ఇంటర్మీడియెట్‌లో 972 మార్కులు సాధించా. జేఈఈ మెయిన్‌లో ఓబీసీ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు, ఓపెన్ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే నా లక్ష్యం. – ఎం.హిమవంశీ, జేఈఈ మెయిన్, ఆలిండియా ఏడో ర్యాంకర్ నా లక్ష్యం సివిల్స్.. మాది శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి మండలం కాకరపల్లి. నాన్న గోవిందరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అమ్మ జయలక్ష్మి గృహిణి. వారి ప్రోత్సాహంతోనే నేను రాణిస్తున్నా. ఇంటర్మీడియెట్‌లో 983 మార్కులు సాధించా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేశాక సివిల్స్ రాస్తా. సివిల్స్ సాధించడమే నా జీవితాశయం. –పి.జలజాక్షి, జేఈఈ మెయిన్, ఆలిండియా 9వ ర్యాంకర్ విద్యార్థులు సమానమైన స్కోరు సాధిస్తే.. ముందు ఎవరికి ప్రాధాన్యత? కంప్యూటర్ బేస్డ్లో జరిగే జేఈఈ మెయిన్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ విభాగాల్లో రెండు సెక్షన్లలో ప్రశ్నలు ఇస్తారు. ఎ–సెక్షన్లో ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున, బి సెక్షన్లో 10 చొప్పున ప్రశ్నలుంటాయి. ఎ–సెక్షన్‌లోని 20 ప్రశ్నలు బహుళైచ్ఛిక సమాధానాల ప్రశ్నలు. వీటన్నిటికీ సమాధానాలివ్వాలి. ఇక బి సెక్షన్‌లోని న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలివ్వాలి. ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. తప్పుగా సమాధానాలు రాసినవాటికి నెగిటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున మైనస్ చేస్తారు. రోజుకు రెండు బ్యాచుల చొప్పున ఐదారురోజుల పాటు నిర్వహించే ఈ పరీక్షల్లో ఒకరోజు సులభం, మరో రోజు కష్టంగా ప్రశ్నలున్నా నార్మలైజేషన్ ద్వారా దాన్ని సరిసమానంగా ఉండేలా చేసి అభ్యర్థులకు స్కోరును నిర్ణయిస్తారు. ఈ విధానంలో ఏ ఇద్దరు అభ్యర్థులకు సమానమైన స్కోరు ఉన్నా ‘టై బ్రేక్’ విధానాన్ని అనుసరించి ర్యాంకులను ప్రకటిస్తారు. ప్రాధాన్యత క్రమంలో ఇలా ఉంటుంది. ► తొలుత మ్యాథమెటిక్స్‌లో అభ్యర్థులు సాధించిన స్కోరును పరిగణలోకి తీసుకొని అధిక స్కోరు ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు. ► రెండోదిగా ఫిజిక్సు స్కోరు, మూడోదిగా కెమిస్ట్రీ స్కోర్లను పరిగణనలోకి తీసుకుంటారు. ► మూడింటిలోనూ అభ్యర్థులకు సరిసమానమైన స్కోర్ ఉంటే.. పరీక్షలో ఆయా సబ్జెక్టుల్లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి.. ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ► అందులోనూ సరిసమానమైన స్కోర్ ఉంటే.. మ్యాథ్స్‌లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. దీనిలోనూ సమానంగా ఉంటే ఫిజిక్స్‌లో తక్కువ తప్పు సమాధానాలిచ్చి, ఎక్కువ సరైన సమాధానాలిచ్చిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. దీనిలోనూ అభ్యర్థులకు సరిసమానమైన స్కోర్లు ఉంటే కెమిస్ట్రీలో తప్పు సమాధానాలు తక్కువ ఇచ్చి, సరైన సమాధానాలు ఎక్కువ ఇచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ► ఒకవేళ ఈ అన్ని సబ్జెక్టులోనూ ఏ ఇద్దరు అభ్యర్థులు సమానంగా నిలిచినా ముందుగా వయసుపరంగా పెద్దవారికి ప్రాధాన్యమిస్తారు. ► అప్పటికీ సమానమైన పరిస్థితి ఏర్పడితే దరఖాస్తు నంబర్‌ను అసెండింగ్ ఆర్డర్లో తీసుకొని ర్యాంకును ప్రకటిస్తారు. -
నిట్‌లో సైన్స్ వారోత్సవాలు ప్రారంభం
కాజీపేట అర్బన్: హనుమకొండ కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా సైన్స్ వారోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. విజ్ఞాన్ ప్రసార్ సౌజ న్యంతో స్కోప్ ప్రాజెక్ట్ ద్వారా మంగళవారం నుంచి 28వ తేదీ వరకు జరిగే ఈ జాతీయ స్థాయి సైన్స్ వారోత్సవాలను న్యూఢిల్లీ కేం ద్రంగా ఆన్లైన్లో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, జితేందర్‌సింగ్ ప్రారంభించారు. అదే సమ యంలో నిట్ క్యాంపస్‌లో సెంట్రల్ యూని వర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వీసీ జేజే రావు ప్రారంభించారు. అటవీశాఖ ప్రదర్శన, శాస్త్ర వేత్తల ఛాయాచిత్రాల ప్రదర్శన, సైన్స్ ఎగ్జి బిట్స్, పుస్తకప్రదర్శనతో కూడిన సైన్స్ ఎక్స్పో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశవ్యా ప్తంగా 75 కేంద్రాల్లో సైన్స్ వారోత్సవాలను ఆయా ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తుండగా, ఏపీ, తెలంగాణల్లో సైన్స్ అండ్ టెక్నాల జీని తెలుగులో అందజేసేందుకు వేదికగా నిట్ క్యాంపస్‌ను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు, ప్రొఫెసర్లు లక్ష్మారెడ్డి, రాంచంద్రయ్య పాల్గొన్నారు. -
ప్రత్యేక కౌన్సెలింగ్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే సాంకేతిక విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) మిగిలిపోయిన సీట్ల భర్తీకి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించాలని సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డు (సీఎస్ఏబీ) నిర్ణయించింది. ఈ నెల 16 నుంచి రెండు విడతలుగా కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహించేలా షెడ్యూల్ జారీ చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలైన ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్‌టీఐ ప్రవేశాలకు జాయిం ట్ సీట్ అలకేషనల్ అథారిటీ (జోసా) గత నెల 6 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ఆరు విడతల్లో నిర్వహించింది. ఆరో విడత సీట్ల కేటాయింపును ఈ నెల 7న ప్రకటించింది. సీట్లు పొందిన విద్యార్థులంతా సోమవారం నుంచి 13వ తేదీలోగా జోసా పోర్టల్ ద్వారా ప్రవేశాల ఫీజును కొంత మొత్తం చెల్లించి సీట్లు ఖరారు చేసుకోవాలని జోసా వెల్లడించింది. ఆ కౌన్సెలింగ్ తరువాత ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్టీఐలలో మిగిలిన సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సీఎస్ఏబీ షెడ్యూల్ జారీ చేసింది. -
భారతీయ శాస్త్రవేత్తకు అంతర్జాతీయ గుర్తింపు
పణజీ: గోవాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో పరిశోధక విద్యార్థిగా ఉన్న ప్రీతి జగదేవ్ అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. 2021 సంవత్సరానికి గానూ ఆప్టిక్స్ రంగంలో పరిశోధనలు చేస్తున్న అత్యుత్తమ 25 మంది మహిళా శాస్త్రవేత్తల్లో ఒకరుగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ ఆప్టిక్స్ అండ్ ఫొటోనిక్స్’ జాబితాలో స్థానం సంపాదించారు. ఈ ఏడాది ఈ జాబితాలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయురాలుగా ప్రీతి ఘనత సాధించారు. ప్రీతికి కేంద్ర విద్యామంత్రి రమేశ్ పోఖ్రియాల్ అభినందనలు తెలిపారు. ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇది ఎన్ఐటీ, గోవాకు లభించిన మరో అంతర్జాతీయ గుర్తింపు అని ఆ విద్యాసంస్థ డైరెక్టర్ గోపాల్ ముగరేయ పేర్కొన్నారు. ప్రీతి జగదేవ్ ప్రస్తుతం గోవా ఎన్ఐటీలో ‘ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్’లో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ స్కాలర్‌గా ఉన్నారు. కృత్రిమ మేథ, ఇన్ఫ్రారెడ్ థర్మోగ్రఫీ సాంకేతికత సహాయంతో మానవుల్లో ఆరోగ్య పర్యవేక్షణ విధానాలపై డాక్టర్ లలత్ ఇందు గిరి పర్యవేక్షణలో పరిశోధన చేస్తున్నారు. -
‘నిట్’ ప్రవేశాలకు 75% మార్కులు అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇతర కేంద్ర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కనీస అర్హతగా ఉన్న 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలన్న ప్రధాన నిబంధనను తొలగించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు బోర్డులు పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ‘జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులు క్లాస్ 12 బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది’ అని హెచ్చార్డీ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిట్ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటివరకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కావడంతో పాటు, 12వ తరగతి బోర్డ్ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సాధించాల్సి ఉండేది. ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడిన ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
‘నిట్’లో స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ కోర్సు
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఈ ఏడాది నుంచి స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ నూతన కోర్సు అందుబాటులోకి రానుందని నిట్ డైరెక్టర్ రమణారావు తెలిపారు. ఈ మేరకు నిట్ వరంగల్, ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా సంస్థ గురువారం పరస్పర ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ సందర్భంగా నిట్ వరంగల్ డైరెక్టర్ కార్యాలయం నుంచి రమణారావు ఆన్లైన్లో ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.వేణు ఎంఓయూపై సంతకం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏబీబీ పవర్ గ్రిడ్స్ ఇండియా సౌజన్యంతో నిట్ వరంగల్ ఎలక్ట్రికల్ విభాగం ఆధ్వర్యంలో ఈ ఏడాది నుంచి స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్‌పై ఎం టెక్, ïపీహెచ్డీ స్కాలర్లకు నూతన కోర్సును అందించనున్నట్లు తెలిపారు. నాణ్యమైన, 24 గంటలు అంతరాయం లేని విద్యుత్ అందించేందుకు అవగాహన కల్పించడంతో పాటు విద్యార్థుల పరిశోధనలకు అనుగుణంగా స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ‘వన్ నేషన్, వన్‌గ్రిడ్, వన్ ఫ్రీక్వెన్సీ’అనే నినా దంతో భారతదేశ ఎలక్ట్రిక్ గ్రిడ్ ముందడుగు వేస్తుందని, స్కిల్ ఇండియా మిషన్ అనుసంధానంతో నిట్ వరంగల్‌లో స్మార్ట్ ఎలక్ట్రిక్ గ్రిడ్ కోర్సుకు శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. -
బారులు తీరిన పౌరులు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన మూడు వారాల దేశవ్యాప్త లాక్డౌన్ ప్రకటన కొన్నిచోట్ల ప్రజలు కిరాణా కొట్ల ముందు బారులు తీరేలా చేసింది. దేశం మొత్తమ్మీద కోవిడ్ బాధితుల సంఖ్య బుధవారానికి 612 దాటిపోగా, పది మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 40 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో మరో వ్యక్తి కోవిడ్‌కు బలికాగా, తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం నమోదైంది. మంగళవారం ఢిల్లీలో ఒక వ్యక్తి ఇతర కారణాల వల్ల మరణించినా కోవిడ్ మరణాల జాబితాలో చేర్చారు. తాజాగా ఈ తప్పును సవరించడంతో మొత్తం మరణాల సంఖ్య పది అయ్యింది. లాక్డౌన్ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేయగా.. మందులు, నిత్యావసరాలను అమ్మే దుకాణాలు లాక్డౌన్ సమయంలోనూ తెరిచే ఉంటాయని మంత్రి జవడేకర్ తెలిపారు. మిలటరీ ఆసుపత్రులు సిద్ధం ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతోపాటు కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన 32 ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం కేంద్రం సిద్ధంచేస్తోంది. వీటిద్వారా సుమారు 2000 వరకూ పడకలు అందుబాటులోకి రానుండగా హిమాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు వేల గదులను ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు హమీర్పూర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రులు గ్రేటర్ నోయిడా, హైదరాబాద్, గువాహటి, జమ్మూ, గ్వాలియర్‌లోని టేకన్పూర్, డిమాపూర్, ఇంఫాల్, నాగ్‌పూర్, సిల్చార్, భోపాల్, అవడి, జోధ్‌పూర్, కోల్‌కతా, పుణె, బెంగళూరులతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర రోగాలతో వచ్చే రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేయగా పరిస్థితి చక్కబడ్డ వారిని డిశ్చార్జ్ చేస్తూ ఐసోలేషన్ కేంద్రం కోసం వీలైనన్ని పడకలను అందుబాటులోకి తెస్తున్నారు. మందులు నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి : జవదేకర్ మూడు వారాల లాక్డౌన్ సమయంలోనూ దేశం మొత్తమ్మీద నిత్యావసర, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, బ్లాక్‌మార్కెటింగ్ చేసేవారిపై, అక్రమంగా నిల్వ చేసే వారిని కట్టడి చేసేందుకు తగిన చట్టాలు ఉన్నాయని అన్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. హౌసింగ్ సొసైటీలు కొన్ని వైద్యులను, జర్నలిస్టులను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పడం ఏమాత్రం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమాజం పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు. స్వస్థత చేకూరిన వారికి స్వాగతం పుణేలో బుధవారం ఒక హృద్యమైన సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తరువాత స్వస్థత చేకూరిన దంపతులను వారు నివాసముండే హౌసింగ్ సొసైటీ సాదరంగా స్వాగతం పలికింది. సిన్హ్గఢ్ రోడ్డులో ఉండే ఈ సొసైటీలోని కుటుంబాలన్నీ బాల్కనీల్లో నుంచుని చప్పట్లతో ప్లేట్లతో శబ్దాలు చేస్తూ 51 ఏళ్ల పురుషుడు, 43 ఏళ్ల మహిళకు స్వాగతం పలికారు. కోవిడ్ పరిస్థితి స్థూలంగా.. దేశం మొత్తమ్మీద బుధవారం ఉదయం నాటికి మొత్తం 612 కోవిడ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 109 కేసులు ఉండగా ఇందులో ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో ముగ్గురు విదేశీయులు సహా 116 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 41 మంది కోవిడ్ బాధితులు ఉంటే. తెలంగాణలో ఈ సంఖ్య 35 (10 మంది విదేశీయులు)గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 35 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 31 కాగా. తమిళనాడులో 18, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది చొప్పున కోవిడ్ బారిన పడ్డారు. -
నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం: నిట్ డైరెక్టర్
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి. సూర్య ప్రకాష్ రావు స్పష్టం చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన ఫేక్ వీడియో ఆధారంగా పీహెచ్డీ పట్టాలకు అయిదు లక్షలు డిమాండ్ చేసినట్లు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆదివారం పైడికొండల మాణిక్యాల రావు ఆరోపణలు చేశారు. సోమవారం తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో విలేకరుల సమావేశంలో ఈ విషయంపై సూర్యప్రకాశ్ మాట్లాడుతూ..తమ వాళ్లకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వడం లేదనే దురుద్ధేశంతోని తనను ఉద్యోగం నుంచి తప్పించడానికి బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఓ వీడియోను పూర్తిగా ట్యాపింగ్ చేసి, మాటలను ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పెట్టారని విమర్శించారు. ఎవరో చెప్పిన మాటలను, ఎడిట్ చేసిన వీడియోలను నమ్మి మాజీ మంత్రి పైడి కొండల ఇలా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. మీమీద విమర్శలు వస్తున్నాయని తనను పిలిచి అడిగి ఉంటే బాగుండేదన్నారు. ఒకవేళ తన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే పదవి నుంచి వైదులుగుతానని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్డీకి లేఖ రాశానని తెలిపారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఈ వీడియో పంపిస్తున్నట్లు, దీనిపై సైబర్ కక్రైం కేసు పెట్టనున్నట్లు వెల్లడించారు -
ఐఈఎస్ టాపర్ అమన్
సాక్షి, హైదరాబాద్ , కాజీపేట అర్బన్ : ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐఈఎస్)–2018లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)–వరంగల్ విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టాపర్‌తో పాటు మరో రెండు అత్యుత్తమ ర్యాంకులతో రికార్డు సృష్టించారు. శనివారం ఐఈఎస్–2018 ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో నిట్–వరంగల్ విద్యార్థి అమన్‌జైన్ నేషనల్ టాపర్‌గా నిలిచాడు. అమన్ నిట్–వరంగల్ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో 2016లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఇదే కాలేజీ నుంచి అంకిత్ (ఎలక్ట్రికల్) 36వ ర్యాంకు, ప్రభాత్ పాండే (ఎలక్ట్రికల్) 46వ ర్యాంకు సాధించారు. గతేడాది ‘గేట్’లోనూ తమ విద్యార్థి నేషనల్ టాపర్‌గా నిలిచారని నిట్–వరంగల్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు ‘సాక్షి’తో తెలిపారు. క్యాట్, జీఆర్ఈల్లోనూ అత్యుత్తమ ఫలితాలు సాధించామన్నారు. మూడేళ్ల నుంచి వరుసగా రికార్డులు సాధిస్తున్నామని, ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తామని ఆయన పేర్కొన్నారు. -
జాతీయస్థాయికి వరంగల్ నిట్ విద్యార్థులు
24గంటల్లో నూతన పరిశోధనలు కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. నిట్‌లో బెంగళూరుకు చెందిన ఇంక్ కంపెనీ ‘ఇంక్ మేకర్’పేరిట నిర్వహించిన మేక్ ఏ థాన్ ఆదివారం ముగిసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన పరిశోధనలకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిశాయి. నిట్‌కు చెందిన 300 విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని 24 గంటల్లో తమ ఆలోచనలకు కార్యరూపం కల్పించారు. ఈ మేరకు విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికతో పాటు రూ.20లక్షల ప్రోత్సాహకాన్ని అందుకునేందుకు శ్రమించారు. ఇందులో నుంచి ఇంక్ కంపెనీ ప్రతినిధులు అమిత్, నిశ్చయ్లు ఎనిమిది టీంలను ఎంపిక చేశారు. ప్రపంచంలోని ఐదు ప్రముఖ కళాశాలల విద్యార్థులతో వరంగల్ నిట్ విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడనున్నారు. -
ముగిసిన జిల్లా స్థాయి యోగా పోటీలు
కాజీపేట రూరల్ : వరంగల్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) యోగా హాల్ లో జిల్లా యోగా సంఘం ఆధ్వర్యంలో శని వారం ప్రారంభమైన జిల్లా స్థాయి యోగా పోటీలు ఆదివారం ముగిశాయి. నిట్ ఫ్రొఫెసర్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ము గింపు కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ సం ధ్యారాణి మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ మానసిక శారీరక ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. అనంతరం యోగా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సెప్టెంబర్ 8, 9, 10 తేదిల్లో అదిలాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో యోగా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముప్ప మల్లేషం, బి.కమల్‌కుమార్, కోశాధికారి పాకాల రవిందర్, యోగా సంఘం కమిటి సభ్యులు పాల్గొన్నారు. -
దరఖాస్తు చేశారా?
* కాలికట్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) వివిధ విభాగాల్లో ఫుల్‌టైం, పార్ట్‌టైం, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్డీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశాల దరఖాస్తులకు చివరి తేది: మే 20 * హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)లో పీజీడీఆర్ డీఎం కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుకు చివరి తేది: మే 25 * ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌లో క్యూసీఐ సర్టీఫైడ్ యోగా ప్రొఫెషనల్స్ పోస్టుల దరఖాస్తుకు చివరి తేది: మే 25 -
నిట్ భవన నిర్మాణాలకు లైన్‌క్లియర్
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శాశ్వత భవనాల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇక్కడ విమానాశ్రయ భూములలో నిట్ నిర్మాణం కోసం 172.80 ఎకరాల భూమిని కేటాయించారు. గత ఏడాది ఆగస్టు 20న నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం ఈ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి నిట్‌కు దఖలు పర్చాలి. ఎలినేషన్ ప్రక్రియగా పేర్కొనే ఈ తతంగం పూర్తికావడానికి దాదాపు ఎనిమిదినెలలు పట్టింది. ఈ భూములను నిట్‌కు దఖలు పరుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖ ద్వారా అడ్వాన్సు పొజిషన్ ఇచ్చింది, సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టింది. ఈ పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. నిట్ భూములకు సంబంధించి ఎలినేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. దీని వివరాలను ఆన్లైన్లో పొందుపర్చారు. అధికారికంగా మరో రెండు రోజుల్లో ఏపీ నిట్ అధికారులకు చేరనున్నాయి. ఆరునెలల్లో డీపీఆర్ నిట్ శాశ్వత భవనాల నిర్మాణానికి ఆరు నెలల్లో డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు కానుంది. డీపీఆర్ తయారీకి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మానవనరుల మంత్రిత్వశాఖకు తెలియచేశారు. శాశ్వత భవనాల కోసం ఏమేరకు నిధులు కావాలి, ఎంత విస్తీర్ణంలో భవనాలను నిర్మించుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు అనే విషయాలు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ద్వారా కేంద్ర క్యాబినెట్‌కు వెళతాయి, క్యాబినెట్ అప్రూవల్ తర్వాత శాశ్వత భవనాల నిర్మాణ పనులు మొదలవుతాయి. ఆరు నెలలో వ్యవధిలో ఈ పనులు పూర్తికాగలవని ఏపీ నిట్ రెసిడెంటు కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ టి.రమేష్ తెలిపారు. మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యత ఏపీ నిట్‌కే నిట్ శాశ్వత భవనాల నిర్మాణాల కోసం ఢిల్లీలోని ఎడ్యూసెల్ మాస్టర్‌ప్లాన్ తయారుచేయాలి. ఈ ప్లాన్‌తోపాటు, ఇక్కడి పరిస్థితులకనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకునే వెసులుబాటును ఏపీ నిట్‌కు కల్పించారు. డీపీఆర్, మాస్టర్ ప్లాన్ తయారీలో ఐఐటీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులను తీసుకోనున్నారు. ఈ బృందం తయారు చేసిన డీపీఆర్ ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం ముగిసేలోగా నిట్‌కు శాశ్వత భవనాలు సిద్ధం కానున్నాయి. కొత్త హాస్టల్ భవనాలు సిద్ధం నిట్ తొలి ఏడాది విద్యార్థులలో బాలికల కోసం తాత్కాలిక క్యాంపస్‌లో హాస్టల్ వసతి కల్పించారు. బాలుర కోసం నల్లజర్లలో హాస్టల్ ఏర్పాటుచేశారు. రెండో సంవత్సరం వచ్చే బాలుర కోసం పెదతాడేపల్లిలో, బాలికలకు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలోని మరో కొత్త భవనాన్ని సిద్ధం చేశారు. రెండు నెలల ఆలస్యంగా నిట్ తొలి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో వారానికి ఐదు రోజులపాటు తరగతులకు బదులు, ఆరు రోజులు నిర్వహించారు. దీంతో మే పదో తేదీ నాటికి సెకండ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తవుతాయి. దీంతో నిట్ తొలి ఏడాది తరగతులు పూర్తవుతాయి. మే పదో తేదీ నుంచి సెలవులు ఇస్తున్నారు. జులై 25, 26 తేదీలలో సెలవులు పూర్తవుతాయని ఏపీ నిట్ రెసిడెంటు కో- ఆర్డినేటర్ ప్రొఫెసర్ రమేష్ తెలిపారు. -
క్లాసులకు రాకుంటే రేప్ చేయిస్తారట!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. 2000 మంది స్థానికేతర విద్యార్థులు తరగతులను బహిష్కరించి చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు శుక్రవారంతో ఎనిమిదో రోజుకు చేరింది. తమకు క్యాంపస్‌లో సురక్షితమైన వాతారణం లేదని, జమ్మూ-కశ్మీర్ కాకుండా వర్సిటీని మరోచోరుకు మార్చాలని స్థానికేతర విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. తరగతులకు హాజరు కాకుండా ఆందోళన కార్యక్రమంలో పాల్గొంటే....స్థానికులతో రేప్ చేయిస్తామని కశ్మీర్‌కు చెందిన సహ విద్యార్థినులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అని బిహార్‌కు చెందిన ఓ విద్యార్థిని వాపోయింది. హాస్టల్లోనే అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా అభద్రతాభావం ఎక్కువగా ఉందని తెలిపింది. తాము స్థానిక విద్యార్థులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్థానికేతర విద్యార్థులు స్పష్టం చేశారు. పరిస్థితులు సద్దుమణిగినట్లు అధికారులు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కేవలం పది శాతం విద్యార్థులు తరగతులకు హాజరై, మిగతా 90% మంది తరగతులు బాయ్‌కాట్ చేస్తే సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లా అని వారు ప్రశ్నించారు. కాగా స్థానికేతర విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరిన వీడియో క్లిప్పింగ్‌ను పోలీసులు విడుదల చేశారు. ఈనెల 11 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, అయితే ఇప్పుడు పరీక్షలు రాయని విద్యార్థులు అనంతరం రాయవచ్చని కేంద్ర బృందం తెలిపింది. క్యాంపస్‌లో గత శుక్రవారం, మంగళవారం జరిగిన ఘర్షణలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలు చేశారు. టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత కొంతమంది స్థానిక విద్యార్థులు క్యాంపస్‌లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోగా, స్థానికేతర విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. -
ఎన్ఐటీ వివాదంపై విచారణ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంపస్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణలతో చెలరేగిన దుమారంపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం విచారణకు ఆదేశించింది. శ్రీనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దీనిపై విచారణ జరిపి, 15 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తారని డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ విలేకరులకు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికేతర విద్యార్థులు తమ నిరసనను వరుసగా మూడోరోజూ కొనసాగించారు. లాఠీచార్జీ జరిపిన పోలీసులపై, తమను వేధించిన అధ్యాపకులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇన్స్టిట్యూట్ను కశ్మీర్ నుంచి తరలించాలని డిమాండ్‌చేశారు. విద్యార్థినులు కూడా నిరసనలో పాలుపంచుకున్నారు. భారత్ మాతా కీ జై అని నినదించారు. ఈనెల 11 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, అయితే ఇప్పుడు పరీక్షలు రాయని విద్యార్థులు తర్వాత రాయవచ్చని కేంద్ర బృందం చెప్పింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసు చీఫ్ కే రాజేంద్రకుమార్ క్యాంపస్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్యాంపస్‌లో గత శుక్రవారం, మంగళవారం జరిగిన ఘర్షణలపై పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లు దాఖలుచేశారు. ఇప్పటిదాకా వీటిలో ఎవరి పేరును కూడా నమోదుచేయలేదు. స్థానికేతర విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరిన వీడియో క్లిప్పిం గ్ను పోలీసులు విడుదల చేశారు. తాము స్థానిక విద్యార్థులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్థానికేతర విద్యార్థులు చెప్పారు. పరిస్థితులు సద్దుమణిగాయని అధికారులు చెబుతుండటం అవాస్తవమన్నారు. 10% మంది విద్యార్థులు తరగతులకు హాజరై, 90% మంది బాయ్‌కాట్ చేస్తే సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లా అని ప్రశ్నించారు. లాఠీచార్జీని నిరసిస్తూ నేషనల్ ప్యాంథర్స్ పార్టీ, ఇతర సంస్థలు జమ్మూలో బంద్ నిర్వహించాయి. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం పరిష్కారంచూపదన్న విషయాన్ని బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు ఎప్పుడు గ్రహిస్తాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. -
శ్రీనగర్ ఎన్ఐటీలో ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్‌లో పరిస్థితులు ఉద్రికంగా మారాయి. వారం రోజుల నుంచి స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య జరుగుతున్న ఘర్షణలు సద్దుమణగలేదు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బుధవారం కేంద్రం ఢిల్లీ నుంచి అధికార బృందాన్ని పంపింది. కాలేజీ ఆవరణలో దేశవ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న నిట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికేతర విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. మంగళవారం తమపై లాఠీచార్జీ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఎన్ఐటీని కశ్మీర్ నుంచి వేరేప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు క్యాంపస్‌కు వచ్చి ఆందోళన చేస్తున్న స్థానికేతర విద్యార్థులతో చర్చించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని సీఎం మెహబూబా హామీ ఇచ్చారు. క్యాంపస్‌లో సీఆర్పీఎఫ్ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. క్యాంపస్‌లో తమకు భద్రత లేదని, ఎన్ఐటీని మరో ప్రాంతానికి తరలించాలని స్థానికేతరులు డిమాండ్ చేశారు. ముందుగా తమను ఇంటికి పంపాలని, ఆ తర్వాత మీరు ఎక్కడికి పంపితే అక్కడ చేరతామని కేంద్ర బృందానికి చెప్పారు. ఎన్ఐటీ అధికారులు తమ భవిష్యత్‌తో ఆటలాడుతున్నారని, వారు రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులతో మాట్లాడేందుకు మీడియాను క్యాంపస్‌లోకి అనుమతించాలన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ఇరానీలు సీఎం మెహబూబాతో ఫోన్లో మాట్లాడారు. గతవారం టీ20 సెమీఫైనల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత కొంతమంది స్థానిక విద్యార్థులు క్యాంపస్‌లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోగా, స్థానికేతర విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. -
నిట్ ఏర్పాటుకు త్వరలో జీవో
దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుకు సంబంధించి నాలుగు రోజుల్లో జీవో విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గురువారం విలేకరులకు తెలిపారు. నిట్ ఏర్పాటుకు 172 ఎకరాల స్థలం అవసరం కాగలదని, తాజాగా ఇక్కడ పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు కోరారన్నారు. ఆ మేరకు 172 ఎకరాల భూమి వివరాలను కేంద్రానికి పంపించామన్నారు. రైతుల వద్ద నుంచి భూమి తీసుకోకుండానే ప్రభుత్వ భూమిలో నిట్ ఏర్పాటవుతుందన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నిట్ కావడంతో దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ జీవో విడుదల చేయాల్సి ఉందన్నారు. వచ్చే బుధవారం జీవో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. నిట్‌కు సంబంధించి డాక్యుమెంటేషన్, ఫీజులు తదితర వ్యవహారాలన్నీ వరంగల్ నిట్ ద్వారా ప్రస్తుతం జరుగుతాయన్నారు. నిట్ తాత్కాలిక తరగతులు వాసవిలో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని, వసతిని వాసవి ఇంజినీరింగ్ కళాశాల పూర్తిగా ఉచితంగా ఇచ్చిందని చెప్పారు. అది అవగాహన లేని అభిప్రాయం గోదావరి పుష్కరాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రభుత్వం తనకు ప్రాధాన్యతనివ్వలేదన్న విషయం వాస్తవం కాదని, కొందరు అవగాహన లేకుండా అలా అభిప్రాయపడ్డారని మంత్రి అన్నారు. పుష్కరాలు సంతృప్తికరంగా సాగాయన్నారు. పుష్కరాల సమయంలో జరిగిన మూడు ఘటనల వెనుక కుట్ర దాగి ఉందని, దీనిపై దర్యాప్తు చురుగ్గా సాగుతుందన్నారు. పుష్కరాల సమయంలో ఒక పొగబాంబు పేలిందని, దీని తర్వాత రాజమండ్రిలో తొక్కిసలాట జరగడం, రాజమండ్రిలోనే అగ్నిప్రమాదం జరిగి సెకన్ల వ్యవధిలో మంటలు చెలరేగడం వంటి సంఘటనలు వెనుక కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు. పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నామని, సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు రైల్వే అభివృద్ధి పనులపై దృష్టి సారించామన్నారు. గూడెం రైల్వేస్టేషన్లో 1వ నెంబరు ప్లాట్‌ఫారంపై ఉన్న ఎఫ్‌సీఐ గోదాములను తొలగించి ప్లాట్ఫారం విస్తరించడం, ప్రస్తుతం ఉన్న గూడ్స్‌షెడ్‌ను నవాబ్‌పాలెం తరలించి, ఆ ప్రాంతంలో నాల్గవ నెంబరు ప్లాట్ఫారం, టిక్కెట్ కౌంటర్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామని మంత్రి చెప్పారు. నియామకాలపై బ్యాన్ తొలగగానే వివిధ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. -
టీడీపీ Vs బీజేపీ
ఏలూరు సిటీ :నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) జిల్లాకు మంజూరుకావడం ఆనందదాయకమే అయినా అది ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలకు కారణమైంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నిట్‌ను జిల్లాకు తీసుకురావటంలో ఐక్యంగా పనిచేయాల్సిన మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య ఇప్పుడు అగాధం ఏర్పడింది. పైకి తమ మధ్య ఏవిధమైన విభేదాలు లేవని చెబుతున్నా లోలోన ఆధిపత్య పోరు జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమ ప్రాంతంలోనే నిట్‌ను ఏర్పాటు చేయాలని గట్టిగా ప్రయత్నించడంతో అది విభేదాల స్థాయికి చేరుకుంది. నర్మగర్భంగానైనా మాటల తూటాలు వదులుకునేలా పరిస్థితి మారిపోయింది. నేటికీ నిట్ ఎక్కడ పెట్టాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయానికి రాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ వర్సెస్ బీజేపీ జాతీయ స్థాయి విద్యా సంస్థ నిట్ ఏర్పాటు విషయంలో మొదట్లోనే జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిట్ జాతీయ బృందం పరిశీలన సమయంలోనే టీడీపీ, బీజేపీ నేతలు వాగ్వివాదానికి దిగారు. ఏలూరు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక తరగతులు, వట్లూరులో నిట్ శాశ్వత భవనాల నిర్మాణం జరగాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రయత్నాలు చేస్తే. మరోవైపు బీజేపీ మంత్రి మాణిక్యాలరావు,నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. జూన్ 8న ఏలూరులోనే నిట్ అంటూ కేంద్ర మానవ వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తమ కృషితోనే నిట్ ఏలూరుకు వచ్చిందని ఎంపీ మాగంటి బాబు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పేశారు. దీనిపై తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రి మాణిక్యాలరావు నిట్ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయకుంటే మంత్రి పదవే వద్దంటూ అలకపూని మరీ తాడేపల్లిగూడేనికే నిట్ వచ్చేలా పట్టుబట్టారని తెలుస్తోంది. ఏలూరు వర్సెస్ టీపీజీ : నిట్ ఏర్పాటు చేసే క్రమంలో అనుకూల విషయాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం సైతం ఏలూరులో ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాత్కాలిక తరగతులు సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలోనూ, వట్లూరులోని పెదచెరువు ప్రాంతంలోని 350ఎకరాలను కేటాయిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిందని ప్రచారం చేశారు కూడా. 35 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం, నిట్ ప్రాంతానికి పక్కనే జాతీయ రహదారి, ఏలూరు నగరం ఉండడం సానుకూల అంశాలుగా వారు చెప్పారు. ఇక తాడేపల్లిగూడెంలో అటవీ భూమిల్లోగానీ, విమానాశ్రయ భూముల్లో గానీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. తాత్కాలిక తరగతులు వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శుక్రవారం కూడా నిట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులతో సమీక్షించి వివరాలు సేకరించారు. చివరికి ప్రతిష్టాత్మక నిట్.. ఎవరి ప్రతిష్టను పెంచుతుందో వేచి చూడాల్సిందే. -
నిట్.. గూడెంలో సెట్
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) తాత్కాలిక తరగతులు నిర్వహించేది ఏలూరులోనా.. తాడేపల్లిగూడెంలోనా అనే మీమాం సకు తెరపడింది. తాడేపల్లిగూడెంలోనే ఈ విద్యా సంవత్సరం నుంచే నిట్ తరగతులు నిర్వహించనున్నారు. కేంద్రం నుంచి వచ్చిన సాంకేతిక బృందం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాల భవనాలను పరి శీలించింది. శాశ్వత భవనాలు నిర్మిం చేంత వరకూ వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలోనే తాత్కాలికంగా తరగతులు నిర్వహించవచ్చని స్పష్టం చేయడంతో.. ఇక్కడే తరగతులు నిర్వహిం చేందుకు మంగళవారం నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. త్వరలోనే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం. అడ్మిషన్లు ఇలా.. జేఈఈ ఫలితాల ఆధారంగా నిట్‌లో సీట్లు ఇస్తారు. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ ఫలితాలలో విద్యార్థులు సాధించిన మార్కుల అధారంగా నిట్‌లో సీట్లు కేటాయిస్తారు. అడ్వాన్స్డ్ ఫలితాల్లో కటాఫ్ మార్కుకు పైన ఉన్న విద్యార్థులు ఐఐటీలకు వెళతారు. మెయిన్ ఫలితాలలో ర్యాంకులు సాధిం చిన విద్యార్థులకు కటాఫ్ మార్కుల ఆధారంగా నిట్‌లో సీటు దొరుకుతుంది. గతంలో ఐఐటీకి వేరుగా, నిట్‌కు వేరుగా కౌన్సెలింగ్ జరగ్గా, ప్రస్తుతం రెండింటికీ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహిస్తారని చెబుతున్నారు. నిట్‌లో ప్రవేశానికి ఈ నెల 18 తర్వాత నాలుగు దఫాలుగా కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్ పూర్తయ్యాక అడ్మిషన్లు ఇస్తారు. అనంతరం తరగతులు మొదలవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం జూలైలో పూర్తవుతుం దని, అదే నెల చివరి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే నిట్‌లో ఈ విద్యా సంవత్సరంలోనే 540 మంది విద్యార్థులు చేరతారు. రెండో ఏడాది మరో 540 మంది చేరతారు. వీరి కోసం వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక నిర్మాణాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులకు గురువారం శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. నిట్‌కు శాశ్వత భవనాలు నిర్మించడానికి కనీసం రెండేళ్లు పడుతుంది. అప్ప టివరకు వాసవిలోనే తాత్కాలికంగా తరగతులు నిర్వహిస్తారు. -
నిట్‌లో నిబంధనల ప్రకారమే సీట్లు
50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే 371-డి ఎన్ఐటీలకు వర్తించదు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్య హెచ్ఆర్డీ శాఖ కార్యదర్శితో భేటీ న్యూఢిల్లీ: వరంగల్‌లోని నిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం కోరడం చట్ట వ్యతిరేక మని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిబంధనల ప్రకారం జాతీయ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకే 50 శాతం సీట్లు చెందుతాయని, వీటిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తన పలుకుబడి ఉపయోగించి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఉదయం ఢిల్లీకి వచ్చిన కడియం, కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ కార్యదర్శి ఎస్.ఎం.మహంతితో సమావేశమయ్యారు. వరంగల్ ఎన్ఐటీలో తమ విద్యార్థులకు సీట్లు కేటాయించాలంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై ఆయనతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించి 2007లో చేసిన చట్టాల ప్రకారం.. విద్యా సంస్థ ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 50 శాతం సీట్లు, మిగిలిన రాష్ట్రాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు. దీని ప్రకారం వరంగల్ నిట్‌లో ఉన్న 740 సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 370 సీట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. 371-డి ప్రకారం రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విద్యా సంస్థల్లోనే పదేళ్లపాటు ఉమ్మడి అడ్మిషన్లు జరగాలని, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇదే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఏ నిబంధనల ప్రకారం చూసినా నిట్ వరంగల్‌లో ఏపీ విద్యార్థులకు కోటా కోరడం సరికాదన్నారు. కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి దొడ్డిదారిన సీట్లు పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, అన్ని మార్గాల్లో అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ఇలాంటి సందర్భాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రకారం సూపర్ న్యూమరీ సీట్లు కేటాయించి ఏపీ విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు. వరంగల్ నిట్‌లోనూ అవకాశం ఉంటే, ఏపీ విద్యార్థుల కోసం సూపర్ న్యూమరీ సీట్లు కేటాయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీల్లో నిరుపయోగంగా ఉన్న భూములను పేదల ఇళ్లు నిర్మించేందుకు వినియోగించడంలో తప్పులేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ భూములను ఎందుకు వినియోగిస్తున్నామన్న అంశాన్ని విద్యార్థులు సైతం అర్థం చేసుకోవాలన్నారు. -
మరో.. సారీ!
పశ్చిమ’పై తనకు ప్రత్యేక అభిమానం అని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలోనే జిల్లాకు విద్యాపరంగా మరో అన్యాయం జరుగుతోంది. ప్రతిష్టాత్మక నిట్ ఏర్పాటులో ఊరించి ఉస్సూరనిపించిన సర్కారు తాజాగా రూసా పథకం కింద జిల్లాకు రావాల్సిన యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోయినా కిమ్మనడం లేదు. తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం రూసా పథకం కింద జిల్లాలో ఏర్పాటు చేయదలచిన మరో యూనివర్సిటీ పక్క జిల్లాకు తరలిపోయింది. గతంలో ప్రతిపాదించిన ఒంగోలు, పశ్చిమగోదావరి, విజయనగరం జిల్లాలో యూనివర్సిటీలను ఏర్పాటు చేయకూడదని కేంద్ర నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ పథకంలో పీజీ కేంద్రాలను వర్సిటీలుగా మార్చాలనుకున్నారు. ఈ ప్రతిపాదనను తిరిగి పరిశీలించిన కేంద్రంలోని ఈ వ్యవహారాలు చూసే అధికారులు తాజాగా కొత్త నిర్ణయాలను తీసుకున్నారు. అటానమస్ కళాశాలలను మాత్రమే యూనివర్శిటీలుగా రూసా పథకంలో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు, ఈ క్రమంలో తూర్పుగోదావరిలోని రాజమండ్రి, కాకినాడలో వర్శిటీలు రూసా పథకంలో ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం జిల్లాకు మొండి చెయ్యి చూపించినట్టే. జిల్లాకు ఉపయుక్తంగా ఉండేది ఈ వర్శిటీ వస్తే, అకడమిక్ విద్యా కోర్సులకు భిన్నంగా, జిల్లాకు ఉపయుక్తంగా ఉండే, ైరె తాంగానికి మేలు చేసే, పరిశోధనలకు అవకాశం కల్గించే కోర్సులు అందుబాటులోకి వచ్చేవి. గతంలో వర్శిటీ ప్రతిపాదన వచ్చిన సమయంలో క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారుల బృందం కేంద్రానికి ఏఏ కోర్సులు ఏర్పాటు చేయాలనే విషయంలో ప్రతిపాదనలను పంపింది. రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ (రూసా) పథకంలో జిల్లాకు ఒక యూనివర్శిటీ ఏర్పాటు చేయడానికి గాను 2014 లో కేంద్రం ప్రతిపాదనలను కోరింది. ఈ పథకం కింద జిల్లాలో వర్శిటీ ఏర్పాటుకు గాను ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం వంటి ప్రాంతాలను చూశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విమానాశ్రయ రన్‌వే సమీపంలో తాడేపల్లిగూడెంలో సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆంధ్రా యూనివర్శిటీ క్యాంపస్ రూసా పథకంలో వర్శిటీకి అనుకూలమని నివేదికలను కేంద్రానికి సమర్పించారు. ఈలోగా సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. ఎన్నికలు ముగిశాక, ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఎన్నికై దేవాదాయ ధర్మాదాయశాఖా మంత్రి అయిన పైడికొండల మాణిక్యాలరావు గూడెంకు మరో యూనివర్శిటీ రానుందని ప్రకటించారు. రూసా పథకంలోది కాకుండా మరో కొత్త వర్శిటీ వస్తుందని జిల్లా ప్రజలు ఆశించారు. కాని ఈ విషయంలోనే నిట్ మాదిరే నిరాశ ఎదురయింది. సమగ్ర నివేదిక సమర్పించినా.. ఆంధ్రా విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ జీఎస్ఎన్ రాజు, రిజిస్ట్రార్, గూడెంలోని ఏయూ క్యాంపస్ ఇన్చార్జి ప్రత్యేకాధికారి జి.సుధాకర్‌లు సమగ్ర సమాచారం కేంద్రానికి అందచేశారు. గ్రామీణ ప్రాంతాలకు ఉన్నత విద్యను చేరువ చేసే సంకల్పంతో కేంద్రంలోని మానవవనరుల మంత్రిత్వ శాఖ సేకరించిన వివరాల ఆధారంగా, రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి అందించిన సమాచారం క్రోడీకరించుకొని కొత్తగా వర్సిటీలు ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్షా అభియాన్ పథకంలో రాష్ట్రంలో 12 కొత్త వర్సిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ గత ఏడాది ఫిబ్రవరి నుంచి వేగవంతం అయింది. ఒక్కో యూనివర్సిటీ ఏర్పాటుకు రూ.55 కోట్లు వెచ్చించాలని, మూడేళ్లలో రూ.2600 కోట్లతో ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చే యాలని అప్పట్లో భావించారు. కొత్త వర్సిటీల ఏర్పాటుకు వెచ్చించే నిధులలో 65 శాతం కేంద్రం వెచ్చిస్తుంది. మిగిలిన 35 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూసా పథకం, -
నిట్ కోర్సులకు ‘ఎన్బీఏ’ గుర్తింపు
అగ్రదేశాల చెంతన సాంకేతిక కళాశాల ఆనందోత్సవాల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీ నిట్ క్యాంపస్ : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కళాశాలల్లో బెస్ట్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్గా పేరు సంపాదించిన వరంగల్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్ బీఏ) గుర్తింపుతో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కాగా, నిట్‌లోని సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల క్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) బీటెక్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు వచ్చినట్లు ఈనెల 18న నిట్ డెరైక్టర్‌కు ఫ్యాక్స్ ద్వారా సమాచారం అం దింది. కాగా, ఎన్బీఏ గుర్తింపుతో ఇక్కడ చది విన విద్యార్థులకు వాషింగ్టన్‌లోని అక్రాడ్ దేశాల్లోని విదేశీ విద్యార్థులతో ఇంజినీరింగ్ విద్య లో లక్ష్యాలను అధిగమించడానికి ఏ విధమైన కృషి చేయాలనే అంశాలను తెలుసుకునే అవకాశం లభించింది. నాలుగు కోర్సులకు గుర్తింపు.. నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) బృందం ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 12 తేదీ వరకు మూడు రోజుల పాటు నిట్‌లో పర్యటించింది. కాగా, నిట్‌లోని అండర్ గ్రా డ్యుయేట్, పీజీ కోర్సులకు సంబంధించి ఎన్బీఏ గుర్తింపు కోసం యాజమాన్యం 2008లో దరఖాస్తు చేసుకుంది. అయితే ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఏడాది ఎన్బీఏ బృందం నిట్‌లోని అన్ని బీటెక్ విభాగాలను క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీ చేసింది. ఇందులో భాగంగా తొలి విడతగా బీటెక్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కోర్సులకు గుర్తింపును ఇవ్వడంతో నిట్ తొలిసారిగా అంతర్జాతీయస్థాయిలో పేరు సంపాదించింది. అగ్రదేశాల సరసన.. వాషింగ్టన్ అక్రాడ్ అనేది ఇంటర్నేషనల్ అం డర్ గ్రాడ్యుయేట్ ప్రొఫెషనల్ ఇంజినీరింగ్ కోర్సులకు సంబంధించిన అగ్రిమెంట్. అయి తే ఎన్బీఏ గుర్తింపుతో వరంగల్ నిట్ తాజాగా వాషింగ్టన్ అక్రాడ్లో స్థానాన్ని సంపాదించుకుంది. వాషింగ్టన్ అక్రాడ్ 1989లో ఏర్పాైటైం ది. అయితే ఇంటర్నేషనల్ అండర్ గ్రాడ్యుయే ట్ ప్రోగ్రాంల ద్వారా ఇంజినీరింగ్ విద్యలో నైపుణ్యాలను, జ్ఞానాన్ని, సామర్థ్యాలను మెరుగుపరుచుకోవడంతోపాటు గ్లోబల్‌గా క్వాలిటీ ఇంజినీర్లను తయారుచేసి వారికి ఉపాధి అవకాశాలను అందించడం దీని ఉద్దేశం. ఇందులో భాగంగా వాషింగ్టన్ అక్రాడ్ అగ్రిమెంట్‌పై ఈ ఏడాది జూన్ 13న ఎన్బీఏ(ఇండియా) సంత కం చేసింది. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ అక్రాడ్లో ఇండియా 17వ దేశం కావడం విశేషం. కాగా, వాషింగ్టన్ అక్రాడ్లో యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునెటైడ్ కింగ్డమ్ వంటి అగ్రదేశాలు ఉన్నాయి. అలాగే యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునెటైడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, కెనడా, తైవాన్, హంగ్‌కాంగ్, ఐర్లాండ్, జపాన్, మలేషియా, కొరియా, న్యూ జిలాండ్, రష్యా, సింగపూర్, సౌత్ ఆఫ్రికా, టర్కీ, శ్రీలంక, ఇండియా ఉన్నాయి. ఇదిలా ఉండగా, నిట్‌కు ఎన్బీఏ గుర్తింపు రావడంతో ఇక్కడ చదువుకున్న విద్యార్థులకు అంతర్జాతీయంగా ఇంజినీరింగ్‌లో నైపుణ్యాలు, సామర్థ్యాలు పెంచుకునే అవకాశం లభించింది. డెరైక్టర్‌కు అభినందనలు తెలిపిన చైర్మన్.. నిట్ డెరైక్టర్ టి.శ్రీనివాసరావుతో పాటు ఫ్యాకల్టీ, స్టూడెంట్స్‌తో పాటు ఉద్యోగులకు నిట్ బో ర్డు ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ కృష్ణా ఎం.ఎల్లా అభినందన సందేహం పంపించారు. ఎన్బీఏ గు ర్తింపు కోసం అహర్నిషలు కృషి చేశారని కొ నియాడారు. ఈ మేరకు ఫ్యాకల్టీ, విద్యార్థులు ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. -
విద్యావృక్షం
రీజినల్ ఇంజినీరింగ్ కాలేజీ(ఆర్ఈసీ).. ఓరుగల్లును విద్యాహబ్‌గా మార్చిన విజ్ఞానగని.. ప్రతిభావంతులకు పుట్టినిల్లు.. ఎందరెందరినో ఉన్నతులుగా.. మహోన్నతులుగా తీర్చిదిద్దిన విద్యాశిఖరం. కాలక్రమంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)గా రూపాంతరం చెంది.. విద్యాకుసుమాలను అందిస్తున్న ప్రతిష్టాత్మక సాంకేతిక కేంద్రం..! తెలంగాణ ఘనతను నలుదిశలా ఇనుమడింప జేస్తూ.. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా ఆణిముత్యాలను తయూరు చేస్తున్న నిరంతర విద్యా పరిశ్రమ. నాటి విద్యార్థులే మేటి విద్యావృక్షాలు ప్రభుత్వ, పారిశ్రామిక, శాస్త్రసాంకేతిక రంగాలతోపాటు రాజకీయూల్లో రాణించి జిల్లా కీర్తిని చాటుతున్నారు. ప్రజా సేవలో పాలుపంచుకుంటూ తాము చదివిన నిట్‌కు, నడయూడిన జిల్లాకు వన్నె తెస్తున్నారు. అలాంటి వారిలో కొందరిపై ఈ వారం ‘సండే స్పెషల్’.. నిట్ క్యాంపస్ : ఒకప్పటి రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ.. ఇప్పటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యా కుసుమాలను దేశానికి అందజేస్తూ చెరిగిపోని ముద్ర వేసుకుంటోంది. దేశంలో సాంకేతిక విద్యను అభివృద్ధి చేసేందుకు అప్పటి ప్రధాని జవహర్లాల్ నె హ్రూ వరంగల్ నగర పరిధిలోని కాజీపేటలో 1959 అక్టోబర్ 10న రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. అనతికాలంలోనే నిట్... చదువుల తల్లిగా పేరు సంపాదించింది. అప్పటినుంచి ఏటేటా విద్యా కుసుమాలను తయూరుచేసి తన దైన ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇందులో విద్యనభ్యసించిన పలువురు దేశవిదేశాల్లో ఉన్నత స్థానాల్లో నిలిచి వరంగల్ కీర్తిని చాటుతున్నారు. ఎక్కువ మంది ఆర్ఈసీ విద్యార్థులు ప్రభుత్వ, పారిశ్రామిక, శాస్త్ర సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాల్లో స్థిరపడి నిట్ ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారు. దేశంలోని అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్ సర్వీస్‌లకు ఎంపికయ్యూరు. సివిల్స్ టాపర్ అయిన ముత్యాలరాజు (ఐఏఎస్), పారిశ్రామిక రంగంలోకి వచ్చి ఆ తర్వాత రాజకీయ రంగానికి మళ్లిన నెల్లూర్ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, నంధ్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి నిట్ పూర్వ విద్యార్థులే. సివిల్ సర్వీసుల్లో ఉన్న వి.అనిల్‌కుమార్(ఐ0ఎస్), ఎన్వీ.సురేందర్‌బాబు (ఐపీఎస్), ఎం.మహేందర్‌రెడ్డి (ఐపీఎస్), తెన్నీటి క్రిష్ణ ప్రసాద్ (ఐపీఎస్) సైతం నిట్ పూర్వ విద్యార్థులే కావడం విశేషం. అంతేకాకుండా... కొందరు సామాజిక ఉద్యమాలపై ఆకర్షితులై పీపుల్స్‌వార్‌లో చేరారు. సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు కేశవరావు నిట్ పూర్వ విద్యార్థే, న్‌కౌంటర్‌లో చనిపోయిన సీపీఐ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ నిట్‌లో విద్యనభ్యసించినవాడే. నిట్ డెరైక్టర్‌గా ఉన్న ప్రొఫెసర్ టి. శ్రీనివాసరావు రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలోనే మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో 1982లో బీటెక్ పూర్తి చేశారు. తాము చదువుకున్న బడిని మరిచిపోకుండా ఇప్పటికీ నిట్ అభివృద్ధికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్వ విద్యార్థులు తమ వంతు సహకారం అందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. నిట్ విద్యార్థులు లక్ష్యాన్ని చేధిస్తారు చిన్నతనం నుంచే నిట్‌లో చదివే అవకాశం దొరకాలని టార్గెట్‌గా పెట్టుకుని కష్టపడ్డా. చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంచుకున్నా. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ప్రతిభ కనబర్చి అవార్డులను అందుకున్నా. కరాటే అంటే నాకు అమితమైన ప్రేమ. నా తల్లిదండ్రుల ఆశీస్సుల వల్లే ఈ రోజు ఈ స్థాయికి ఎదిగా. నిట్‌లో చదువుకున్న వారు క్రమశిక్షణతో అనుకున్న లక్ష్యాన్ని చేధిస్తారు. ఐఏఎస్ కావాలనే లక్ష్యం ఉన్నప్పటికీ... కొన్ని కారణాల మూలంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యే అయ్యూ. - శంకర్ నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే పూర్వ విద్యార్థులకు అవార్డులు ఇస్తాం.. నిట్ పూర్వవిద్యార్థి కావడం నాకు గర్వకారణంగా ఉంది. నిట్ అభివృద్ధిలో పూర్వ విద్యార్దుల సహకారం ఎంతో ఉంది. ఆర్ఈసీ, నిట్‌లో చదువుకున్న విద్యార్థులకు డిసెంబర్ 26న అవార్డులు ఇవ్వనున్నాం. నిట్‌లో బోధన ప్రమాణాలు బాగానే ఉన్నప్పటికీ... అంతర్జాతీయంగా పరిశోధన ప్రమాణాల పరంగా పోటీ ఎదురవుతోంది. అందుకే బోధన ప్రమాణాలతో పాటు పరిశోధన రంగంవైపు ఇంజనీరింగ్ విద్యార్థులు దృష్టి పెట్టేలా కృషి చేస్తున్నాం. పీహెచ్డీ చేసే ఇంజనీరింగ్ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాం. - టి.శ్రీనివాసరావు, నిట్ డెరైక్టర్ 1. పి. సుధాకర్, సీఎండీ, ఈసీఐఎల్ 2. చంగపల్లి వెంకట్, సీఈవో, ఈఎంఆర్ఐ 3. మహేందర్‌రెడ్డి, ఐపీఎస్ 4. సురేంద్రబాబు, డీజీ 5. కృష్ణ ప్రసాద్, డీజీ 6.ముత్యాల రాజు, సివిల్స్ టాపర్ 7. అనిల్ కుమార్, ఐఏఎస్ 8. రాజమోహన్‌రెడ్డి, నెల్లూరు ఎంపీ 9. ఎస్పీవై రెడ్డి, నంద్యాల ఎంపీ 10. సాంబశివరావు, కేంద్ర మాజీ మంత్రి 11. రామ్మోహన్రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి 12. శ్రీనివాసరావు, నిట్ డెరైక్టర్ 13. శంకర్ నాయక్, ఎమ్మెల్యే