తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) శాశ్వత భవనాల నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఇక్కడ విమానాశ్రయ భూములలో నిట్ నిర్మాణం కోసం 172.80 ఎకరాల భూమిని కేటాయించారు. గత ఏడాది ఆగస్టు 20న నిట్ శాశ్వత భవనాల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. నిబంధనల ప్రకారం ఈ భూమి చుట్టూ ప్రహరీ నిర్మించి నిట్‌కు దఖలు పర్చాలి. ఎలినేషన్ ప్రక్రియగా పేర్కొనే ఈ తతంగం పూర్తికావడానికి దాదాపు ఎనిమిదినెలలు పట్టింది. ఈ భూములను నిట్‌కు దఖలు పరుస్తూ, రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూశాఖ ద్వారా అడ్వాన్సు పొజిషన్ ఇచ్చింది, సాంఘిక సంక్షేమ శాఖ పర్యవేక్షణలో భూముల చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టింది. ఈ పనులు దాదాపుగా పూర్తికావస్తున్నాయి. నిట్ భూములకు సంబంధించి ఎలినేషన్ ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. దీని వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చారు. అధికారికంగా మరో రెండు రోజుల్లో ఏపీ నిట్ అధికారులకు చేరనున్నాయి.
ఆరునెలల్లో డీపీఆర్
నిట్ శాశ్వత భవనాల నిర్మాణానికి ఆరు నెలల్లో డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు కానుంది. డీపీఆర్ తయారీకి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మానవనరుల మంత్రిత్వశాఖకు తెలియచేశారు. శాశ్వత భవనాల కోసం ఏమేరకు నిధులు కావాలి, ఎంత విస్తీర్ణంలో భవనాలను నిర్మించుకోవాలనుకుంటున్నారు, ఎంతమంది సిబ్బంది అవసరం అవుతారు అనే విషయాలు కేంద్ర మానవవనరుల మంత్రిత్వశాఖ ద్వారా కేంద్ర క్యాబినెట్‌కు వెళతాయి, క్యాబినెట్ అప్రూవల్ తర్వాత శాశ్వత భవనాల నిర్మాణ పనులు మొదలవుతాయి. ఆరు నెలలో వ్యవధిలో ఈ పనులు పూర్తికాగలవని ఏపీ నిట్ రెసిడెంటు కో-ఆర్డినేటర్ ప్రొఫెసర్ టి.రమేష్ తెలిపారు.
మాస్టర్ ప్లాన్ తయారీ బాధ్యత ఏపీ నిట్‌కే
నిట్ శాశ్వత భవనాల నిర్మాణాల కోసం ఢిల్లీలోని ఎడ్యూసెల్ మాస్టర్‌ప్లాన్ తయారుచేయాలి. ఈ ప్లాన్‌తోపాటు, ఇక్కడి పరిస్థితులకనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసుకునే వెసులుబాటును ఏపీ నిట్‌కు కల్పించారు. డీపీఆర్, మాస్టర్ ప్లాన్ తయారీలో ఐఐటీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులను తీసుకోనున్నారు. ఈ బృందం తయారు చేసిన డీపీఆర్ ఆధారంగా వచ్చే విద్యాసంవత్సరం ముగిసేలోగా నిట్‌కు శాశ్వత భవనాలు సిద్ధం కానున్నాయి.
కొత్త హాస్టల్ భవనాలు సిద్ధం
నిట్ తొలి ఏడాది విద్యార్థులలో బాలికల కోసం తాత్కాలిక క్యాంపస్‌లో హాస్టల్ వసతి కల్పించారు. బాలుర కోసం నల్లజర్లలో హాస్టల్ ఏర్పాటుచేశారు. రెండో సంవత్సరం వచ్చే బాలుర కోసం పెదతాడేపల్లిలో, బాలికలకు వాసవీ ఇంజనీరింగ్ కళాశాలలోని మరో కొత్త భవనాన్ని సిద్ధం చేశారు. రెండు నెలల ఆలస్యంగా నిట్ తొలి ఏడాది తరగతులు ప్రారంభమయ్యాయి. దీంతో వారానికి ఐదు రోజులపాటు తరగతులకు బదులు, ఆరు రోజులు నిర్వహించారు. దీంతో మే పదో తేదీ నాటికి సెకండ్ సెమిస్టర్ పరీక్షలు పూర్తవుతాయి. దీంతో నిట్ తొలి ఏడాది తరగతులు పూర్తవుతాయి. మే పదో తేదీ నుంచి సెలవులు ఇస్తున్నారు. జులై 25, 26 తేదీలలో సెలవులు పూర్తవుతాయని ఏపీ నిట్ రెసిడెంటు కో- ఆర్డినేటర్ ప్రొఫెసర్ రమేష్ తెలిపారు.
నిట్ భవన నిర్మాణాలకు లైన్‌క్లియర్
Published Thu, Apr 21 2016 12:25 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM
Advertisement
Advertisement