ఎన్‌ఐటీ వివాదంపై విచారణ
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంపస్‌లో స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణలతో చెలరేగిన దుమారంపై రాష్ట్ర ప్రభుత్వం గురువారం విచారణకు ఆదేశించింది. శ్రీనగర్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ దీనిపై విచారణ జరిపి, 15 రోజుల్లోగా నివేదిక సమర్పిస్తారని డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ విలేకరులకు చెప్పారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని, విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు. స్థానికేతర విద్యార్థులు తమ నిరసనను వరుసగా మూడోరోజూ కొనసాగించారు. లాఠీచార్జీ జరిపిన పోలీసులపై, తమను వేధించిన అధ్యాపకులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇన్‌స్టిట్యూట్‌ను కశ్మీర్ నుంచి తరలించాలని డిమాండ్‌చేశారు.
విద్యార్థినులు కూడా నిరసనలో పాలుపంచుకున్నారు. భారత్ మాతా కీ జై అని నినదించారు. ఈనెల 11 నుంచి పరీక్షలు యథాతథంగా జరుగుతాయని, అయితే ఇప్పుడు పరీక్షలు రాయని విద్యార్థులు తర్వాత రాయవచ్చని కేంద్ర బృందం చెప్పింది. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసు చీఫ్ కే రాజేంద్రకుమార్ క్యాంపస్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. క్యాంపస్‌లో గత శుక్రవారం, మంగళవారం జరిగిన ఘర్షణలపై పోలీసులు రెండు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలుచేశారు.
ఇప్పటిదాకా వీటిలో ఎవరి పేరును కూడా నమోదుచేయలేదు. స్థానికేతర విద్యార్థులు పోలీసులపై రాళ్లు విసిరిన వీడియో క్లిప్పిం గ్‌ను పోలీసులు విడుదల చేశారు. తాము స్థానిక విద్యార్థులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, తమకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని స్థానికేతర విద్యార్థులు చెప్పారు. పరిస్థితులు సద్దుమణిగాయని అధికారులు చెబుతుండటం అవాస్తవమన్నారు.
10% మంది విద్యార్థులు తరగతులకు హాజరై, 90% మంది బాయ్‌కాట్ చేస్తే సాధారణ పరిస్థితులు నెలకొన్నట్లా అని ప్రశ్నించారు. లాఠీచార్జీని నిరసిస్తూ నేషనల్ ప్యాంథర్స్ పార్టీ, ఇతర సంస్థలు జమ్మూలో బంద్ నిర్వహించాయి. విద్యార్థులపై లాఠీచార్జి చేయడం పరిష్కారంచూపదన్న విషయాన్ని బీజేపీ, దాని భాగస్వామ్య పార్టీలు ఎప్పుడు గ్రహిస్తాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు.