శ్రీనగర్ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ నిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్‌లో పరిస్థితులు ఉద్రికంగా మారాయి. వారం రోజుల నుంచి స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య జరుగుతున్న ఘర్షణలు సద్దుమణగలేదు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు బుధవారం కేంద్రం ఢిల్లీ నుంచి అధికార బృందాన్ని పంపింది. కాలేజీ ఆవరణలో దేశవ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న నిట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికేతర విద్యార్థులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.
మంగళవారం తమపై లాఠీచార్జీ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, ఎన్‌ఐటీని కశ్మీర్ నుంచి వేరేప్రాంతానికి మార్చాలని డిమాండ్ చేశారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు చెందిన ముగ్గురు సీనియర్ అధికారులు క్యాంపస్‌కు వచ్చి ఆందోళన చేస్తున్న స్థానికేతర విద్యార్థులతో చర్చించారు. ఇతర రాష్ట్రాల విద్యార్థులందరికీ భద్రత కల్పిస్తామని సీఎం మెహబూబా హామీ ఇచ్చారు. క్యాంపస్‌లో సీఆర్‌పీఎఫ్ బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. క్యాంపస్‌లో తమకు భద్రత లేదని, ఎన్‌ఐటీని మరో ప్రాంతానికి తరలించాలని స్థానికేతరులు డిమాండ్ చేశారు.
ముందుగా తమను ఇంటికి పంపాలని, ఆ తర్వాత మీరు ఎక్కడికి పంపితే అక్కడ చేరతామని కేంద్ర బృందానికి చెప్పారు. ఎన్‌ఐటీ అధికారులు తమ భవిష్యత్‌తో ఆటలాడుతున్నారని, వారు రాజీనామా చేయాలన్నారు. విద్యార్థులతో మాట్లాడేందుకు మీడియాను క్యాంపస్‌లోకి అనుమతించాలన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, ఇరానీలు సీఎం మెహబూబాతో ఫోన్‌లో మాట్లాడారు. గతవారం టీ20 సెమీఫైనల్లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన తర్వాత కొంతమంది స్థానిక విద్యార్థులు క్యాంపస్‌లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకోగా, స్థానికేతర విద్యార్థులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి.