దాడులు దారుణం
సెంట్రల్ యూనివర్సిటీ: మణిపూర్ ఉదంతంపై నగరంలో నిరసన వెల్లువెత్తింది. విద్యార్థి లోకం తీవ్రంగా స్పందించింది. మనమంతా ఒక్కటేననే సమైక్యతా భావాన్ని చాటింది. ఆ రాష్ట్రానికి చెందిన విద్యార్థులూ దాడిని తీవ్రంగా ఖండించారు. మణిపూర్ నిట్‌లో బీటెక్ చదివే తెలుగు విద్యార్థులపై అక్కడి సీనియర్లు దాడికి పాల్పడ డాన్ని తాము ఎంతమాత్రం సహించబోమంటూ నిరసన వ్యక్తం చేశారు. దాడి హేయమని పేర్కొన్నారు. మణిపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ చదువుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సుమారు 20 మంది విద్యార్థులపై గత గురువారం నుంచి అక్కడి సీనియర్లు దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
ఈ సంఘటనపై హైదరాబాద్‌లో చదువుకుంటున్న మణిపూర్ విద్యార్థులు స్పందించారు. ఇఫ్లూ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలకు చెందిన వారంతా తమ రాష్ర్టంలో తెలుగు విద్యార్థులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ‘హైదరాబాద్ ఎంతో మంచి నగరం. ఇక్కడి వాళ్లు మమ్మల్ని ఆప్యాయంగా పలుకరిస్తారు. మేం ఇతర రాష్ట్రంలో ఉంటున్నామనే భావన ఏమాత్రం కలుగదు. ఎంతోమంది తెలుగు మిత్రులను ఇక్కడ సంపాదించుకున్నామ’ని వారు తెలిపారు.తెలుగు విద్యార్థులపై అక్కడి సీనియర్లు చేసిన దాడిపై ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోనే దాదాపు 200 మంది మణిపూర్ రాష్ట్ర విద్యార్థులు వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. మణిపూర్ ‘నిట్’ ఘటనపై కొంతమంది విద్యార్థుల అభిప్రాయాలను ‘సాక్షి’ తెలుసుకుంది.
వారేమంటున్నారంటే...
నాకు తెలుగు స్నేహితులే ఎక్కువ
హెచ్‌సీయూలో 2012 నుంచి చదువుకుంటున్నాను. అందరం కలిసిమెలిసి ఉంటున్నాం. మా మధ్య ఎలాంటి అభిప్రాయ బేధాలు లేవు. నాకు ఎక్కువ మంది స్నేహితులు తెలుగు విద్యార్థులే. తెలుగు వారు ఎంతో ఆప్యాయంగా పలుకరిస్తారు. మణిపురిల తరువాత నా ఓటు తెలుగు వారికే. అక్కడ జరిగిన దాడి, విద్యా సంస్థల్లో మణిపురిల సంక్షేమంపై త్వరలో ఉపన్యాస కార్యక్రమం నిర్వహించాలని మా రాష్ట్ర విద్యార్థులం అనుకుంటున్నాం.
- ఆర్‌డీ కిమో, ఎంఏ (సోషియాలజీ)
ఫిర్యాదు చేస్తాం
తెలుగు విద్యార్థులపై జరిగిన దాడిపై మణిపూర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విద్యా సంస్థల్లో మణిపూర్ విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ ఘటన వల్ల మా రాష్ట్ర విద్యార్థులపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఇలాంటివి జరగడం ఏ మాత్రం మంచిది కాదు. దాడులు పునరావృతం కాకుండా అక్కడి ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓక్రమ్ ఇబోబీ సింగ్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేస్తాం.
- డుటో కె.తేరి, ఎంఏ, హెచ్‌సీయూ
కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు
ఏ రాష్ట్రంలోనైనా అక్కడక్కడాఇలాంటి దుర్ఘటనలు జరుగుతుంటాయి. ఎక్కడైనా ఆకతాయిలు ఉంటారు. కొంతమంది మణిపూర్ విద్యార్థులు చేసిన దాడి వల్ల అందరికీ చెడ్డపేరు వచ్చే ప్రమాదం ఉంది. విజ్ఞానవంతులుగా వ్యవహరించాలే తప్ప రౌడీల్లా కాదు.
- జూలియట్ ఫనాయి, ఎకనామిక్స్ (పీహెచ్‌డీ)
పరిస్థితిని మెరుగుపరచాలి
మణిపూర్ విద్యార్థులు, తెలుగు వారి మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పరిస్థితిని మెరుగుపరచాలి. హెచ్‌సీయూలో నా స్నేహితుడు కూడా తెలుగు విద్యార్థే. అతడు నాకు తెలుగు నేర్పిస్తున్నాడు. మా రాష్ట్ర విద్యార్థులు సైతం పలుచోట్ల అవమానాలకు గురవుతున్నారు. అన్ని రాష్ట్రాల్లో మణిపురిలకు రక్షణ కల్పించాలి.
- సారీ లూయికాం, ఎంఏ సోషియాలజీ