టీడీపీ Vs బీజేపీ
ఏలూరు సిటీ :నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) జిల్లాకు మంజూరుకావడం ఆనందదాయకమే అయినా అది ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలకు కారణమైంది. ప్రతిష్టాత్మక విద్యాసంస్థ నిట్‌ను జిల్లాకు తీసుకురావటంలో ఐక్యంగా పనిచేయాల్సిన మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీ నాయకుల మధ్య ఇప్పుడు అగాధం ఏర్పడింది. పైకి తమ మధ్య ఏవిధమైన విభేదాలు లేవని చెబుతున్నా లోలోన ఆధిపత్య పోరు జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధులు ఎవరికి వారు తమ ప్రాంతంలోనే నిట్‌ను ఏర్పాటు చేయాలని గట్టిగా ప్రయత్నించడంతో అది విభేదాల స్థాయికి చేరుకుంది. నర్మగర్భంగానైనా మాటల తూటాలు వదులుకునేలా పరిస్థితి మారిపోయింది. నేటికీ నిట్ ఎక్కడ పెట్టాలనే దానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయానికి రాలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
టీడీపీ వర్సెస్ బీజేపీ
జాతీయ స్థాయి విద్యా సంస్థ నిట్ ఏర్పాటు విషయంలో మొదట్లోనే జిల్లా ప్రజాప్రతినిధుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. నిట్ జాతీయ బృందం పరిశీలన సమయంలోనే టీడీపీ, బీజేపీ నేతలు వాగ్వివాదానికి దిగారు. ఏలూరు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో తాత్కాలిక తరగతులు, వట్లూరులో నిట్ శాశ్వత భవనాల నిర్మాణం జరగాలని ఏలూరు ఎంపీ మాగంటి బాబు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, ఎమ్మెల్యే బడేటి బుజ్జి ప్రయత్నాలు చేస్తే. మరోవైపు బీజేపీ మంత్రి మాణిక్యాలరావు,నరసాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పారు. జూన్ 8న ఏలూరులోనే నిట్ అంటూ కేంద్ర మానవ వనరుల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తమ కృషితోనే నిట్ ఏలూరుకు వచ్చిందని ఎంపీ మాగంటి బాబు ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పేశారు. దీనిపై తీవ్రస్థాయిలో స్పందించిన మంత్రి మాణిక్యాలరావు నిట్ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేయకుంటే మంత్రి పదవే వద్దంటూ అలకపూని మరీ తాడేపల్లిగూడేనికే నిట్ వచ్చేలా పట్టుబట్టారని తెలుస్తోంది.
ఏలూరు వర్సెస్ టీపీజీ : నిట్ ఏర్పాటు చేసే క్రమంలో అనుకూల విషయాలను పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందం సైతం ఏలూరులో ఏర్పాటు చేసేందుకే మొగ్గు చూపించినట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. తాత్కాలిక తరగతులు సీఆర్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజీలోనూ, వట్లూరులోని పెదచెరువు ప్రాంతంలోని 350ఎకరాలను కేటాయిస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చిందని ప్రచారం చేశారు కూడా. 35 కిలోమీటర్ల దూరంలో గన్నవరం విమానాశ్రయం, నిట్ ప్రాంతానికి పక్కనే జాతీయ రహదారి, ఏలూరు నగరం ఉండడం సానుకూల అంశాలుగా వారు చెప్పారు. ఇక తాడేపల్లిగూడెంలో అటవీ భూమిల్లోగానీ, విమానాశ్రయ భూముల్లో గానీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారని బీజేపీ నేతలు ప్రచారం చేశారు. తాత్కాలిక తరగతులు వాసవీ ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. శుక్రవారం కూడా నిట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా అధికారులతో సమీక్షించి వివరాలు సేకరించారు. చివరికి ప్రతిష్టాత్మక నిట్.. ఎవరి ప్రతిష్టను పెంచుతుందో వేచి చూడాల్సిందే.