నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు కోసం నన్నూరు సమీపంలో భూమిని గురువారం కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబులు పరిశీలించారు.
నన్నూరు(ఓర్వకల్లు): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటు కోసం నన్నూరు సమీపంలో భూమిని గురువారం కలెక్టర్ విజయమోహన్, జేసీ కన్నబాబులు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల ఏర్పాటు కోసం అనుకూలమైన భూమిని సేకరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు.
కొన్ని అనివార్య కారణాలతో స్థల సేకరణలో జాప్యం జరిగిందన్నారు. నెల రోజుల క్రితం నందికొట్కూరు నియోజకవర్గంలోని జూపాడుబంగ్లా వద్ద స్థల పరిశీలన చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. అలాగే కర్నూలు నగర శివారులోని జగన్నాథ గట్టు వద్ద గల 150 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించామన్నారు. ఒకే చోట 300 ఎకరాలు కావాలని, జాతీయ రహదారి అందుబాటులో ఉండాలని తాజాగా ప్రభుత్వం సూచించిందన్నారు.
దీంతో నన్నూరు-పూడిచెర్ల మధ్య గల 1338, 386 సర్వే నంబర్లలో గల ప్రభుత్వ భూమి అనుకూలమైనదిగా భావించామన్నారు. గడెం తిప్పపైగల ఈ భూముల వివరాలను 48 గంటల్లో పంపాలని సర్వే అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్‌డీఓ రఘుబాబు, ఇన్‌చార్జి తహశీల్దార్ శ్రీనాథ్, సర్వేయర్లు మల్లికార్జున, సుబ్బారెడ్డి, వీఆర్‌ఓ మౌలిబాషా ఉన్నారు.