ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న నైట్ షెల్టర్ల బయట ఆహారం కోసం ఎదురు చూస్తున్న దినసరి కూలీలు, నిరాశ్రయులు.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇచ్చిన మూడు వారాల దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటన కొన్నిచోట్ల ప్రజలు కిరాణా కొట్ల ముందు బారులు తీరేలా చేసింది. దేశం మొత్తమ్మీద కోవిడ్ బాధితుల సంఖ్య బుధవారానికి 612 దాటిపోగా, పది మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 40 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మహారాష్ట్రలో మరో వ్యక్తి కోవిడ్‌కు బలికాగా, తమిళనాడులో బుధవారం తొలి కరోనా మరణం నమోదైంది. మంగళవారం ఢిల్లీలో ఒక వ్యక్తి ఇతర కారణాల వల్ల మరణించినా కోవిడ్ మరణాల జాబితాలో చేర్చారు. తాజాగా ఈ తప్పును సవరించడంతో మొత్తం మరణాల సంఖ్య పది అయ్యింది. లాక్‌డౌన్ సమయంలో నిత్యావసరాల కొరత లేకుండా చూసేందుకు కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆహార శాఖ మంత్రి రాం విలాస్ పాశ్వాన్ స్పష్టం చేయగా.. మందులు, నిత్యావసరాలను అమ్మే దుకాణాలు లాక్‌డౌన్ సమయంలోనూ తెరిచే ఉంటాయని మంత్రి జవడేకర్ తెలిపారు.
మిలటరీ ఆసుపత్రులు సిద్ధం
ఆర్మీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీతోపాటు కేంద్ర పారామిలటరీ దళాలకు చెందిన 32 ఆసుపత్రులను కోవిడ్ చికిత్స కోసం కేంద్రం సిద్ధంచేస్తోంది. వీటిద్వారా సుమారు 2000 వరకూ పడకలు అందుబాటులోకి రానుండగా హిమాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన రెండు వేల గదులను ఐసోలేషన్ కేంద్రంగా మార్చేందుకు హమీర్‌పూర్ జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆసుపత్రులు గ్రేటర్ నోయిడా, హైదరాబాద్, గువాహటి, జమ్మూ, గ్వాలియర్‌లోని టేకన్‌పూర్, డిమాపూర్, ఇంఫాల్, నాగ్‌పూర్, సిల్చార్, భోపాల్, అవడి, జోధ్‌పూర్, కోల్‌కతా, పుణె, బెంగళూరులతోపాటు కొన్ని ఇతర ప్రాంతాల్లో ఉన్నాయి. కోల్‌కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇతర రోగాలతో వచ్చే రోగులను చేర్చుకోవడాన్ని నిలిపివేయగా పరిస్థితి చక్కబడ్డ వారిని డిశ్చార్జ్ చేస్తూ ఐసోలేషన్ కేంద్రం కోసం వీలైనన్ని పడకలను అందుబాటులోకి తెస్తున్నారు.
మందులు నిత్యావసర దుకాణాలు తెరిచే ఉంటాయి : జవదేకర్
మూడు వారాల లాక్‌డౌన్ సమయంలోనూ దేశం మొత్తమ్మీద నిత్యావసర, మందుల దుకాణాలు తెరిచే ఉంటాయని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదని, బ్లాక్‌మార్కెటింగ్ చేసేవారిపై, అక్రమంగా నిల్వ చేసే వారిని కట్టడి చేసేందుకు తగిన చట్టాలు ఉన్నాయని అన్నారు. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు వివరించారు. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా, ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిర్వహించేందుకు కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. హౌసింగ్ సొసైటీలు కొన్ని వైద్యులను, జర్నలిస్టులను ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా చెప్పడం ఏమాత్రం సరికాదని మంత్రి స్పష్టం చేశారు. సమాజం పరిస్థితులను అర్థం చేసుకోవాలని అన్నారు.
స్వస్థత చేకూరిన వారికి స్వాగతం
పుణేలో బుధవారం ఒక హృద్యమైన సంఘటన చోటు చేసుకుంది. కోవిడ్ బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తరువాత స్వస్థత చేకూరిన దంపతులను వారు నివాసముండే హౌసింగ్ సొసైటీ సాదరంగా స్వాగతం పలికింది. సిన్హ్‌గఢ్ రోడ్డులో ఉండే ఈ సొసైటీలోని కుటుంబాలన్నీ బాల్కనీల్లో నుంచుని చప్పట్లతో ప్లేట్లతో శబ్దాలు చేస్తూ 51 ఏళ్ల పురుషుడు, 43 ఏళ్ల మహిళకు స్వాగతం పలికారు.
కోవిడ్ పరిస్థితి స్థూలంగా..
దేశం మొత్తమ్మీద బుధవారం ఉదయం నాటికి మొత్తం 612 కోవిడ్ కేసులు ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 109 కేసులు ఉండగా ఇందులో ఎనిమిది మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో ముగ్గురు విదేశీయులు సహా 116 కేసులు ఉన్నాయి. కర్ణాటకలో 41 మంది కోవిడ్ బాధితులు ఉంటే. తెలంగాణలో ఈ సంఖ్య 35 (10 మంది విదేశీయులు)గా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో 35 మంది కరోనా బారిన పడ్డారు. ఢిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 31 కాగా. తమిళనాడులో 18, బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిది మంది చొప్పున కోవిడ్ బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment