సమీక్షా సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రమాదఘంటికలు మోగిస్తూ ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా కోవిడ్–19 పరిస్థితి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించారు. కరోనాని తరిమికొట్టడానికి అయిదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. ఇప్పటివరకు కరోనా కట్టడిలో అత్యంత ముఖ్యంగా భావిస్తున్న టెస్ట్, ట్రేస్, ట్రీట్ విధానంతో పాటు ప్రజలందరూ కరోనా నిబంధనల్ని కచ్చితంగా పాటించడం, అంకితభావంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడం, ఈ అయిదు సూత్రాలతోనే కరోనా కొమ్ములు వంచగలమని ప్రధాని అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రిన్స్‌పల్ సెక్రటరీ, కేబినెట్ సెక్రటరీ, హోం, ఆరోగ్య శాఖ కార్యదర్శులతో పాటు నీతిఅయోగ్ సభ్యులు పాల్గొన్నారు.
కరోనా కేసులు పెరిగిపోతూ ఉండడానికి ప్రజలు నిబంధనలు పాటించడంలో నిర్లక్ష్యం వహించడమే కారణమని ఆ సమావేశం అభిప్రాయపడింది. ప్రజలు మాస్కులు పెట్టుకోకపోవడం, భౌతిక దూరాన్ని పాటించకపోవడంతో మహమ్మారి మళ్లీ విజృంభిస్తోందని, క్షేత్రస్థాయిలో కంటైన్‌మెంట్ జోన్లు ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తి అరికట్టడంపై అధికారులు దృష్టి పెట్టకపోవడం కూడా కారణమేనని నిర్ణయానికొచ్చింది. అందుకే జిల్లా స్థాయిలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట జోన్లు ఏర్పాటు చేసి కరోనా నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని ప్రధాని ఆదేశించినట్టుగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక ప్రకటన పేర్కొంది. దేశంలోని ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకి అవసరమయ్యే పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర చికిత్స సదుపాయాలపై కూడా ప్రధాని సమీక్షించినట్టుగా ఆ ప్రకటన వెల్లడించింది.
మహారాష్ట, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌కు కేంద్ర బృందాలు
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 91శాతానికి పైగా కేసులు, మరణాలు 10 రాష్ట్రాల నుంచి వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రధానికి అధికారులు అన్ని వివరాలతో కూడిన ఒక ప్రెజెంటేషన్ సమర్పించారు. మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లలో కరోనా విధ్వంసం సృష్టిస్తోంది. గత 14 రోజుల్లో 57% కేసులు ఈ రాష్ట్రాల నుంచే నమోదవగా, 47% మరణాలు సంభవించాయి. ఇక దేశవ్యాప్తంగా కేసుల్లో 4.5%, మరణాల్లో 16.3% పంజాబ్ రాష్ట్రం నుంచే రావడం ఆందోళన పుట్టిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో 4.3% కేసులు, 7శాతానికి పైగా మరణాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రతో పాటుగా కేసుల కంటే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్న పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లకు కేంద్ర బృందాలు వెళ్లి పరిస్థితుల్ని సమీక్షించాలని ప్రధాని ఆదేశించారు.
కరోనా నిబంధనలపై అవగాహన
కోవిడ్–19 నిబంధనల్ని పాటించడంలో ప్రజలకి అవగాహన పెంచడానికి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పూర్తి స్థాయిలో మాస్కుల వాడకం, వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ ప్రదేశాల్లో , పని ప్రాంతాల్లో శానిటైజ్ చేయడం తప్పనిసరి. వీటిపై ఏప్రిల్ 6 నుంచి 14 వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.
వ్యాక్సినే ఆన్సర్
ఇక కరోనా పూర్తిగా నిర్వీర్యం కావాలంటే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వడమే ఏకైక మార్గమని ప్రధాని చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చెయ్యడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. ఇక టీకా తయారీ కంపెనీలు ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకోవాలని సూచించారు. దేశీయ అవసరాలు తీరుస్తూనే ఇతర దేశాలకు టీకాలను పంపాలని ప్రధానమంత్రి అధికారుల్ని ఆదేశించారు. దేశంలో ఇప్పటివరకు 7.59 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. ఇందులో 43% మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్‌లోనే ఇచ్చారు.
ఒకే రోజు 93,249 కేసులు
దేశంలో కరోనా ఉధృతి రోజు రోజుకి ఎక్కువవుతోంది. కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయి బెంబేలెత్తిస్తోంది. గత 24 గంటల్లో 93,249 కేసులు నమోదైనట్టుగా ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరుకుంది. మరోవైపు కరోనా మరణాలు 513 సంభవించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,64,623కి చేరుకుంది. 25 రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపిస్తోంది. 6,91,597 మందికి ప్రస్తుతం కరోనాతో చికిత్స పొందుతున్నారు. మొత్తం కేసుల్లో ఇది 5.54శాతంగా ఉంది.
సెప్టెంబర్ మాదిరిగా..
గత ఏడాది సెప్టెంబర్‌లో కరోనా కరాళ నృత్యం చేసింది. రోజు రోజుకీ కేసులు పెరిగిపోయి ఆందోళన నింపాయి. తొలిసారిగా గత ఏడాది సెప్టెంబర్ 5న రోజువారీ కేసుల్లో 90 వేల మార్క్‌ని దాటాము. సెప్టెంబర్ 5న 90,632 కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 10న 97,735 కేసులు నమోదు కావడంతో రోజుకి లక్ష కేసులు వెలుగులోకి వస్తాయని అంచనా వేశారు. సెప్టెంబర్ 16న 97,894 కేసులు నమోదయ్యాయి. కానీ ఆ మర్నాడు 96,424 కేసులు వచ్చాయి. అప్పట్నుంచి కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. అక్టోబర్ చివరి నాటికి రోజువారీ కేసుల సంఖ్య 40వేలకి తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల గత ఏడాది సెప్టెంబర్‌ని గుర్తుకు తెచ్చేలా కేసుల్లో బీభత్సమైన పెరుగుదల కనిపిస్తోంది. మరొక వారం రోజుల్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment