సాక్షి ప్రతినిధి, అనంతపురం : ప్రకృతి ప్రకోపం.. సర్కారు నిర్లక్ష్యం వెరసి ‘అనంత’ ప్రగతి ఎండమావిగా మారింది. వర్షాభావంతో సేద్యం సంక్షోభంలో కూరుకుపోవడంతో రైతన్నలు ఆత్మహత్యల బాట పడితే.. ఉపాధి లేక విద్యావంతులు, కూలీలు వలస బాట పట్టారు. సేద్యాన్ని గాడిలో పెట్టేందుకు రూ.7,676 కోట్లతో ప్రకటించిన ‘ప్రాజెక్టు అనంత’ నిధుల్లేక నీరసించింది. పారిశ్రామిక ప్రగతితోనే ఉపాధి సాధ్యమవుతుందని భావించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో రూ.17 వేల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఆమోదం తెలిపాయి.
కానీ.. ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. దుర్భిక్ష ‘అనంత’లో కరువును ఎదుర్కోవడానికి చదువు ఒక్కటే మార్గమని భావించిన కేంద్రం.. జిల్లాలో ఐఐఎస్సీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెన్సైస్), ఎన్‌ఐటీ(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. కానీ.. అవి నేటికీ ఏర్పాటు కాలేదు. సోమవారం జిల్లాలో పర్యటించనున్న దేశాధినేత పర్యటనపై ‘అనంత’ ప్రజానీకం గంపెడు ఆశలు పెట్టుకుంది. కాగితాలకే పరిమితమైన అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చర్యలు తీసుకుంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకు మంజూరై.. అమలుకు నోచుకోని ప్రాజెక్టులను ఒక్కసారి పరిశీలిస్తే.. వర్షాభావంతో గాడితప్పిన సేద్యాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం నియమించిన అయ్యప్పన్ కమిటీ రూ.7,676 వ్యయంతో ‘ప్రాజెక్టు అనంత’ను ప్రతిపాదించింది.
ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన నిధుల్లో రూ.4,387 కోట్లు వ్యవసాయ, ఉద్యాన, సూక్ష్మనీటిపారుదల, పశుసంవర్ధక, పట్టు, మత్స్యశాఖలకు శాఖాపరంగా ఐదేళ్లలో మంజూరవుతాయని అధికారులు లెక్కకట్టారు. తక్కిన రూ.3,282 కోట్లను కేంద్రం నుంచి విడుదల చేసేందుకు ప్రణాళిక సంఘం ససేమిరా అంటోంది. రాష్ట్రపతి జోక్యం చేసుకుంటే ప్రణాళిక సంఘం నిధుల విడుదలకు అంగీకరిస్తుంది. అప్పుడే ‘ప్రాజెక్టు అనంత’ కార్యరూపం దాల్చడానికి మార్గం సుగమం అవుతంది.
పారిశ్రామిక ప్రగతి ఏదీ..?
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలో ఉండటం.. ఉపరితల రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉండటం.. తక్కువ ధరకే విస్తారంగా భూములు లభిస్తుండటం.. మానవ వనరులు భారీ ఎత్తున అందుబాటులో ఉండటంతో పరిశ్రమలు స్థాపించడానికి అత్యంత అనుకూలంగా ఉంది. ఈ నేపథ్యంలోనే హిందూపురానికి సమీపంలో బీడీఎల్(భారత్ దైనిక్స్ లిమిటెడ్) రూ.706 కోట్ల వ్యయంతో క్షిపణి(మిసై ్సల్) తయారీ కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. క్షిపణి తయారీ కేంద్రం ఏర్పాటు కోసం బీడీఎల్‌కు ప్రభుత్వం 653 ఎకరాలను కేటాయించింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) సంస్థ రూ.4 వేల కోట్ల వ్యయంతో హెలీకాఫ్టర్ విడి భాగాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు ప్రభుత్వం 515 ఎకరాలను కేటాయించింది.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) సంస్థ రూ.950 కోట్ల వ్యయంతో రాడార్ ఆధారంగా ప్రయోగించే క్షిపణుల తయారీ పరిశ్రమను ఏర్పాటుకు అంగీకరించింది. బీఈఎల్ సంస్థకు 957 ఎకరాల భూమిని కేటాయించారు. ఈసీఐఎల్(ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్) సంస్థ రూ.875 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటుచేయడానికి ముందుకొచ్చింది. ఈ సంస్థకు ప్రభుత్వం రెండు వేల ఎకరాల భూమిని కేటాయించింది. హిందూపురం సమీపంలో జెమ్-వీఐసీ-ఎల్‌కేహెచ్(జాయింట్ వెంచర్) సంస్థ రూ.11 వేల కోట్ల పెట్టుబడితో హైటెక్ ఎలక్ట్రానిక్ సిటీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఈ పరిశ్రమలన్నీ ఏర్పాటైతే ప్రత్యక్షంగా మూడు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేశారు. కానీ.. కేటాయించిన భూములను ప్రభుత్వం అప్పగించకపోవడంతో ఆ పరిశ్రమలు ఏవీ ఏర్పాటు కాలేదు. రాయదుర్గం సమీపంలో కుద్రేముఖ్ సంస్థ ఏర్పాటుచేస్తామని చెప్పిన ఇనుప పిల్లెల్ల పరిశ్రమదీ అదే వ్యథ. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జోక్యం చేసుకుంటే ఈ పరిశ్రమలన్నీ ఏర్పాటయ్యేందుకు అవకాశం ఉంది. అప్పుడు ఉపాధికి కొదువ ఉండదు.
విద్యా సంస్థలు కన్పించవే..
పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దితే కరువును ఎదుర్కోవచ్చునని ప్రణాళిక సంఘం అనేక సందర్భాల్లో పేర్కొంది. కరువు ప్రాంతమైన మన జిల్లాలో హిందూపురం సమీపంలో ఐఐఎస్‌సీ రెండో క్యాంపస్‌ను ఏర్పాటు చేసేందుకు 2010లో అప్పటి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి కపిల్ సిబాల్ అంగీకరించారు. మూడేళ్లు గడిచిపోయాయి.
కానీ.. ఐఐఎస్‌సీ ఏర్పాటు కాలేదు. ఆ క్యాంపస్‌ను ఇప్పటికే కర్ణాటకలో ఏర్పాటు చేస్తున్నామని ఐఐఎస్‌సీ చెబుతోంది. ఈ నేపథ్యంలో మరో క్యాంపస్‌నైనా జిల్లాలో ఏర్పాటుచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అనంతపురంలోని జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాన్ని ఎన్‌ఐటీ క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు కేంద్ర మానవ వనరుల శాఖ ప్రతిపాదనలు కోరింది. కానీ.. కేంద్ర నిఘా వర్గాలు ఆదిలోనే మోకాలడ్డడంతో ఎన్‌ఐటీ అందినట్లే అంది చేజారిపోయింది. రాష్ట్రపతి ప్రణబ్ జోక్యం చేసుకుంటే.. ఐఐఎస్సీ, ఎన్‌ఐటీ జిల్లాలో ఏర్పాటవుతాయి.
అనంత దశ మారేనా?
Published Mon, Dec 23 2013 1:39 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement