నిట్ ఏర్పాటుకు త్వరలో జీవో
దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు
తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) ఏర్పాటుకు సంబంధించి నాలుగు రోజుల్లో జీవో విడుదలయ్యే అవకాశం ఉందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు గురువారం విలేకరులకు తెలిపారు. నిట్ ఏర్పాటుకు 172 ఎకరాల స్థలం అవసరం కాగలదని, తాజాగా ఇక్కడ పర్యటనకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు కోరారన్నారు. ఆ మేరకు 172 ఎకరాల భూమి వివరాలను కేంద్రానికి పంపించామన్నారు. రైతుల వద్ద నుంచి భూమి తీసుకోకుండానే ప్రభుత్వ భూమిలో నిట్ ఏర్పాటవుతుందన్నారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నిట్ కావడంతో దీనికి సంబంధించి కేంద్ర కేబినెట్ జీవో విడుదల చేయాల్సి ఉందన్నారు. వచ్చే బుధవారం జీవో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. నిట్‌కు సంబంధించి డాక్యుమెంటేషన్, ఫీజులు తదితర వ్యవహారాలన్నీ వరంగల్ నిట్ ద్వారా ప్రస్తుతం జరుగుతాయన్నారు. నిట్ తాత్కాలిక తరగతులు వాసవిలో సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతాయని, వసతిని వాసవి ఇంజినీరింగ్ కళాశాల పూర్తిగా ఉచితంగా ఇచ్చిందని చెప్పారు.
అది అవగాహన లేని అభిప్రాయం
గోదావరి పుష్కరాల్లో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రభుత్వం తనకు ప్రాధాన్యతనివ్వలేదన్న విషయం వాస్తవం కాదని, కొందరు అవగాహన లేకుండా అలా అభిప్రాయపడ్డారని మంత్రి అన్నారు. పుష్కరాలు సంతృప్తికరంగా సాగాయన్నారు. పుష్కరాల సమయంలో జరిగిన మూడు ఘటనల వెనుక కుట్ర దాగి ఉందని, దీనిపై దర్యాప్తు చురుగ్గా సాగుతుందన్నారు. పుష్కరాల సమయంలో ఒక పొగబాంబు పేలిందని, దీని తర్వాత రాజమండ్రిలో తొక్కిసలాట జరగడం, రాజమండ్రిలోనే అగ్నిప్రమాదం జరిగి సెకన్ల వ్యవధిలో మంటలు చెలరేగడం వంటి సంఘటనలు వెనుక కుట్ర దాగి ఉందని ఆయన అన్నారు.
పార్టీ పటిష్టానికి చర్యలు తీసుకుంటున్నామని, సిద్ధాంతాలకు ఆకర్షితులైన వారు పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులతో పాటు రైల్వే అభివృద్ధి పనులపై దృష్టి సారించామన్నారు. గూడెం రైల్వేస్టేషన్‌లో 1వ నెంబరు ప్లాట్‌ఫారంపై ఉన్న ఎఫ్‌సీఐ గోదాములను తొలగించి ప్లాట్‌ఫారం విస్తరించడం, ప్రస్తుతం ఉన్న గూడ్స్‌షెడ్‌ను నవాబ్‌పాలెం తరలించి, ఆ ప్రాంతంలో నాల్గవ నెంబరు ప్లాట్‌ఫారం, టిక్కెట్ కౌంటర్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించామని మంత్రి చెప్పారు. నియామకాలపై బ్యాన్ తొలగగానే వివిధ కార్యాలయాల్లో సిబ్బందిని నియమించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.