జాతీయస్థాయికి వరంగల్ నిట్ విద్యార్థులు
24గంటల్లో నూతన పరిశోధనలు
కాజీపేట అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. నిట్‌లో బెంగళూరుకు చెందిన ఇంక్ కంపెనీ ‘ఇంక్ మేకర్’పేరిట నిర్వహించిన మేక్ ఏ థాన్ ఆదివారం ముగిసింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమైన పరిశోధనలకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిశాయి. నిట్‌కు చెందిన 300 విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని 24 గంటల్లో తమ ఆలోచనలకు కార్యరూపం కల్పించారు.
ఈ మేరకు విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికతో పాటు రూ.20లక్షల ప్రోత్సాహకాన్ని అందుకునేందుకు శ్రమించారు. ఇందులో నుంచి ఇంక్ కంపెనీ ప్రతినిధులు అమిత్, నిశ్చయ్‌లు ఎనిమిది టీంలను ఎంపిక చేశారు. ప్రపంచంలోని ఐదు ప్రముఖ కళాశాలల విద్యార్థులతో వరంగల్ నిట్ విద్యార్థులు జాతీయ స్థాయిలో పోటీ పడనున్నారు.