మణిపూర్‌లో మా బిడ్డలకు భద్రతలేదు
‘నిట్’లోని తెలుగు విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
మరోచోట సీటు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో తెలుగు విద్యార్థులకు భద్రత లేదంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ బిడ్డలను అక్కడినుంచి బయటకు తీసుకురావడంతోపాటు మరో నిట్‌లో సీటు ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఉన్న నిట్‌కు సంబంధించిన టక్యాల్‌పట్, లాంగోల్ క్యాంపస్‌లలో చదువుతున్నారు. లాంగోల్‌లో ఉన్న దాదాపు 20 మంది తెలుగు విద్యార్థులపై మూడు రోజులపాటు వరుసదాడులు జరిగిన సంగతి తెలిసిందే.
తమ పిల్లల భద్రతపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లోని నిట్‌లో విద్యనభ్యసిస్తున్న మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాలకు చెందిన బీటెక్ విద్యార్థులు రవితేజ యాదవ్, సాయిచరణ్‌ల తండ్రులు లక్ష్మీనారాయణ యాదవ్, శ్రీనివాస్ సోమవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తమ పిల్లలకు మణిపూర్‌లో భద్రత లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికులు చేసిన వరుసదాడుల్ని పరిగణనలోకి తీసుకుంటూ ఇక్కడి ప్రభుత్వం బాధ్యత తీసుకుని తమ పిల్లల్ని మణిపూర్ నిట్ నుంచి బయటకు తీసుకురావడంతోపాటు మరో నిట్‌లో సీట్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు.
బాసటగా నిలిచిన ఏబీవీపీ
మరోవైపు మణిపూర్ నిట్‌లోని తెలుగు విద్యార్థులకు అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) అండగా నిలిచింది. సంస్థకు చెందిన పలువురు నాయకులు సోమవారం స్వయంగా నిట్ క్యాంపస్‌లకు చేరుకుని తెలుగు విద్యార్థులకు ధైర్యం చెప్తూ మేమున్నామనే భరోసా ఇచ్చారు.