
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇతర కేంద్ర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కనీస అర్హతగా ఉన్న 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలన్న ప్రధాన నిబంధనను తొలగించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు బోర్డులు పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది.
‘జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులు క్లాస్ 12 బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది’ అని హెచ్చార్డీ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిట్ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటివరకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కావడంతో పాటు, 12వ తరగతి బోర్డ్ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సాధించాల్సి ఉండేది. ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడిన ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment