human resource development ministry
-
అక్టోబర్ 6 నుంచి షురూ..
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ఉమ్మడి ప్రవేశాలను వచ్చే నెల 6 నుంచి చేపట్టి నవంబర్ 9వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఆర్డీ) నిర్ణయిం చింది. ఈ మేరకు పూర్తి స్థాయి షెడ్యూల్ ఖరారుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రవేశాల ప్రారంభ, ముగింపు తేదీలను కూడా తాత్కాలికంగా ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్ ఈనెల 6తో ముగియనుండగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈనెల 27న ఆన్ లైన్లో నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూ ల్ను ఖరారు చేసింది. దీనికి అనుగుణం గానే ఫలితాలను విడుదల చేసి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఉమ్మడి ప్రవే శాల ప్రక్రియను ప్రారంభిస్తారని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వచ్చేనెల 6న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్లో స్పష్టం చేసింది. మొత్తా నికి ఈసారి కూడా 7 విడతల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది. 12 నుంచి ‘అడ్వాన్స్డ్’ రిజిస్ట్రేషన్లు.. జేఈఈ మెయిన్ ఫలితాలను ఈనెల 11లోగా విడుదల చేసేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కసరత్తు చేస్తోంది. గత జనవరి జేఈఈ మెయిన్, ప్రస్తుత మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వారంతా ఈనెల 12 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చని, 18న సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్లైన్ పరీక్ష 27న ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు పేపరు–1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపరు2– పరీక్ష ఉంటుందని వెల్లడించింది. కాగా, విదేశాల్లో 12వ తరగతి చదువుకున్న, చదువుతున్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈనెల 5నుంచే దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ ఐఐటీ తెలిపింది. రాష్ట్రంలో 15 కేంద్రాల్లో పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను రాష్ట్రంలోని 15 పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిర్వహించేందుకు ఢిల్లీ ఐఐటీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్ధిపేట్, సూర్యాపేట, వరంగల్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5న విడుదల చేస్తామని పేర్కొంది. వచ్చే నెల 8న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూట్ టెస్టును (ఏఏటీ) నిర్వహిస్తామని, 11న వాటి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ వచ్చే నెల 6న ప్రారంభమై నవంబర్ 9తో ముగుస్తుందని వివరించింది. -
‘నిట్’ ప్రవేశాలకు 75% మార్కులు అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్), ఇతర కేంద్ర టెక్నికల్ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన అర్హత నిబంధనల్లో కొంత వెసులుబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆయా విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కనీస అర్హతగా ఉన్న 12వ తరగతి బోర్డు పరీక్షలో కనీసం 75% మార్కులు పొంది ఉండాలన్న ప్రధాన నిబంధనను తొలగించింది. కరోనా మహమ్మారి కారణంగా పలు బోర్డులు పరీక్షలను పాక్షికంగా రద్దు చేసిన నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గురువారం ఈ నిర్ణయం తీసుకుంది. ‘జేఈఈ మెయిన్స్ 2020లో అర్హత సాధించిన విద్యార్థులు క్లాస్ 12 బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది’ అని హెచ్చార్డీ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ ట్వీట్ చేశారు. ఈ మేరకు సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నిట్ తదితర ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేందుకు ఇప్పటివరకు విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ఉత్తీర్ణులు కావడంతో పాటు, 12వ తరగతి బోర్డ్ పరీక్షలో కనీసం 75% మార్కులు కానీ, అర్హత పరీక్షలో టాప్ 20 పర్సంటైల్ ర్యాంక్ కానీ సాధించాల్సి ఉండేది. ఇప్పటివరకు రెండు సార్లు వాయిదా పడిన ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఆన్లైన్ ఈ ‘లైన్’లో
సాక్షి, హైదరాబాద్ : ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్ బోధన రెండు సెషన్లు చాలని, ప్రీప్రైమరీ తరగతులకు రోజుకు అరగంట బోధన సరిపోతుందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలిపింది. కోవిడ్–19 ఆంక్షల నేపథ్యంలో పాఠశాలలు నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి రోజులో నిర్వహించే సెషన్స్ సంఖ్య, వ్యవధి పరిమితంగా ఉండాలని కోరింది. పాఠశాలల యాజమాన్యాలు రెగ్యులర్ తరగతుల మాదిరిగానే ఆన్లైన్ బోధన చేపడుతున్నాయనీ, దీనివల్ల తమ పిల్లలు గంటల తరబడి కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి వస్తోందంటూ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీనిపై స్పందించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్చార్డీ) మంగళవారం ‘ప్రజ్ఞత’ పేరుతో పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. ప్రీప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ తరగతి వ్యవధి రోజులో 30 నిమిషాలకు మించరాదు. ఒకటి నుంచి 8వ తరగతి వరకు 45 నిమిషాల చొప్పున రెండు ఆన్లైన్ సెషన్స్ ఉంటే సరిపోతుంది. 9 నుంచి 12వ తరగతుల వారికైతే 30 నుంచి 45 నిమిషాల చొప్పున నాలుగు సెషన్లలో బోధన జరపవచ్చు. ‘కోవిడ్–19 మహమ్మారితో పాఠశాలల మూసివేత ప్రభావం దేశంలోని సుమారు 24 కోట్ల మంది చిన్నారుల విద్యపై పడింది. ఇది ఇలాగే కొనసాగితే వారి చదువులకు తీవ్రనష్టం కలుగుతుంది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు ఆన్లైన్ ద్వారా నాణ్యమైన విద్య అందించాల్సి ఉంది’అని హెచ్చార్డీ శాఖ మంత్రి రమేశ్ పొఖ్రియాల్ పేర్కొన్నారు. రాష్ట్రాల నుంచి సలహాలు తీసుకొని ఎన్సీఈఆర్డీ రూపొందించిన ఈ మార్గదర్శకాలు కేవలం సలహాపూర్వకమేనని, స్థానిక అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మార్చుకోవచ్చని హెచ్ఆర్డీ తెలిపింది. అనుసరించాల్సిన మార్గదర్శకాలివే..... – డిజిటల్ బోధనకు సంబంధించి ప్రిన్సిపాళ్లు ముందుగా విద్యార్థుల ఇళ్లల్లో టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఇతరత్రా సాంకేతిక పరికరాల సదుపాయాలపై అనధికారిక సర్వే చేయాలి. ఆయా వసతులను బట్టి విద్యార్థులను గ్రూపులుగా విభజించాలి. – డిజిటల్ విద్యను మూడు మాధ్యమాలుగా హెచ్ఆర్డీ విడగొట్టింది. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఉండి... ఇంటర్నెట్ ఉంటే ఆన్లైన్ మోడ్. కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ ఉండి ఇంటర్నెట్ లేకపోతే పాక్షిక ఆన్లైన్ మోడ్. కేవలం టీవీ, రేడియో ఉండి ఇంటర్నెట్ లభ్యత లేకపోతే ఆఫ్‌లైన్ మోడ్‌గా పేర్కొంది. ఈ మూడు కేటగిరీలనూ దృష్టిలో పెట్టుకొని పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని పేర్కొంది. – పాఠశాలల ప్రధానోపాధ్యాయులు టీచర్ల బోధనకు అవసరమైన ల్యాప్‌టాప్‌లు/ ట్యాబ్లెట్స్, ఇంటర్నెట్ కనెక్షన్ వంటి కల్పించాలి. – ఎక్కువ సమయం ఆన్లైన్ బోధన వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక సమయం కూర్చొనే క్రమంలో వెన్నెముకపై, కళ్లపై ప్రభావం పడుతుంది. కాబట్టి దీన్ని నివారించాలి డిజిటల్ బోధన అమలు.. – పూర్వ ప్రాథమిక (ప్రీప్రైవురీ) తరగతులకు సంబంధించి తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ కావాలి. అదీ అరగంటకు మించి ఉండకూడదు. – 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఎన్సీఈఆర్టీ జారీ చేసిన ప్రత్యామ్నాయ అకడమిక్ కేలండర్‌ను అమలు చేయాలి. – ప్రాథమిక తరగతులకు ఆన్లైన్బోధనకు సంబంధించిన నిర్ణయాన్ని రాష్ట్రాలే తీసుకోవాలి. – 9 నుంచి 12వ తరగతి వరకు రోజుకు నాలుగు సెషన్లకు మించి ఉండకూడదు. – రెండు సెషన్లకు మధ్య 10 నుంచి 15 నిమిషాల విరామం విద్యార్థులకు ఇవ్వాలి. దీంతో వారు ఫ్రెష్ అప్ అవుతారు. – ఆన్లైన్ తరగతులు బోధించే క్రమంలో విద్యార్థులు ఇంటరాక్ట్ అయ్యేలా చూడాలి. – విద్యార్థులకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ అభ్యసన సమపాళ్లలో ఉండాలి. విద్యార్థులు దీనిని పాటించేలా చూడాలి. – విషయం 5 బుల్లెట్ పాయింట్లకు మించకూడదు. – గ్రాఫ్‌లు, పటాలు, సాధ్యమైనంతవరకు పట్టికలను నివారించాలి. వలస కార్మికుల పిల్లల పేర్లు తొలగించకండి కోవిడ్–19 కారణంగా సొంతూళ్లకు వెళ్లిపోయిన వలస కార్మికుల పిల్లల పేర్లను పాఠశాలల ఎన్రోల్మెంట్ రోల్స్ నుంచి తొలగించకుండా చూడాలని కేంద్రం కోరింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు హెచ్చార్డీ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఇతర ప్రాంతాలకు, సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయిన పిల్లల వివరాలను సేకరించి ఉంచాలని, వీరిని వలస వెళ్లిన వారు, లేక తాత్కాలికంగా అందుబాటులో లేని వారిగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. వీరు ఎప్పుడైనా తిరిగి వచ్చే అవకాశాలున్నందున ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ప్రతి స్కూలు ప్రత్యేకంగా ఇటువంటి వారి వివరాలు తయారు చేసి, వారి తల్లిదండ్రులు/ సంరక్షకుల ఫోన్ నంబర్లను కూడా తీసుకోవాలని పేర్కొంది. వారు తమ సొంతూళ్లలో ఎంతకాలం ఉన్నారనే విషయం కూడా స్పష్టంగా తెలపాలంది. ఈ మేరకు తయారైన నివేదికను తరగతుల వారీగా విద్యాశాఖ డైరెక్టరేట్‌కు పంపించాలని తెలిపింది. అదేవిధంగా, ఇతర ప్రాంతాలు, లేక రాష్ట్రాల నుంచి సొంతూళ్లకు వచ్చిన చిన్నారులకు పాఠశాలలు విధిగా అడ్మిషన్లు కల్పించాలని కూడా ఆ మార్గదర్శకాల్లో కోరింది. ప్రవేశం కల్పించేందుకు తల్లిదండ్రుల/ సంరక్షకుల గుర్తింపు ధ్రువీకరణ తప్ప, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ వంటివేవీ అడగరాదని స్పష్టం చేసింది. చిన్నారుల సంబంధీకులు ఇచ్చిన సమాచారాన్ని వాస్తమైందిగా భావించి, సమీప ప్రభుత్వ లేదా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలో ప్రవేశం కల్పించాలని తెలిపింది. -
సిలబస్ కుదింపు
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సకాలం లో విద్యా సంవత్సరం ప్రారంభించలేని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నత విద్యలో సిలబస్, పని దినాలను కుదించేందుకు ఎంహెచ్ఆర్డీ చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ప్రజలు, విద్యార్థులు, విద్యావేత్తల భాగస్వామ్యంతోనే సిలబస్ కుదింపు, పని దినాల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికోసం ‘సిలబస్ ఫర్ స్టూడెంట్స్–2020’ పేర అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఎంహెచ్ఆర్డీ ట్విట్టర్ ఖాతాకు లేదా తన ట్విట్టర్ ఖాతాకు అభిప్రాయాలను పంపించాలన్నారు. ఫేస్బుక్ ద్వారా కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు అభిప్రాయాలను పంపించాలని సూచిం చారు. మంత్రి చేపట్టిన ఈ కార్యాచరణకు అనుగుణంగా సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) కసరత్తు ప్రారంభించింది. -
ఫీజుల పెంపుపై పునరాలోచించండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు తమ వార్షిక ఫీజుల పెంపుపై, మూడు నెలలకోసారి ఫీజులు వసూలు చేయడంపై పునరాలోచన చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ శుక్రవారం కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫీజుల పెంపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొన్ని రాష్ట్రాలు పాఠశాల ఫీజుల పెంపుపై ఇప్పటికే కొన్ని సానుకూల చర్యలు చేపట్టాయనీ, ఇతరులు కూడా ఇదే మార్గం అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా పోరాటంలో అన్ని పాఠశాలలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా.. లాక్డౌన్ సమయంలో అనుమతి లేకుండా ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు పెంచరాదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు మళ్లీ తెరుచుకునేంత వరకూ ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఫీజులు చెల్లించాలంటూ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావొద్దని రాజస్తాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఆదేశించాయి. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి: సీబీఎస్ఈ దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉపాధ్యాయుల వేతనాలు, స్కూలు ఫీజుల చెల్లింపులపై అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం కోరింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఫీజుల అంశంపై తగిన పరిష్కారం కనుగొనాలని రాష్ట్రాలను కోరినట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠీ తెలిపారు. -
హెచ్సీయూకు ఎమినెన్స్ హోదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్(ఐవోఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, ఖరగ్‌పూర్ ఐఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గత నెలలో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు. దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు నిధులు అందనున్నాయి. వీటితోపాటు ప్రైవేట్ రంగంలోని తమిళనాడుకు చెందిన అమృత విద్యాపీఠమ్, వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిశాలోని కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఢిల్లీకి చెందిన జామియా హమ్దర్ద్ యూనివర్సిటీ, మొహాలీలోని సత్య భారతి ఫౌండేషన్ భారతి ఇన్స్టిట్యూట్లకు కూడా ఎమినెన్స్ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఆయా సంస్థల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇంకా..నోయిడాలోని శివ్‌నాడార్ వర్సిటీ, సోనెపట్‌లోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలకు ఎమినెన్స్ హోదా ఇవ్వాలని ఎంపిక కమిటీ సిఫారసు చేసిందన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అన్నా వర్సిటీల ఎమినెన్స్ హోదాకు సంబంధించి తమ వంతు నిధులు కేటాయించేందుకు బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అంగీకారం తెలపాల్సి ఉందన్నారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, అజీంప్రేమ్‌జీ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైన వాటిలో ఉన్నాయి. ఎమినెన్స్ హోదా ప్రకటించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోపాటు తమ వంతుగా కనీసం 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుందని మంత్రి నిశాంక్ తెలిపారు. దేశంలో పలు విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన సామర్ధ్యం కలిగినవిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ‘ఇప్పటివరకు 16 సంస్థలకు ఎమినెన్స్ హోదా ఇచ్చాం. మరో నాలుగు సంస్థలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాం’అని నిశాంక్ తెలిపారు. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకైతే ప్రభుత్వ నిధులు అందవు కానీ, మరింత స్వతంత్ర ప్రతిపత్తితోపాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది. -
ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు... 25 శాతం పెంపు
సాక్షి, హైదరాబాద్ : దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 25 శాతం సీట్ల పెరుగుదల వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2019–20) అమల్లోకి రానుంది. ఈ మేరకు సీట్ల పెంపు విధానంపై కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ (ఎంహెచ్ఆర్డీ) స్పష్టత ఇచ్చింది. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లను కల్పించిన నేపథ్యంలో దేశంలోని అన్ని కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు పెంచుతూ రూపొందించిన విధానాన్ని హెచ్ఆర్డీ శాఖ వెల్లడించింది. దానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా (ఈడబ్ల్యూఎస్) నామకరణం చేసింది. ఈ మేరకు మంగళవారం ఎంహెచ్ఆర్డీ అడ్మిషన్స్ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్ఎన్ కాశీవిశ్వనాథం నివేదికను ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్‌కు అందజేశారు. ఆ నివేదికను యథాతథంగా అన్ని జాతీయ విద్యాసంస్థలకు ఎంహెచ్ఆర్డీ పంపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 యూనివర్సిటీలు, 40 వేల కాలేజీలు ఉండగా వాటన్నింటిలో 25 శాతం సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్లు అమలు చేయాలని అందులో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి 100 సీట్లకు 25 సీట్లను అదనంగా పెంచి 125 ïసీట్లు చేయనుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటా ఏమాత్రం తగ్గకుండా అదనపు సీట్లలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా సీట్లను కేటాయించాలని çవివరించింది. అంటే ప్రతి 125 సీట్లను 100 శాతంతో సమానంగా పరిగణనలోకి తీసుకొని ఓసీ కేటగిరీలో మాత్రం అదనంగా సీట్లను కేటాయిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఉన్న రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా: ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఎంహెచ్ఆర్డీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఓపెన్ కేటగిరీ (ఓసీ) వారికి 50.5 శాతం రిజర్వేషన్లను కేంద్రం అమలు చేస్తోంది. పెంచిన సీట్లను ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా సమాన పెంపును వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే అదనంగా పెరిగిన 25 శాతం సీట్లలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలని ఫార్ములాను జారీ చేసింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సీట్లను కేటాయించడంతోపాటు ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా ఓసీ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా సీట్లు వచ్చేలా ఫార్ములాను ప్రకటించింది. 25 శాతం సీట్లు పెంచిన ప్రకారం.. ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వేషన్ల ప్రకారం ప్రతి వంద సీట్లకుగాను 15 సీట్లు వస్తుండగా ఇకపై 19 సీట్లు లభిస్తాయి. అలాగే ఎస్టీలకు 7.5 సీట్లు వస్తుండగా ఇకపై 9 సీట్లు కేటాయిస్తారు. ఓబీసీలకు 27 సీట్లు ఇస్తుండగా ఇకపై 34 సీట్లను కేటాయిస్తారు. ఓపెన్ కేటగిరీలో 50.5 సీట్లను అన్ని వర్గాల వారికి సమానంగా ఇస్తుండగా దాన్ని యథాతథంగా (నాన్ ఈడబ్లూఎస్ పేరుతో) కొనసాగిస్తారు. ఇందులోనే వాటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 12 సీట్లను ఇస్తారు. ఇలా మొత్తంగా 125 సీట్లను 100 శాతంగా తీసుకొని భర్తీ చేసేలా మావనవనరుల అభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది. లక్షల్లో సీట్లు పెరుగుదల... కేంద్రం నిర్ణయం ప్రకారం దేశంలోని విద్యాసంస్థల్లో లక్షల సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి. ఈ పెంపును జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రాల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం పొందే విద్యాసంస్థల్లోనూ ఈ పెంపును అమలు చేయాలని ఇప్పటికే ఎంహెచ్ఆర్డీ డైరెక్టర్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీట్ల పెంపు విధానం, రిజర్వేషన్ల వర్తింపు విధానంపై స్పష్టత ఇవ్వడంతో ఆ దిశగా అన్ని రాష్ట్రాలూ చర్యలు చేపట్టే వీలుంది. దీంతో లక్షల సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో సీట్లను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ డిగ్రీలోని 4.32 లక్షల సీట్లలో 2.40 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. వాటిల్లో పెంపును పక్కన పెట్టినా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, డీఎడ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో 2 లక్షల వరకు సీట్లు ఉన్నాయి. 25 శాతం పెంపు ప్రకారం వాటిల్లో 50 వేల వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా జాతీయస్థాయిలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా పోటీ పడే ముఖ్యమైన విద్యాసంస్థలైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థ (జీఎఫ్‌టీఐ)ల్లో 9,489 సీట్లు అదనంగా పెరుగునున్నాయి. తెలుగు విద్యార్థులకు మరిన్ని సీట్లు.. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, జీఎప్టీఐలలో ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 18 శాతం వరకు సీట్లను సొంతం చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఇకపై పెరిగే 9,489 సీట్లలోనూ అదే నిష్పత్తిలో మన విద్యార్థులకు అదనపు సీట్లు లభించనున్నాయి. ప్రస్తుతం ఆయా విద్యాసంస్థల్లో 37,952 సీట్లు ఉండగా 25 శాతం సీట్ల పెంపుతో అదనంగా 9,489 సీట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వాటిల్లోని సీట్ల సంఖ్య 47,441కి చేరుకోనుంది. దీంతో పోటీలో ముందుండే తెలంగాణ, ఏపీ విద్యార్థులకు అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇవి కాకుండా బాలికల కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ కింద ఐఐటీల్లో 800, ఎన్ఐటీల్లో 653 సీట్లను, జీఎఫ్టీఐలలోనూ సీట్లను ఎంహెచ్ఆర్డీ పెంచింది. వరంగల్ ఎన్ఐటీలో 210 సీట్లు... జాతీయస్థాయి పోటీనే కాకుండా హోంస్టేట్ కోటా 50 శాతం సీట్లను స్థానికులకే కేటాయించే వరంగల్ ఎన్ఐటీలో 210 సీట్లు పెరగనున్నట్లు ఎన్ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్వీ రమణరావు పేర్కొన్నారు. అంటే ఇందులో తెలంగాణ విద్యార్థులకే 105 సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదనంగా లభించనున్నాయి. ప్రస్తుతం వరంగల్ ఎన్ఐటీలో 840 సీట్లు ఉండగా ప్రతి వందకు 25 సీట్ల చొప్పున పెంపుతో వాటి సంఖ్య 1,050కి చేరనుంది. అలాగే జాతీయస్థాయి పోటీగల హైదరాబాద్ ఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ సీట్లు పెరుగుతాయి. మొత్తంగా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రస్తుతం 7,23,679 సీట్లు ఉండగా 1,80,918 సీట్ల పెంపుతో అవి 9,04,598 లక్షలకు చేరుకోనున్నాయి. -
వర్సిటీ ఘటనపై మంత్రి ఫైర్
సాక్షి, అమరావతి: ఇటీవల రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరిగిన ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్ పై దాడికి యత్నించిన ఘటనపై స్పందించిన గంటా దాడికి యత్నించిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అసోసియేట్ ఫ్రోపెసర్ రతనప్ప చౌదరిని సస్పండ్ చేయాలని యూనివర్సిటీ ఇన్చార్జ్ వీసీను ఆదేశించారు. ఘటనకు కారకులైన డీఎడ్ కళాశాలల కరస్పాండెంట్ తిరుపతయ్యపై వేటు వేయాలన్నారు. తిరుపతయ్య కళాశాలల అఫిలియేషన్ రద్దు చేయాలని రాయలసీమ వర్సిటీ వీసిని ఆదేశించారు. ఉన్నతాధికారుల విధులకు ఆటంకం కలిగిస్తే సహించేదిలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. -
ఐఐటీల్లో 34 శాతం అధ్యాపకుల కొరత
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ).. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు. ఏడాదికేడాది ఆ సంస్థల్ని విస్తరిస్తూ పోతున్న కేంద్ర ప్రభుత్వం అందులో అధ్యాపకుల నియామకంపై దృష్టి పెడుతున్నట్టుగా లేదు. దేశవ్యాప్తంగా 23 ఐఐటీలు ఉంటే అన్ని సంస్థలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఒకే ఒక సమస్య అధ్యాపకుల కొరత. అన్ని సంస్థల్లో కలిపి మొత్తంగా చూస్తే ఈ ఏడాది మార్చి నాటికి 34 శాతం అధ్యాపకుల కొరత పట్టిపీడిస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఐఐటీల్లో సీటు సంపాదించిన విద్యార్థులకు పాఠం చెప్పేవాళ్లు లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు. పాలక్కడ్, తిరుపతి, గోవా వంటి కొత్తగా ఏర్పాటైన ఐఐటీల్లోనే కాదు ఎంతో ఘనతవహించిన ముంబై, ఖరగపూర్, కాన్పూర్ వంటి సంస్థల్లోనూ ఇదే దుస్థితి. ఎప్పట్నుంచో ఉన్న ఈ పాత సంస్థల్లోనే అధ్యాపకుల కొరత 25 శాతం నుంచి 45శాతం వరకు ఉందని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఏ ఐఐటీలో అధ్యాపకుల కొరత ఎంత? ఐఐటీ–గోవా 62 % ఐఐటీ–భిలాయ్ 58 % ఐఐటీ–ధర్వాడ్ 47 % ఐఐటీ–ఖర్గపూర్ 46 % ఐఐటీ–కాన్పూర్ 37 % ఐఐటీ–ఢిల్లీ 29 % ఐఐటీ–చెన్నై 28 % ఐఐటీ–ముంబై 27 % ఎందుకీ పరిస్థితి ? ఐఐటీల్లో ఫాకల్టీ కొరత కొత్త సమస్యేమీ కాదు. గత కొన్ని సంవత్సరాలుగా అధ్యాపకుల కొరత, సదుపాయాల లేమితో ఐఐటీల ప్రతిష్ట మసకబారుతోంది. ఐఐటీల్లో డిగ్రీలు తీసుకుంటున్న వారు మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగం కోసం వెళ్లిపోతున్నారే తప్ప, తిరిగి ఆ సంస్థల్లో ఫాకల్టీగా చేరుదామని అనుకోవడం లేదు. ఒకప్పుడు ఐఐటీలో విద్యాభ్యాసం చేసినవారిలో 15 శాతం మంది అదే సంస్థల్లో అధ్యాపకులగా చేరేవారు. కానీ ఇప్పుడది గణనీయంగా తగ్గిపోయింది. ఐఐటీ విద్యార్థుల్లో 50శాతం మంది విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లిపోతూ ఉంటే మిగిలిన వారిలో అత్యధిక శాతం భారత్‌లోని ప్రైవేటు కంపెనీల్లో చేరడానికే ఇష్టపడుతున్నారు. అధ్యాపక వృత్తి పట్ల యువతరంలో ఆకర్షణ ఉండేలా కేంద్రం చర్యలు తీసుకోకపోవడమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. కొత్తగా ఐఐటీలను ఏర్పాటు చేస్తున్న కేంద్రప్రభుత్వం అందులో మౌలిక సదుపాయాలపై మాత్రం దృష్టి సారించడంలేదు. చిన్న చిన్న పట్టణాలకు కూడా ఐఐటీలను మంజూరు చేస్తూ ఉండడంతో బోధనా నైపుణ్యం కలిగిన అధ్యాపకులెవరూ అక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. ‘కర్ణాటకలోని ధర్వాడ్ వంటి పట్టణాల్లో సదుపాయాలే ఉండవు. పాఠశాల, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సరైనవి లేని పట్టణాలకు నైపుణ్యం కలిగిన బోధకులు ఎందుకు వస్తారు’ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏం చేయాలి ? ఐఐటీల్లో అధ్యాపకుల కొరత అధిగమించడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టాల్సి ఉందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఐఐటీలో ఒక నియామకం జరగాలంటే ఆ ప్రక్రియ చాలా సుదీర్ఘమైనది. దానిని తగ్గించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ‘ఐఐటీల సంఖ్యమాత్రమే పెంచితే సరిపోదు. అధ్యాపకుల్ని ఆకర్షించేలా వేతనాలు పెంచడం, గ్యాడ్యుయేషన్‌తో చదువు ఆపేయకుండా విద్యార్థులు పీహెచ్డీ చేసేలా ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకున్నప్పుడే ఈ కొరతని అధిగమించగలం’ అని నిపుణులు సూచిస్తున్నారు. ఐఐటీల్లోకి ఫారెన్ ఫాకల్టీని కూడా తీసుకురావడానికి వీలుగా వీసా నిబంధనల్ని సరళతరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది. అంతేకాదు పదవీవిరమణ చేసిన అధ్యాపకుల్ని తిరిగి తీసుకోవడం, ఉన్నవారికి మరి కొన్నేళ్లు పదవీకాలం పొడిగింపు వంటి చర్యలు కూడా తీసుకోనుంది. ఏదిఏమైనా ఐఐటీల ప్రతిష్ట మరింత మసకబారకుండా కేంద్రమే పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సి అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. -- సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికలు వాయిదా
హైదరాబాద్ : స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రక్రియ 26 నుంచి మొదలు కానుంది. విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దృష్టిలో వుంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 22, 23, 24 తేదీలలో జరగనున్న విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దృష్టిలో వుంచుకొని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులకు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో చోటు ఉంటుందని, అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్లు ఆరుగురు, కో-అపటెడ్ సభ్యులు ఇద్దరు ఉంటారని పేర్కొంది. ఎక్స్ అఫిషియో మెంబర్లలో హెడ్మాస్టర్ కన్వీనర్ గా ఉంటారని, ఒక అదనపు ఉపాధ్యాయుడు, వార్డు లేదా కౌన్సిలర్, అంగన్ వాడీ వర్కర్, ఒక ఎ.ఎన్.ఎమ్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో ఉంటారని స్పష్టం చేసింది. -
ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ రాజీనామా
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ దినేశ్ సింగ్ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. వివాదస్పద నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ కోర్సు రద్దు చేయాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దినేశ్ రాజీనామా చేయడం వార్తల్లోకి ఎక్కింది. దినేష్ సింగ్ తన రాజీనామాను మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖకు పంపారని వర్సిటీ జాయింట్ డీన్ మలయ్ నీరవ్ మీడియాకు తెలిపారు. నాలుగేళ్ల కోర్సును రద్దు చేయాలంటూ యూజీసీ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న 2.7 లక్షల మంది పరిస్థితి గందరగోళంలో పడింది. గత సంవత్సరం ప్రారంభించిన నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సును రద్దు చేయాలంటూ ఢిల్లీ యూనివర్సిటీకి యూజీసీ నోటీసలు జారీ చేసింది. అలాగే నాలుగేళ్ల కోర్సు కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులను మూడేళ్ల అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుకు మళ్లించాలని యూజీసీ ఆదేశించింది.