సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతోపాటు ఐదు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఎమినెన్స్(ఐవోఈ) హోదా కల్పిస్తున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ హోదా దక్కిన మిగతా విద్యా సంస్థల్లో మద్రాస్ ఐఐటీ, ఖరగ్‌పూర్ ఐఐటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ వర్సిటీలున్నాయి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గత నెలలో చేసిన ప్రతిపాదనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మానవ వనరుల అభివృద్ధి మంత్రి రమేశ్ పొఖ్రియాల్ నిశాంక్ తెలిపారు.
దీంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చే ఐదేళ్లలో కేంద్రం నుంచి రూ.వెయ్యి కోట్లు నిధులు అందనున్నాయి. వీటితోపాటు ప్రైవేట్ రంగంలోని తమిళనాడుకు చెందిన అమృత విద్యాపీఠమ్, వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒడిశాలోని కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఢిల్లీకి చెందిన జామియా హమ్‌దర్ద్ యూనివర్సిటీ, మొహాలీలోని సత్య భారతి ఫౌండేషన్ భారతి ఇన్‌స్టిట్యూట్‌లకు కూడా ఎమినెన్స్ హోదా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఆయా సంస్థల అంగీకారం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇంకా..నోయిడాలోని శివ్‌నాడార్ వర్సిటీ, సోనెపట్‌లోని ఓపీ జిందాల్ యూనివర్సిటీలకు ఎమినెన్స్ హోదా ఇవ్వాలని ఎంపిక కమిటీ సిఫారసు చేసిందన్నారు. జాదవ్‌పూర్ యూనివర్సిటీ, అన్నా వర్సిటీల ఎమినెన్స్ హోదాకు సంబంధించి తమ వంతు నిధులు కేటాయించేందుకు బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలు అంగీకారం తెలపాల్సి ఉందన్నారు.
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, అశోకా యూనివర్సిటీ, అజీంప్రేమ్‌జీ యూనివర్సిటీ, తేజ్‌పూర్ యూనివర్సిటీ, పంజాబ్ యూనివర్సిటీ, ఆంధ్రా యూనివర్సిటీ, గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాలు అందుకోవడంలో విఫలమైన వాటిలో ఉన్నాయి. ఎమినెన్స్ హోదా ప్రకటించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారంతోపాటు తమ వంతుగా కనీసం 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుందని మంత్రి నిశాంక్ తెలిపారు.
దేశంలో పలు విద్యా సంస్థలను ప్రపంచ స్థాయి బోధన, పరిశోధన సామర్ధ్యం కలిగినవిగా తీర్చిదిద్దడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు 2016లో కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ, 10 ప్రైవేటు విద్యార్థులను తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ‘ఇప్పటివరకు 16 సంస్థలకు ఎమినెన్స్ హోదా ఇచ్చాం. మరో నాలుగు సంస్థలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాం’అని నిశాంక్ తెలిపారు. ఎమినెన్స్ హోదా కల్పించిన ప్రభుత్వ విద్యాసంస్థలైతే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్ల వరకు సాయం అందజేస్తుంది. అదే ప్రైవేట్ సంస్థలకైతే ప్రభుత్వ నిధులు అందవు కానీ, మరింత స్వతంత్ర ప్రతిపత్తితోపాటు ప్రత్యేక కేటగిరీ డీమ్డ్ యూనివర్సిటీ హోదా లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment