సాక్షి, హైదరాబాద్ : దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా 25 శాతం సీట్ల పెరుగుదల వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2019–20) అమల్లోకి రానుంది. ఈ మేరకు సీట్ల పెంపు విధానంపై కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) స్పష్టత ఇచ్చింది. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లను కల్పించిన నేపథ్యంలో దేశంలోని అన్ని కేంద్ర విద్యాసంస్థల్లో సీట్లు పెంచుతూ రూపొందించిన విధానాన్ని హెచ్‌ఆర్‌డీ శాఖ వెల్లడించింది. దానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలుగా (ఈడబ్ల్యూఎస్) నామకరణం చేసింది. ఈ మేరకు మంగళవారం ఎంహెచ్‌ఆర్‌డీ అడ్మిషన్స్ చైర్మన్ ప్రొఫెసర్ కేఎస్‌ఎన్ కాశీవిశ్వనాథం నివేదికను ఎంహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌కు అందజేశారు.
ఆ నివేదికను యథాతథంగా అన్ని జాతీయ విద్యాసంస్థలకు ఎంహెచ్‌ఆర్‌డీ పంపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 900 యూనివర్సిటీలు, 40 వేల కాలేజీలు ఉండగా వాటన్నింటిలో 25 శాతం సీట్లను పెంచి ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్లు అమలు చేయాలని అందులో స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి 100 సీట్లకు 25 సీట్లను అదనంగా పెంచి 125 ïసీట్లు చేయనుంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ల కోటా ఏమాత్రం తగ్గకుండా అదనపు సీట్లలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా సీట్లను కేటాయించాలని çవివరించింది. అంటే ప్రతి 125 సీట్లను 100 శాతంతో సమానంగా పరిగణనలోకి తీసుకొని ఓసీ కేటగిరీలో మాత్రం అదనంగా సీట్లను కేటాయిస్తూ రిజర్వేషన్లు అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఉన్న రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా: ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా ఈడబ్ల్యూఎస్ విద్యార్థుల కోసం అమల్లోకి తెచ్చిన రిజర్వేషన్లను అమలు చేయాలని ఎంహెచ్‌ఆర్‌డీ నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం, ఓపెన్ కేటగిరీ (ఓసీ) వారికి 50.5 శాతం రిజర్వేషన్లను కేంద్రం అమలు చేస్తోంది. పెంచిన సీట్లను ఆ రిజర్వేషన్లకు అనుగుణంగా సమాన పెంపును వర్తింపజేయాలని స్పష్టం చేసింది. అంటే అదనంగా పెరిగిన 25 శాతం సీట్లలో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు ప్రత్యేకంగా కేటాయించాలని ఫార్ములాను జారీ చేసింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సీట్లను కేటాయించడంతోపాటు ఇప్పుడున్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఓసీ రిజర్వేషన్లకు భంగం వాటిల్లకుండా ఓసీ కేటగిరీలోనే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు అదనంగా సీట్లు వచ్చేలా ఫార్ములాను ప్రకటించింది.
25 శాతం సీట్లు పెంచిన ప్రకారం..
ప్రస్తుతం ఎస్సీలకు రిజర్వేషన్ల ప్రకారం ప్రతి వంద సీట్లకుగాను 15 సీట్లు వస్తుండగా ఇకపై 19 సీట్లు లభిస్తాయి. అలాగే ఎస్టీలకు 7.5 సీట్లు వస్తుండగా ఇకపై 9 సీట్లు కేటాయిస్తారు. ఓబీసీలకు 27 సీట్లు ఇస్తుండగా ఇకపై 34 సీట్లను కేటాయిస్తారు. ఓపెన్ కేటగిరీలో 50.5 సీట్లను అన్ని వర్గాల వారికి సమానంగా ఇస్తుండగా దాన్ని యథాతథంగా (నాన్ ఈడబ్లూఎస్ పేరుతో) కొనసాగిస్తారు. ఇందులోనే వాటికి అదనంగా ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 12 సీట్లను ఇస్తారు. ఇలా మొత్తంగా 125 సీట్లను 100 శాతంగా తీసుకొని భర్తీ చేసేలా మావనవనరుల అభివృద్ధిశాఖ చర్యలు చేపట్టింది.
లక్షల్లో సీట్లు పెరుగుదల...
కేంద్రం నిర్ణయం ప్రకారం దేశంలోని విద్యాసంస్థల్లో లక్షల సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి. ఈ పెంపును జాతీయస్థాయి విద్యాసంస్థలతోపాటు రాష్ట్రాల్లో ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక సహాయం పొందే విద్యాసంస్థల్లోనూ ఈ పెంపును అమలు చేయాలని ఇప్పటికే ఎంహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. తాజాగా సీట్ల పెంపు విధానం, రిజర్వేషన్ల వర్తింపు విధానంపై స్పష్టత ఇవ్వడంతో ఆ దిశగా అన్ని రాష్ట్రాలూ చర్యలు చేపట్టే వీలుంది. దీంతో లక్షల సంఖ్యలో సీట్లు పెరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోనూ ఇంజనీరింగ్ వంటి కోర్సుల్లో సీట్లను పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం సాధారణ డిగ్రీలోని 4.32 లక్షల సీట్లలో 2.40 లక్షల సీట్లే భర్తీ అవుతున్నాయి. వాటిల్లో పెంపును పక్కన పెట్టినా ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఎడ్, డీఎడ్ వంటి వృత్తివిద్యా కోర్సుల్లో 2 లక్షల వరకు సీట్లు ఉన్నాయి. 25 శాతం పెంపు ప్రకారం వాటిల్లో 50 వేల వరకు సీట్లు పెరిగే అవకాశం ఉంది. ఇవి కాకుండా జాతీయస్థాయిలో తెలుగు విద్యార్థులు ఎక్కువగా పోటీ పడే ముఖ్యమైన విద్యాసంస్థలైన కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయస్థాయి సాంకేతిక విద్యా సంస్థ (జీఎఫ్‌టీఐ)ల్లో 9,489 సీట్లు అదనంగా పెరుగునున్నాయి.
తెలుగు విద్యార్థులకు మరిన్ని సీట్లు..
దేశంలోని ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, జీఎప్‌టీఐలలో ఏటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు 18 శాతం వరకు సీట్లను సొంతం చేసుకుంటున్నారు. ఈ లెక్కన ఇకపై పెరిగే 9,489 సీట్లలోనూ అదే నిష్పత్తిలో మన విద్యార్థులకు అదనపు సీట్లు లభించనున్నాయి. ప్రస్తుతం ఆయా విద్యాసంస్థల్లో 37,952 సీట్లు ఉండగా 25 శాతం సీట్ల పెంపుతో అదనంగా 9,489 సీట్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో వాటిల్లోని సీట్ల సంఖ్య 47,441కి చేరుకోనుంది. దీంతో పోటీలో ముందుండే తెలంగాణ, ఏపీ విద్యార్థులకు అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇవి కాకుండా బాలికల కోసం ప్రత్యేకంగా సూపర్ న్యూమరీ కింద ఐఐటీల్లో 800, ఎన్‌ఐటీల్లో 653 సీట్లను, జీఎఫ్‌టీఐలలోనూ సీట్లను ఎంహెచ్‌ఆర్‌డీ పెంచింది.
వరంగల్ ఎన్‌ఐటీలో 210 సీట్లు...
జాతీయస్థాయి పోటీనే కాకుండా హోంస్టేట్ కోటా 50 శాతం సీట్లను స్థానికులకే కేటాయించే వరంగల్ ఎన్‌ఐటీలో 210 సీట్లు పెరగనున్నట్లు ఎన్‌ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు పేర్కొన్నారు. అంటే ఇందులో తెలంగాణ విద్యార్థులకే 105 సీట్లు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అదనంగా లభించనున్నాయి. ప్రస్తుతం వరంగల్ ఎన్‌ఐటీలో 840 సీట్లు ఉండగా ప్రతి వందకు 25 సీట్ల చొప్పున పెంపుతో వాటి సంఖ్య 1,050కి చేరనుంది. అలాగే జాతీయస్థాయి పోటీగల హైదరాబాద్ ఐఐటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీల్లోనూ సీట్లు పెరుగుతాయి. మొత్తంగా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రస్తుతం 7,23,679 సీట్లు ఉండగా 1,80,918 సీట్ల పెంపుతో అవి 9,04,598 లక్షలకు చేరుకోనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment