అక్టోబర్‌ 6 నుంచి షురూ.. | Admission Process In NITs And IITs Will Be Completed By November 9 | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 6 నుంచి షురూ..

Published Sat, Sep 5 2020 2:09 AM | Last Updated on Sat, Sep 5 2020 2:09 AM

Admission Process In NITs And IITs Will Be Completed By November 9 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే విద్యా సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ఉమ్మడి ప్రవేశాలను వచ్చే నెల 6 నుంచి చేపట్టి నవంబర్‌ 9వ తేదీలోగా పూర్తి చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) నిర్ణయిం చింది. ఈ మేరకు పూర్తి స్థాయి షెడ్యూల్‌ ఖరారుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఉమ్మడి ప్రవేశాల ప్రారంభ, ముగింపు తేదీలను కూడా తాత్కాలికంగా ఖరారు చేసింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ ఈనెల 6తో ముగియనుండగా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ఈనెల 27న ఆన్‌ లైన్లో నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూ ల్‌ను ఖరారు చేసింది. దీనికి అనుగుణం గానే ఫలితాలను విడుదల చేసి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో వచ్చే నెలలో ఉమ్మడి ప్రవే శాల ప్రక్రియను ప్రారంభిస్తారని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వచ్చేనెల 6న ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమై నవంబర్‌ 9తో ముగుస్తుందని జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌లో స్పష్టం చేసింది. మొత్తా నికి ఈసారి కూడా 7 విడతల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించనుంది.

12 నుంచి ‘అడ్వాన్స్‌డ్‌’ రిజిస్ట్రేషన్లు..
జేఈఈ మెయిన్‌ ఫలితాలను ఈనెల 11లోగా విడుదల చేసేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కసరత్తు చేస్తోంది. గత జనవరి జేఈఈ మెయిన్, ప్రస్తుత మెయిన్‌ పరీక్షల్లో అర్హత సాధించిన టాప్‌ 2.5 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని ఢిల్లీ ఐఐటీ వెల్లడించింది. వారంతా ఈనెల 12 నుంచి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు చేసుకునేలా షెడ్యూల్‌ను జారీ చేసింది. ఈనెల 17న సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకోవచ్చని, 18న సాయంత్రం 5 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చని వెల్లడించింది. 21వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 27వ తేదీ ఉదయం 9 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌ పరీక్ష 27న ఉంటుందని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న 12 గంటల వరకు పేపరు–1, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపరు2– పరీక్ష ఉంటుందని వెల్లడించింది. కాగా, విదేశాల్లో 12వ తరగతి చదువుకున్న, చదువుతున్న విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఈనెల 5నుంచే దరఖాస్తు చేసుకోవాలని ఢిల్లీ ఐఐటీ తెలిపింది. 

రాష్ట్రంలో 15 కేంద్రాల్లో పరీక్ష..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రాష్ట్రంలోని 15 పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో నిర్వహించేందుకు ఢిల్లీ ఐఐటీ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్ధిపేట్, సూర్యాపేట, వరంగల్‌ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇక ఈ పరీక్షల ఫలితాలను వచ్చే నెల 5న విడుదల చేస్తామని పేర్కొంది. వచ్చే నెల 8న ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూట్‌ టెస్టును (ఏఏటీ) నిర్వహిస్తామని, 11న వాటి ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. ఉమ్మడి ప్రవేశాల ప్రక్రియ వచ్చే నెల 6న ప్రారంభమై నవంబర్‌ 9తో ముగుస్తుందని వివరించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement