స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రక్రియ 26 నుంచి మొదలు కానుంది.
హైదరాబాద్ : స్కూల్ మేనేజ్మెంట్ ఎన్నికల ప్రక్రియ వాయిదా పడింది. ఈ నెల 20 నుంచి ప్రారంభం కావాల్సిన ప్రక్రియ 26 నుంచి మొదలు కానుంది. విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దృష్టిలో వుంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 22, 23, 24 తేదీలలో జరగనున్న విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనలు దృష్టిలో వుంచుకొని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది.
విధివిధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని, ఇంతకు ముందు ప్రకటించిన విధంగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని స్పష్టం చేసింది. ప్రతి పాఠశాలలోనూ ప్రతి తరగతి నుంచి ముగ్గురు సభ్యులకు స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో చోటు ఉంటుందని, అలాగే ఎక్స్ అఫిషియో మెంబర్లు ఆరుగురు, కో-అపటెడ్ సభ్యులు ఇద్దరు ఉంటారని పేర్కొంది. ఎక్స్ అఫిషియో మెంబర్లలో హెడ్మాస్టర్ కన్వీనర్ గా ఉంటారని, ఒక అదనపు ఉపాధ్యాయుడు, వార్డు లేదా కౌన్సిలర్, అంగన్ వాడీ వర్కర్, ఒక ఎ.ఎన్.ఎమ్, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు ఎక్స్ అఫిషియో మెంబర్లుగా స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీలో ఉంటారని స్పష్టం చేసింది.