నిట్‌లో నిబంధనల ప్రకారమే సీట్లు
50 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకే
371-డి ఎన్‌ఐటీలకు వర్తించదు
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్య
హెచ్‌ఆర్‌డీ శాఖ కార్యదర్శితో భేటీ
న్యూఢిల్లీ: వరంగల్‌లోని నిట్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలని ఆ రాష్ర్ట ప్రభుత్వం కోరడం చట్ట వ్యతిరేక మని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. నిబంధనల ప్రకారం జాతీయ విద్యాసంస్థల్లో స్థానిక విద్యార్థులకే 50 శాతం సీట్లు చెందుతాయని, వీటిలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం వద్ద తన పలుకుబడి ఉపయోగించి తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంగళవారం ఉదయం ఢిల్లీకి వచ్చిన కడియం, కేంద్ర మానవవనరుల అభివృద్ధిశాఖ కార్యదర్శి ఎస్.ఎం.మహంతితో సమావేశమయ్యారు. వరంగల్ ఎన్‌ఐటీలో తమ విద్యార్థులకు సీట్లు కేటాయించాలంటూ ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలపై ఆయనతో చర్చించారు. అనంతరం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడియం మాట్లాడుతూ జాతీయ విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు సంబంధించి 2007లో చేసిన చట్టాల ప్రకారం.. విద్యా సంస్థ ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు 50 శాతం సీట్లు, మిగిలిన రాష్ట్రాల విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు.
దీని ప్రకారం వరంగల్ నిట్‌లో ఉన్న 740 సీట్లలో తెలంగాణ విద్యార్థులకు 370 సీట్లు దక్కుతాయని స్పష్టం చేశారు. 371-డి ప్రకారం రాష్ర్ట ప్రభుత్వ పరిధిలోకి వచ్చే విద్యా సంస్థల్లోనే పదేళ్లపాటు ఉమ్మడి అడ్మిషన్లు జరగాలని, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇదే స్పష్టం చేశారని గుర్తుచేశారు. ఏ నిబంధనల ప్రకారం చూసినా నిట్ వరంగల్‌లో ఏపీ విద్యార్థులకు కోటా కోరడం సరికాదన్నారు. కేంద్రం వద్ద పలుకుబడి ఉపయోగించి దొడ్డిదారిన సీట్లు పొందాలని చంద్రబాబు ప్రయత్నిస్తే, అన్ని మార్గాల్లో అడ్డుకునేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ఇలాంటి సందర్భాల్లో గతంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రకారం సూపర్ న్యూమరీ సీట్లు కేటాయించి ఏపీ విద్యార్థులను ఆదుకోవాలని సూచించారు. వరంగల్ నిట్‌లోనూ అవకాశం ఉంటే, ఏపీ విద్యార్థుల కోసం సూపర్ న్యూమరీ సీట్లు కేటాయిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీల్లో నిరుపయోగంగా ఉన్న భూములను పేదల ఇళ్లు నిర్మించేందుకు వినియోగించడంలో తప్పులేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ భూములను ఎందుకు వినియోగిస్తున్నామన్న అంశాన్ని విద్యార్థులు సైతం అర్థం చేసుకోవాలన్నారు.