రూసా నిధుల్లో చేతివాటం! | RUSA Scheme Irregularities In Nagarjuna University | Sakshi

రూసా నిధుల్లో చేతివాటం!

Published Mon, Sep 9 2019 11:55 AM | Last Updated on Mon, Sep 9 2019 11:55 AM

RUSA Scheme Irregularities In Nagarjuna University - Sakshi

సాక్షి, ఏఎన్‌యూ(కృష్ణా) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రూసా(రాష్ట్రీయ ఉచ్చాతర్‌ శిక్షా అభియాన్‌) పథకం కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి మంజూరైన నిధుల వినియోగంలో గందరగోళం నెలకొంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని, అన్న(మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు) అండదండలను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వర్సిటీ లైబ్రేరియన్‌ కోడెల వెంకటరావు రూసా పథకం కింద పుస్తకాలు కొనుగోలు విషయంలోనూ అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూసా నిధుల కింద పుస్తకాలు కొనుగోలు చేశానంటూ యూనివర్సిటీ లైబ్రేరియన్‌ డాక్టర్‌ కోడెల వెంకటరావు సమర్పించిన బిల్లులకు చెల్లింపులు చేయాలని కొందరు ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తుండగా, వీటిలో స్పష్టత లేదంటూ కొందరు అధికారులు తిరస్కరిస్తున్నట్లు తెలిసింది. దీంతో కొంత కాలంగా ఈ అంశం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.

పుస్తకాల కొనుగోలుపై అభ్యంతరాలు:
రూసా పథకం కింద  2015–16, 2016–17 సంవత్సరాలకు నిధుల కోసం ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్‌(డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)లో రూ.18 లక్షలు పుస్తకాల కొనుగోలు కోసం ప్రతిపాదనలు పంపారు. రూసా నుంచి ఏఎన్‌యూకి 2018లో ఈ నిధులు వచ్చాయి. దీంతో పుస్తకాల కొనుగోలుకు ప్రతిపాదించిన రూ.18 లక్షల విషయం తెరమీదకు వచ్చింది. దీంతో ప్రతిపాదిత సంవత్సరాల్లో తాను రూ.11.90 లక్షలకు పుస్తకాలు కొనుగోలు చేశానంటూ యూనివర్సిటీ లైబ్రేరియన్‌ డాక్టర్‌ కోడెల వెంకటరావు వర్సిటీకి బిల్లులు సమర్పించారు. బిల్లులు పరిశీలించిన రూసా అధికారులు పుస్తకాలు అవసరమంటూ విభాగాధిపతులు, సబ్జెక్ట్‌ ఎక్స్‌ఫర్ట్స్, అధ్యాపకులు, బీఓఎస్‌ చైర్మన్లు, విద్యార్థులు ఎవరైనా కోరినట్లు లేఖలు ఉండాలని, ఎవరూ కోరకుండా ఎలా పుస్తకాలు కొనుగోలు చేశారో స్పష్టం చేయాలని కోరినట్లు సమాచారం.  

చెల్లింపులపై ఒత్తిడి
పుస్తకాల కొనుగోలుకు సమర్పించిన రూ.11.90 లక్షల బిల్లులకు రూసా నిధుల నుంచి చెల్లింపులు చేయాలని కొందరు ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను ఒత్తిడి చేసినట్లు తెలిసింది. దీంతో చెల్లింపులు చేయాలంటూ  ఉన్నతాధికారులు సంబంధిత ఫైలుపై లిఖిత పూర్వకంగా రాస్తే తమకు అభ్యంతరం లేదని కూడా రూసా అధికారులు పేర్కొన్నారు. ఏ విధంగానైనా పని జరగాలని చూసిన కొందరు అధికారులు రూసాకు ప్రతిపాదనలు పంపిన సంవత్సరాలకు గాను పుస్తకాల కొనుగోలుకు దాదాపు రూ.7 లక్షలకు యూనివర్సిటీ నిధుల నుంచి చెల్లింపులు చేశామని, ఈ మొత్తాన్ని రూసా ఫండ్‌ నుంచి యూనివర్సిటీ జనరల్‌ ఫండ్‌ ఎకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేయాలని రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎకౌంట్స్‌ విభాగం కోరినట్లు తెలిసింది. తీరా ఆ బిల్లులను పరిశీలిస్తే వాటిలో రూ.3 లక్షలు పుస్తకాల బైండింగ్‌కు చెల్లింపులు చేశామని పేర్కొన్నట్లు సమాచారం. ఏఎన్‌యూ లైబ్రరీలో బైడింగ్‌ విభాగం, దానిలో ప్రత్యేకంగా ఉద్యోగులు ఉండగా, బయట వ్యక్తులతో బైండింగ్‌ చేయించినట్లు బిల్లులు పెట్టడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు కొన్ని పుస్తకాలకు 28 శాతం వరకు డిస్కౌంట్, కొన్ని పుస్తకాలకు 20 వరకు మాత్రమే డిస్కౌంట్‌ ఇవ్వడంపైనా ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణాలతోనే చెల్లింపులు ఆగిపోయినట్లు తెలుస్తోంది.

కోడెల తీరుపై విమర్శలు
లైబ్రరీకి పుస్తకాల కొనుగోలు విషయంలో లైబ్రేరియన్‌ డాక్టర్‌ కోడెల వెంకటరావు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుస్తకాల కొనుగోలు చేయాలని కొందరు కోరారని చెబుతూ తన సామాజిక వర్గానికి చెందిన నలుగురైదుగురు అధ్యాపకులు, తనకు అనుకూలంగా నడుచుకునే ఓ వృత్తి విద్యా కళాశాల ప్రిన్సిపాల్‌ నుంచి లేఖలు సమర్పించారనే ఆరోపణలూ ఉన్నాయి. దీనిపై రూసా డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ జీవీఎస్‌ఆర్‌ ఆంజనేయులును వివరణ కోరగా, రూసా నిధుల పుస్తకాల కొనుగోలు బిల్లుల చెల్లింపు విషయం కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న మాట వాస్తవమేనన్నారు. బిల్లులపై ఆరోపణల విషయం తనకు తెలియదని తెలిపారు. చెల్లింపులు చేయమని ఉన్నతాధికారులు లిఖిత పూర్వకంగా ఆదేశాలిస్తే వెంటనే చెల్లింపులు చేస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement