ఎంత ఖర్చు చేశారు? | Government Departments not given Special Development Funds details | Sakshi
Sakshi News home page

ఎంత ఖర్చు చేశారు?

Published Tue, Jan 15 2019 2:03 AM | Last Updated on Tue, Jan 15 2019 2:03 AM

Government Departments not given Special Development Funds details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీలకోసం అమలుచేస్తున్న ప్రత్యేక అభివృద్ధి నిధుల వినియోగంపై అయోమయం నెలకొంది. 2018–19 వార్షిక బడ్జెట్‌లో ఈ రెండు కేటగిరీల్లో రూ.26,145 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇందులో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.16,452 కోట్లు, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.9,693 కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులను 42 ప్రభుత్వ శాఖల ద్వారా ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించి లక్ష్యాలు నిర్దేశించింది. వార్షిక సంవత్సరం పూర్తయ్యేలోపు కేటాయించిన నిధులన్నీ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మూడు త్రైమాసికాలు ముగిశాయి. ప్రస్తుతం నాల్గో త్రైమాసికం కొనసాగుతోంది.

ఈక్రమంలో మూడు త్రైమాసికాలలో వినియోగానికి సంబంధించిన వివరాలను నోడల్‌ ఏజెన్సీలకు ఇవ్వాలి. కానీ గత ఆర్నెళ్లుగా ప్రత్యేక అభివృద్ధి నిధి ఖర్చుపై అయోమయం నెలకొంది. శాఖల వారీగా లక్ష్యసాధనకు సంబంధించిన వివరాలేవీ నోడల్‌ ఏజెన్సీలకు ఇవ్వడం లేదు. దీంతో ఈ పద్దు కింద ఎంత ఖర్చు జరిగింది, లక్ష్యాలు ఏమిటనేదానిపై అస్పష్టత నెలకొంది. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి పర్యవేక్షణకు ప్రభుత్వం రెండు నోడల్‌ ఏజెన్సీలను ఏర్పాటుచేసింది. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధినిధి నోడల్‌ ఏజెన్సీగా ఎస్సీ అభివృద్ధి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి నోడల్‌ ఏజెన్సీగా గిరిజన శాఖను నియమించింది. ఈ శాఖలు ఎస్సీ, ఎస్టీ ఎస్‌డీఎఫ్‌ సమావేశాలు, నోడల్‌ ఏజెన్సీ మీటింగ్‌లు, పురోగతిపై సమీక్షించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.

ఈక్రమంలో ఎస్‌డీఎఫ్‌ నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడంతో వినియోగానికి సంబంధించిన సమాచారం సమర్పించాలని పలుమార్లు సూచించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తాజాగా వివరాలు సమర్పించని ప్రభుత్వ శాఖలకు నోటీసులు జారీ చేస్తున్నాయి. త్వరలో నోడల్‌ ఏజెన్సీ సమావేశం ఉండడంతో ఆలోపు వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement