'త్వరలో నూతన విద్యా విధానం'
హైదరాబాద్ : తెలంగాణలో ఈ ఏడాది నుంచి నూతన విద్యా విధానం అమల్లోకి తెస్తామని డిప్యూటి సీఎం కడియం శ్రీహరి అన్నారు. అసెంబ్లీలో మంగళవారం విద్యావిధానంపై చర్చ సందర్భంగా కడియం ఉద్వేగభరితంగా మాట్లాడారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ సరిదిద్దుకునే అవకాశాలున్నాయని, ఈ ఏడాది నుంచే ప్రైవేట్ పాఠశాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని, తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు, నూతన భవనాల నిర్మాణాల కోసం రూ.1500 కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి కడియం సభకు తెలిపారు. సోషల్ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్లలో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని కితాబిచ్చారు. వీసీల నియామకాలపై స్పందిస్తూ..వీసీలు, సరిపడా సిబ్బంది లేక యూనివర్శిటీలు అస్తవ్యస్తంగా మారాయని, ఏప్రిల్ 2లోగా అన్ని వర్సిటీలకు వీసీలను నియమిస్తామని కడియం పేర్కొన్నారు.