ట్యాబ్‌లతో చదువుకుంటున్న ఏపీ ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు
సాక్షి, అమరావతి: డిజిటల్ డివైడ్‌ను తొలగించాలన్నా... అంతరాలను తగ్గిస్తూ పోవాలన్నా కావాల్సింది అక్షరాస్యత. అది కూడా... డిజిటల్ అక్షరాస్యత. ఆ సూత్రాన్ని మనసావాచా ఆచరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందుకే ఇక్కడ డిజిటల్ డివైడ్ తగ్గుతోంది. శ్రీమంతులకు మాత్రమేననుకున్న డిజిటల్ విద్య పేదలకూ అందుతోంది. డివైడ్‌ను తగ్గిస్తూ డివైజ్‌లూ అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ ఏడాది 8వ తరగతికి వచ్చిన విద్యార్థులకు ట్యాబ్‌లు అందించారు. మొత్తం 5.30 లక్షల నాణ్యమైన ట్యాబ్‌లు ఇవ్వటం ద్వారా రాష్ట్రంలో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు.
ప్రతి విద్యార్థికీ అందుబాటులో ఉండేలా డిజిటల్ క్లాస్‌రూమ్‌లను అందుబాటులోకి తెస్తోంది ఏపీ ప్రభుత్వం. 1వ తరగతి నుంచే స్మార్ట్ టీవీ స్క్రీన్ల ద్వారా డిజిటల్ క్లాస్‌రూమ్‌లను అలవాటు చేయటంతో పాటు... ప్రభుత్వ స్కూళ్లలో 6వ తరగతి, ఆపైన ఉన్న ప్రతి తరగతి గదిలోనూ ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను (ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేస్తున్నారు.
ఇక 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లివ్వటంతో పాటు... 8, ఆ పై తరగతుల వారికి బైజూస్ డిజిటల్ కంటెంట్‌ను అందిస్తున్నారు. దీంతో ఇంట్లోనూ పిల్లలు ఆడియో, వీడియో, గ్రాఫిక్ ఎలిమెంట్స్ ఉన్న పాఠాలను నేర్చుకునే అవకాశం కలిగింది. ఇంటర్ విద్యార్థులకు కూడా డిజిటల్ సౌలభ్యాన్ని కల్పించడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది.
ఈ డిజిటల్ సదుపాయాలతో ప్రయివేటు, కార్పొరేట్ విద్యార్థులకు ఏమాత్రం తీసిపోకుండా ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులూ ఉత్తమ విద్యా ప్రమాణాలను అందుకునే అవకాశముంది. ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేయటమే కాదు. వాటి ద్వారా నిపుణులైన సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించే చర్యలు చేపట్టారు. దీనికోసం టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
ఇప్పటికే ‘నాడు–నేడు’ పూర్తయిన స్కూళ్లన్నింటిలోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఐఎఫ్‌పీలు అందుబాటులోకి రానున్నాయి. ఇక పుస్తకాల్లోని అంశాలు, ట్యాబుల్లోని బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌పీ కంటెంట్ ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. దీనివల్ల విద్యార్థులు మరింత సమర్థంగా అభ్యసనం కొనసాగించేందుకు ఆస్కారమేర్పడుతోంది.
పాలనలోనూ డిజిటల్ సేవలు...
విద్యారంగంలోనే కాకుండా ప్రభుత్వ పాలనా వ్యవహారాలన్నీ డిజిటల్ విధానంలోనే కొనసాగేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారు. తద్వారా అన్ని సంక్షేమ పథకాలనూ అక్రమాలకు, అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా అందజేయగలుగుతున్నారు. గతంలో లక్షల కోట్ల రూపాయల నిధులను వివిధ పథకాల కింద ఖర్చు చేస్తున్నట్లు చూపించటమే తప్ప ప్రజలకు వాటి ఫలాలు అందలేదు. మధ్యవర్తులు, దళారులు ప్రజాధనాన్ని దోచుకుతిన్నారు.
డిజిటలైజేషన్‌ను ప్రభుత్వం సమర్థంగా వినియోగించుకోవటంతో ఆ పరిస్థితికి పూర్తిగా చెక్ పడింది. రాష్ట్రంలో గ్రామ, వార్డుల వారీగా 2.60 లక్షల మంది వలంటీర్లను నియమించి వారికి స్మార్ట్ ఫోన్లు ఇచ్చారు. తద్వారా అర్హుౖలైన ప్రతి లబ్ధిదారుకూ ప్రభుత్వ పథకాలను నేరుగా అందిస్తున్నారు. గ్రామ స్థాయిలో మహిళలు, శిశువుల సంక్షేమానికి, ఆరోగ్య పరిరక్షణకు వీలుగా అంగన్‌వాడీ కార్యకర్తలకూ ఫోన్లు అందించారు.
42 వేల మంది ఆశావర్కర్లకు స్మార్ట్ ఫోన్లు... 15వేల మందికి పైగా ఏఎన్‌ఎంలకు ట్యాబులు పంపిణీ చేయటంతో వారి ద్వారా అందజేస్తున్న సేవల్లో పూర్తి పారదర్శకత సాధ్యమయింది. గ్రామాల్లో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేయటమే కాక అక్కడ 10,032 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించి స్మార్ట్ ఫోన్లు అందిస్తున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగానికీ శ్రీకారం చుట్టారు.
Comments
Please login to add a commentAdd a comment