తోటరావులపాడు గ్రామంలో స్వచ్ఛభారత్ నిధులతో నిర్మించినట్లు బిల్ చేసుకున్న మరుగుదొడ్డి...
♦ లబ్ధిదారుల పేరుతో ఎన్జీఓల ఖాతాల్లోకి రూ.కోటి మళ్లింపు
♦ కొన్ని గ్రామాల్లో పాతదొడ్లకు రంగులు వేసి బిల్లులు స్వాహా
♦ ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంటే సూత్రధారులు..?
♦ స్వచ్ఛభారత్ మిషన్, ఉపాధిహామీ నిధులు కైంకర్యం
చందర్లపాడు(నందిగామ) : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛభారత్ మిషన్ నిధులు భారీగా దుర్వినియోగమయ్యాయి. ఎన్జీఓ (నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్) అవతారమెత్తిన కొందరు అధికార పార్టీ నేతలు మరుగుదొడ్లు నిర్మించకుండానే లబ్ధిదారుల పేరుతో లక్షల రూపాయల మేర బిల్లులు పొందారు. చందర్లపాడు మండలంలో జరిగిన ఈ కుంభకోణంలో ఎంపీడీఓ కీలకపాత్ర వహించగా కార్యాలయ జూనియర్ అసిస్టెంటు తనవంతు సహాయ సహకారాలు అందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై నేరుగా లబ్ధిదారుల పేరుతో ఎన్జీఓల ఖాతాలోకి డబ్బు జమచేశారు.
ఒక్క తోటరావులపాడు సుమారు 120 మంది పేరుమీద రూ.18 లక్షలు డ్రాచేయగా కోనాయపాలెం, చందర్లపాడు, ముప్పాళ్ల, కాసరబాద, కొడవటికల్లుతో పాటు మిగిలిన పంచాయతీల్లోనే ఈ కుంభకోణం కొనసాగింది. పాత వాటికి బిల్లులు చెల్లించడంతోపాటు, అసలు మరుగుదొడ్లు నిర్మించకుండానే నిర్మాణం పూర్తయినట్లుగా నమోదుచేసి బిల్లులు చెల్లించేశారు. కొన్నిచోట్ల లబ్ధి దారుల ఖాతాల్లోకి డబ్బు జమచేసి, వారికి కొద్ది మొత్తంలో కమిషన్ ఇచ్చి మిగిలిన మొత్తాన్ని స్వాహాచేయగా, మరికొంతమందికి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదు. గడిచిన రెండేళ్లుగా స్వచ్ఛభారత్ మిషన్‌తోపాటు ఉపాధిహామీ పథకం కింద మరుగుదొడ్లు నిర్మించినట్లు తప్పుడు రికార్డులు సృష్టించి మండలవ్యాప్తంగా కోటి రూపాయల నిధులను స్వాహా చేసినట్లు సమాచారం.
నిబంధనలకు పాతర
మరుగుదొడ్ల నిర్మాణాల విషయంలో అధికారులు నిబం ధనలను తుంగలో తొక్కారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి అధికారి వరకు పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహించారు. దొడ్డి నిర్మాణాలను పరిశీలించిన తరువాత గ్రామ ప్రత్యేకాధికారి (చెక్‌మెజర్‌మెంటు అధికారి) ఎంబుక్‌లో రికార్డు చేయాలి. దానిని మండల పరిషత్ కార్యాలయానికి అందజేయాలి. మరుగు దొడ్డి నిర్మాణం జరిగిందా లేదా, లేదా? అది ఏ స్టేజీలో ఉంది? అన్న విషయాన్ని కంప్యూటర్ డేటాలో పరిశీంచిన తరువాత ఎంపీడీఓ లబ్ధిదారుడి ఖాతాకు బిల్లుమొత్తం జమచేయాలి. అయితే ఈ విషయంలో ఎంపీడీఓ, జూనియర్ అసిస్టెంటు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరుగుదొడ్డికి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు కమీషన్ తీసుకుని లబ్ధిదారుడి ఖాతాకు బదులు ఎన్జీఓ ఖాతాలోలో బిల్లులు మళ్లించారని సమాచారం.
నిర్మించకుండానే బిల్లులు చెల్లింపు
మండలంలో ఇప్పటి వరకు స్వచ్ఛభారత్ మిషన్ కింద 1,936 మరుగుదొడ్లను నిర్మించారని రికార్డుల్లో నమోదు చేశారు. అయితే 11 వేల వరుకు సక్రమంగా నిర్మించారని సమాచారం. అధిక మొత్తంలో మరుగుదొడ్లు నిర్మించకుండానే బిల్లులు చెల్లించరని సమాచారం. కొందరు టీడీపీ కార్యకర్తలకు చెందిన పాత మరుగుదొడ్లకే రంగులు వేసి, కొత్తవాటిగా చూపి బిల్లులు చెల్లించారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోనపాలెం 2, 3 వార్డులో 100 పాత దొడ్లకు, చందర్లపాడు 4, 5, 9 10, 11, 12, 13, 14 వార్డులో మరో 200 దొడ్లకు బిల్లులు చెల్లించారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.