నిరుపేదల పొట్టగొడుతూ పనులపై రాజకీయ గునపం
టీడీపీ నేతల ఒత్తిళ్లతో రాష్ట్రంలో ఫీల్డ్ అసిస్టెంట్ల తొలగింపు
తమవాళ్లనే నియమించాలంటూఅధికారులకు బెదిరింపులు
డబ్బులు వసూలు చేసుకుంటూఅధికార పార్టీ నేతల దందా
అటు పొలం పనులు సాగక.. ఇటు ఉపాధికి దూరమై పేదల అవస్థలు
ఉపాధి హామీ యాక్టివ్ జాబ్ కార్డుదారుల సంఖ్య 56.15 లక్షలు
రాష్ట్రంలో సగానికి పైగా పంచాయతీల్లో వారం పాటు ఉపాధి పనులే లేవు
గతేడాది జూలైలో 2.23 కోట్ల పనిదినాలు
ఈ ఏడాది జూలైలో 67 లక్షలే
కరోనాలోనూ పనులు కల్పించి ఆదుకున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి: కరోనా విపత్తు వేళ 2020–21లో గ్రామాల్లో కొత్తగా ఉపాధి హామీ జాబ్ కార్డుల జారీతో పాటు పనుల కల్పనలోనూ మన రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది. మహమ్మారి విరుచుకుపడ్డ వేళ దిక్కు తోచక పట్టణాలకు పట్టణాలే గ్రామాలకు తరలి వచ్చినా నిశ్చింతగా జీవనోపాధి లభించింది! విపత్తులోనూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మందగించకుండా పనులు కల్పిస్తూ, పథకాన్ని సద్వి నియోగం చేసుకుంటూ గత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఇక వ్యవసాయ పనులు ఉండని వేసవి సీజన్‌లో పేదలకు ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవటంలో గత ఐదేళ్లూ ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలోనే కొనసాగింది. ఏటా ఉపాధి పొందిన కుటుంబాలు, లబ్ధి చేకూర్చిన మొత్తం పెరగడమే ఇందుకు నిదర్శనం.
నిరుపేదల కడుపు నింపిన ఉపాధిహామీలో ఇప్పుడు రాజకీయాలు చొరబడ్డాయి. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో పెత్తనం కోసం టీడీపీ నేతలు రాజకీయ రంగు పులమడంతో పేదల ‘ఉపాధి’కి గండి పడింది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మర్నాడే అత్యధిక గ్రామాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ఫీల్డ్ అసిసెంట్లను తప్పించాలని అధికారులపై ఒత్తిళ్లు తెచ్చారు. దీంతో మండల అ«ధికారులు వారితో పనులు చేయించలేక గ్రామాల్లో మొత్తం ఉపాధి పనులనే నిలిపివేశారు.
అధికారిక గణాంకాలే దీనికి సాక్ష్యం. టీడీపీ నేతల నిర్వాకాలతో రాష్ట్రంలో సగానికి పైగా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు నిలిచిపోయాయి. మరోవైపు డబ్బులు వసూలు చేసుకుంటూ తమకు నచ్చిన వారిని ఫీల్డ్ అసిస్టెంట్లగా నియమించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉపాధి హామీ పనుల తాజా వివరాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్ పోర్టల్‌లో నమోదవుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా 13,387 గ్రామ పంచాయతీలు ఉండగా అధికారిక గణాంకాల ప్రకారమే 6,788 పంచాయతీల్లో ఈనెల 26వతేదీకి ముందు వారం రోజుల పాటు కనీసం ఒక్కరికి కూడా పనులు కల్పించకపోవడం గమనార్హం. ఈనెల 26వ తేదీన మాత్రం కేవలం 4,565 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఉపాధి హామీ పథకం పనులు కొనసాగినట్లు అధికారిక వివరాలు వెల్లడిస్తున్నాయి. అంటే రాష్ట్రంలో మూడింట రెండొంతుల గ్రామాల్లో పేదలకు ఉపాధి పనులే లేకుండా పోయాయి.
సహాయకులు.. నిస్సహాయంగా
గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కోరే వారి వివరాలు నమోదు చేసుకోవడం, ఆయా చోట్ల ముందుగా అనుమతించిన పనులను కూలీలకు కేటాయించడం, పనులు చేసిన వారి వివరాలను మండల కంప్యూటర్ సెంటర్‌లో అందజేయడం ఫీల్డ్ అసిస్టెంట్ల ప్రధాన విధి. సాధారణంగా ప్రతి గ్రామ పంచాయతీలో ఒకరు చొప్పున ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లాయి (ఎఫ్‌టీఈ) విధానంలో ఫీల్డ్ అసిసెంట్లకు రూ.10 వేలకు పైబడి, మిగిలిన వారికి రూ.7,500 నుంచి రూ.10 వేల మధ్య నెల వారీ వేతనాలను ప్రభుత్వం చెల్లిస్తుంది. వీరంతా ప్రస్తుతం గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అధిపత్య ఆరాటంతో నిస్సహాయంగా మారారు.
పొలం పనులు లేక.. ఉపాధి దొరకక
ఉపాధి హామీ పథకం ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని సమయంలో పేదలు వలస వెళ్లకుండా ఉపాధి పనులు కల్పించి ఆదుకోవడం. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయ పనులు ఇంకా జోరందుకోలేదు. వర్షాలు కురుస్తున్నప్పటికీ జలాశయాల్లో నీటి నిల్వలు అతి తక్కువగా ఉన్న నేపథ్యంలో పొలం పనులు అత్యధిక ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రత్యేకించి ఉపాధి హామీ పనులకు ఎక్కువ డిమాండ్ ఉండే రాయలసీమతో పాటు ప్రకాశం, పల్నాడు తదితర జిల్లాల్లో వ్యవసాయ పనులు మందకొడిగా జరుగుతుండటంతో నిరుపేదలు ఉపాధి కోసం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
వలస వెళ్లాల్సి వస్తుందేమో..
గ్రామంలో నేను, నా భార్య, ఇద్దరు కుమారులు ఉపాధి పనులు చేసుకునేవాళ్లం. కొద్ది రోజులుగా ఉపాధి పనులు బంద్ చేశారు. వర్షాలు సరిగా పడక పోవడంతో గ్రామంలో వ్యవసాయ పనులు కూడా దొరకడం లేదు. గ్రామంలో పనులు కల్పిస్తే చేసుకుంటాం. లేకపోతే గ్రామం వదిలి ఇతర పట్టణాలకు పనుల కోసం వలస వెళ్లాల్సి వస్తుంది. – దావిద్, చిర్తనకల్లు, కోసిగి మండలం, కర్నూలు జిల్లా
పేదల కడుపు కొట్టొద్దు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చి్చన వెంటనే మా గ్రామంలో ఉపాధి హామీ పథకానికి రాజకీయ గ్రహణం పట్టింది. టీడీపీ నాయకులు ప్రస్తుతం ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్‌ను తొలగించాలనే ఉద్దేశంతో గ్రామంలో పనులు ఆపేశారు. పనులు కల్పించాలని కోరుతున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. రాజకీయ ప్రయోజనాలు, ధన ప్రయోజనాల కోసం మాలాంటి పేదల కడుపులు కొట్టడం మంచి కాదు. – నల్లపనేని ప్రసాద్, ఏపినాపి, కలిగిరి మండలం, నెల్లూరు జిల్లా
పనుల్లేక ఇబ్బందులు
కొద్ది రోజులుగా ఉపాధి పనులు నిలిపేశారు. నేను ప్రతి ఏడాది ఉపాధి పనులకు వెళ్లేవాడిని. ఈ ఏడాది కూడా మొదట్లో పనికి వెళ్లాను. ఇప్పుడు పనులు నిలిపి వేయడం వల్ల అందరికీ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉపాధి పనుల వల్ల వచ్చే డబ్బు ద్వారానే జీవనం సాగిస్తున్న మాలాంటోళ్లకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. – సిహెచ్.శ్రీరాం, పెదవేమలి గ్రామం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా
నాలుగు వారాల కూలి రావాలి
నేను, నా భార్య ఇద్దరం ఉపాధి పనికి వెళ్లేవాళ్లం. జూన్ నెల నుంచి పనులు జరగడం లేదు. నాలుగు వారాలకు సంబంధించిన ఉపాధి కూలి డబ్బులు రావాల్సి ఉంది. ఆ డబ్బులు రాకపోవడంతో కష్టంగా ఉంది. అధికారులు స్పందించి ఉపాధి పనులు కల్పిస్తే మా కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – షేక్.ఇమామ్, కంభం, ప్రకాశం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment