సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలుపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. ఈ పథకం కింద ఖర్చు చేసేందుకు కేవలం రూ.135 కోట్ల బడ్జెటే మిగిలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు ఇంకా నాలుగున్నర నెలలు ఉండగానే ఈ పరిస్థితి తలెత్తడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మిగిలిన మొత్తంతో కూలీలకు రెండు రోజులకు మించి పనిని కలి్పంచే అవకాశాలు లేవని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఇకముందు దీనిని ఎలా అమలు చేయాలి?, ఉపాధి పనులు కోరే కూలీలకు పనుల కల్పన, వారికి వేతనాల చెల్లింపు ఎలా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
7 నెలల్లో 97% నిధులు ఖర్చు చేసిన రాష్ట్రం
రాష్ట్రంలో ఈ ఏడాది ఉపాధి హామీ పథకం అమలు, మొత్తం బడ్జెట్, చేసిన వ్యయం, ఉపాధి కల్పన తదితర అంశాలపై గత ఏప్రిల్ నుంచి అక్టోబర్ చివరి వరకు అందుబాటులో (పబ్లిక్ డొమైన్) సమాచారాన్ని లిబ్ టెక్ ఇండియా సంస్ధ ఆధ్వర్యంలో పరిశోధకులు, నిపుణుల బృందం విశ్లేచింది. దీని ప్రకారం..ఈ ఏడాది ఈ పథకం కింద ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 90% కంటే కాస్త అధికంగా నిధులు ఖర్చు కాగా, తెలంగాణకు కేటాయించిన బడ్జెట్లో సుమారు 97% ఇప్పటికే ఖర్చు అయ్యింది.
రాష్ట్రానికి కేంద్రం రూ.3,671 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఇందులో గత 7 నెలల్లో (ఏప్రిల్–అక్టోబర్) రాష్ట్ర ప్రభుత్వం రూ.3,536 కోట్లు వ్యయం చేసింది. చేసిన పనులకు గాను గత నెల 10వ తేదీ వరకు రూ.2,278 కోట్లు కేంద్రం విడుదల చేసింది. ఇంకా రూ.1,258 కోట్ల మేర బకాయిలు రాష్ట్రానికి రావాల్సి ఉంది. ఒకవైపు చెల్లింపుల కోసం కూలీలు ఎదురు చూస్తుండగా, మిగతా నాలుగున్నర నెలలు పని కల్పన ఇప్పుడు సమస్యగా మారింది.
ఉపాధి హామీ పనులకు అత్యంత డిమాండ్ ఉన్న రోజుల్లోనూ రాష్ట్రంలో 1.2 కోట్ల కంటే ఎక్కువ మంది పని కోరలేదు. కానీ ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికే అత్యధికంగా 1.8 కోట్ల మంది పని కావాలని కోరారు. దీనిని బట్టి కూలీలు పని కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో అర్ధమవుతోందని నిపుణులు పేర్కొన్నారు.
కొరవడిన స్పష్టత
ప్రస్తుత సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిష్కరిస్తుందనే అంశంపై స్పష్టత కొరవడింది. దీనిపై మాట్లాడేందుకు అధికారులెవరూ సముఖంగా లేరు. మరోవైపు ఇంతపెద్ద మొత్తంలో కేంద్రం నుంచి బకాయిలు రావాల్సి రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా కేంద్రాన్ని నిలదీయకపోవడం ఏమిటని నిపుణులు ప్రశి్నస్తున్నారు. ఉపాధి హామీ రంగంలో పనిచేస్తున్న వివిధ స్వచ్ఛంద, సేవాసంస్థలు, దళిత సంఘాల ప్రతినిధులు ఆయా ముఖ్యమైన అంశాలపై సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.
ఇదిలా ఉంటే 2020–21లో రాష్ట్రానికి రూ.4,763 కోట్లు కేటాయించిన కేంద్రం ఈ ఏడాది (2021–22) రూ.3,671 (గతేడాదితో పోలి్చతే 33 శాతం తక్కువ) కోట్లే కేటాయించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉపాధి హామీ పనులకు రాష్ట్రంలో డిమాండ్ పెరుగుతున్నందున.. కేంద్రం బడ్జెట్ పెంచాల్సి ఉండగా తగ్గించడంపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి ఉపాధి బడ్జెట్‌ను పెంచాలనే డిమాండ్లు వస్తున్నాయి. కేంద్రం అదనపు బడ్జెట్ కేటాయిస్తే కానీ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కొనసాగే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్రం తక్షణమే బకాయిలు విడుదల చేయాలని కోరుతున్నారు.
సీఎం లేఖ రాయాలి
తెలంగాణకు రావాల్సిన బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని కోరుతూ కేంద్రానికి సీఎం కేసీఆర్ లేఖ రాయాలి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులకు ఆటంకం కలగకుండా అదనపు కేటాయింపుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలి. తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను షరతులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి నియమించాలి.
– పి. శంకర్ (దళిత్ బహుజన్ ఫ్రంట్), కురువ వెంకటేశ్వర్లు (ఉపాధి హామీ ఫోన్ రేడియో)
డిమాండ్ మేరకు దొరకని పని
పూర్తి చేసిన పనులకు సకాలంలో డబ్బులు చెల్లించక పోవడం, ఇతర కారణాల వల్ల కూలీల్లో కొంత నిరుత్సాహం ఉంది. అయినా డిమాండ్ మేరకు కూలీలు పని పొందలేక పోతున్నారనేది మా పరిశీలనలో వెల్లడైంది. కూలీలకు బకాయిలు వెంటనే చెల్లించాలి. అలాగే ఉపాధి హామీ బడ్జెట్‌ను మరింత పెంచాల్సిన అవసరముంది. ఈ పథకంలో కీలకంగా వ్యవహరించే ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను మళ్లీ పూర్తి స్థాయిలో ఉపయోగించాలి.
– చక్రధర్ బుద్ధా (డైరెక్టర్, లిబ్ టెక్ ఇండియా), గజ్జలగారి ప్రవీణ్‌కుమార్ (పరిశోధకులు)
Comments
Please login to add a commentAdd a comment