సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, అమరావతి : ఏదైనా వస్తువు కొనాలంటే మార్కెట్ ధర పరిశీలించి, బేరం ఆడి కొనుగోలు చేస్తాం. ప్రభుత్వం తరపున కొనుగోలు చేయాలంటే టెండర్లు పిలిచి, తక్కువ ధరకే ఆ వస్తువును అందించే సంస్థకే టెండర్ ఖరారు చేసి, కొనుగోలు చేయడం పరిపాటి. కానీ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఆరాటంతో మార్కెట్ ధర కంటే రెండింతలు అధికధరకు వస్తువు సరఫరా చేస్తామంటున్న సంస్థకే టెండర్ కట్టబెట్టడం విస్మయం కలిగిస్తోంది.
రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌లో చోటుచేసుకున్న ఈ బాగోతం వెనుక చినబాబు హస్తం ఉన్నట్లు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో చెత్తను సేకరించడానికి బ్యాటరీతో నడిచే ఈ–ఆటోలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జాతీయ సఫాయి కర్మచారీ ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ ద్వారా తొలివిడతగా 7,500 ఈ–ఆటోలను కొనుగోలు చేసి, షెడ్యూల్ క్యాస్ట్(ఎస్సీ) నిరుద్యోగ యువతకు అప్పగించాలని నిర్ణయించారు. పశ్చిమ గోదావరి, చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఈ–ఆటోల కొనుగోలు కోసం టెండర్లు పిలిచారు.
జూలై 29వ తేదీన కైనెటిక్ గ్రీన్ ఇండియా సంస్థ ప్రతినిధులు సచివాలయంలో చినబాబును కలిశారు. ఈ–ఆటోల సరఫరా టెండర్‌ను ఆ సంస్థకే అప్పగించేలా డీల్ కుదిరినట్లు ఆరోపణలున్నాయి. ఓపెన్ టెండర్ కావడంతో మొత్తం 24 ప్రైవేటు సంస్థలు ఇందులో పాల్గొన్నాయి. అందులో 16 సంస్థలు అర్హత సాధించినట్లు అధికారులు నిర్ధారించారు. టెండర్‌ను తెరిచే సమయంలో చినబాబు తెరపైకి వచ్చారు. తాము సూచించిన కంపెనీకే టెండర్ దక్కేలా చూడాలని ఆదేశించారు. ఆప్పట్లో చినబాబు ఆశీస్సులు ఉన్న కంపెనీ ఇతర కంపెనీల కంటే ఎక్కువ ధర కోట్ చేసింది. దాంతో ఆ కంపెనీకి టెండర్ దక్కే అవకాశాలు లేవని అధికారులు ఏకంగా ఆ టెండర్‌నే రద్దుచేశారు. మరోసారి సెప్టెంబర్‌లో టెండర్లను ఆహ్వానించారు. ఈ టెండర్లపైనా వివాదం తలెత్తడంతో మళ్లీ నవంబర్‌లో టెండర్లు పిలిచారు. డిసెంబర్ 4న టెండర్లను తెరిచారు.
ఇటీవల సచివాలయంలో మంత్రి లోకేశ్‌ను కలిసిన కైనెటిక్ గ్రీన్ ఇండియా ప్రతినిధులు
టెండర్ నిబంధనల్లో మార్పులు
అస్మదీయ సంస్థకే టెండర్ దక్కేలా టెండర్ నిబంధనల్లోనూ చినబాబు మార్పులు చేయించారు. ముందుగా పిలిచిన టెండర్‌లో ఈఎండీ(ఎర్నేస్ట్ మనీ డిపాజిట్) నాన్ రిఫండబుల్ రూ.25 వేలు కాగా, తాజాగా పిలిచిన టెండర్‌లో ఈఎండీ రూ.1.5 కోట్లుగా చూపించడం గమనార్హం. దాంతోపాటు ఈ–ఆటోలను సరఫరా చేసే సంస్థ ఇప్పటికే 2,500 ఆటోలను ఏదైనా సంస్థకు సరఫరా చేసినట్లు అధికారిక ధ్రువీకరణ కావాలని నిబంధన విధించారు. అయినప్పటికీ టెండర్లలో ఏడు కంపెనీలు పాల్గొన్నాయి. ఎస్‌ఎస్‌వీ టెక్నాలజీ, గోయెంకా మోటార్స్, విక్టరీ ఎలక్ట్రికల్, రిప్ టెక్నాలజీ, కైనెటిక్ గ్రీన్ ఇండియా, భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. చివరకు చినబాబుతో డీల్ కుదుర్చుకున్న కైనటిక్ గ్రీన్ ఇండియా సంస్థకే టెండర్‌ను ఖరారు చేశారు.
అర్హత లేని కంపెనీకే టెండర్
టెండర్ నిబంధనల ప్రకారం హోమోలోగేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. కానీ, ఆ సర్టిఫికేట్ లేని కైనెటిక్ గ్రీన్ ఇండియాకు టెండర్ ఖరారు చేయడం గమనార్హం. మిగిలిన సంస్థల కంటే ఎక్కువ ధర కోట్ చేసిన కంపెనీకి టెండర్ కట్టబెట్టడం విశేషం. కైనెటిక్ గ్రీన్ ఇండియా ఒక్కో ఆటోను రూ.2.44 లక్షలకు సరఫరా చేయనున్నట్లు టెండర్లలో చూపించారు. మిగిలిన సంస్థలు రూ.2.20 లక్షల లోపు ధరకే సరఫరా చేస్తామంటూ బిడ్ దాఖలు చేశాయి. ఈ–ఆటో ప్రస్తుతం రూ.1.48 లక్షల ధర పలుకుతోంది. కానీ, చినబాబు సూచించిన సంస్థ మాత్రం ఒక్కో ఆటోను రూ.2.44 లక్షలకు ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంటే ఒక్కో ఆటోకు అదనంగా రూ.లక్ష చెల్లించాల్సి వస్తోంది. తొలివిడతగా ఆహ్వానించిన టెండర్లలో పాల్గొన్న కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఒక్కో ఆటోను రూ.1.08 లక్షలకు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.16 లక్షలకు సరఫరా చేస్తామంటూ ముందుకొచ్చాయి. కానీ, ఆ టెండర్లను రద్దు చేయించారు. అధిక ధర కోట్ చేసిన కైనెటిక్ గ్రీన్ ఇండియాకే టెండర్ కట్టబెట్టడం వెనుక లోగుట్టు ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కేవలం రూ.1.08 విలువైన ఆటోను అస్మదీయ సంస్థ నుంచి రూ.2.44 లక్షలకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధ పడింది. అంటే ఖజానాపై రూ.83 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. ఈ సొమ్ముంతా ఎవరి జేబుల్లోకి వెళ్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఎస్సీ యువతపై అదనపు భారం
పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ పథకంలో భాగంగా అర్హులైన దళిత యువతకు ఈ–ఆటోలను సరఫరా చేయనున్నారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఆటోలకు ప్రభుత్వ సబ్సిడీ పోను బ్యాంకు రుణం అందిస్తారు. బ్యాంకు రుణాన్ని లబ్ధిదారుడు నెలవారీగా చెల్లించుకోవాలి. చినబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.లక్ష వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది.
ఈ–ఆటోల టెండర్లలో అవినీతి
‘‘ఈ–ఆటోల సరఫరా టెండర్లలో అవినీతి చోటుచేసుకుంది. కొందరి స్వార్థం కోసం మన రాష్ట్రానికి చెందిన చిన్న తరహా పరిశ్రమలకు అన్యాయం చేశారు. మరో రాష్ట్రానికి చెందిన కంపెనీకి ఈ–ఆటోల సరఫరా టెండర్‌ను అప్పగించడం దారుణం. టెండర్లలో అక్రమాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సృందించలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే న్యాయ పోరాటం చేస్తాం’’
– కె.పి.రావు, ఎలక్ట్రికల్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ నేత, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment