పట్టణాల్లో సెప్టేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు | Septage Treatment Plants in Towns | Sakshi
Sakshi News home page

పట్టణాల్లో సెప్టేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు

Published Sat, Feb 13 2021 5:42 AM | Last Updated on Sat, Feb 13 2021 5:43 AM

Septage‌ Treatment‌ Plants in Towns - Sakshi

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో జల, వాయు కాలుష్య నివారణకు పురపాలక శాఖ ఉపక్రమిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో సెప్టేజ్‌ ట్రీట్మెంట్‌ (మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణ) ప్లాంట్లు పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ వ్యర్థాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో దేశంలో జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ్‌ భారత్‌ మిషన్‌ నివేదించింది. మరుగుదొడ్డి, సెప్టిక్‌ ట్యాంక్‌కు సమీపంలోని నీటి వనరుకు మధ్య కనీసం 20 అడుగుల దూరం ఉండాలి. అయితే ప్రస్తుతం సగటున 4 అడుగుల దూరం మాత్రమే ఉంటోందని నివేదిక పేర్కొంది. దాంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వెల్లడించింది. నిర్దేశిత సమయంలో సెప్టిక్‌ ట్యాంక్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా జల, వాయు కాలుష్యాలు పెరుగుతూ ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. 

భవిష్యత్‌ అవసరాలు పరిగణనలోకి..
బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. మరోవైపు మన రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్లు’పథకం కింద ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీలు’పేరిట 30 లక్షల ఇళ్లతో దాదాపు 17వేల ఊళ్లు కొత్తగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఆయా కాలనీల్లో ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించనుండటంతో మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం మరింతగా పెరగనుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సెప్టేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల ఏర్పాటుకు పురపాలక శాఖ కార్యాచరణ రూపొందించింది. భవిష్యత్‌ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో స్వచ్ఛ్‌ ఏపీ కార్పొరేషన్‌ ద్వారా మూడు దశల్లో సెప్టేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించారు.

మేలో తొలిదశ ప్రారంభం
► సెప్టిక్‌ ట్యాంక్‌ వ్యర్థాలను నగర, పట్టణ శివారులోని సెప్టేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్లకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలను తగిన రీతిలో నిర్వహించిన తరువాత ఎరువు తయారవుతుంది. వాటిని నర్సరీలు, పొలాలకు సరఫరా చేస్తారు. మిగిలిన వ్యర్థాలను కాలుష్య కారకం కాని రీతిలో డిస్పోజ్‌ చేస్తారు. 
► మొదటి దశ సెప్టేజ్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్ల నిర్మాణాన్ని వచ్చే మేలో మొదలు పెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని స్వచ్ఛ్‌ ఏపీ కార్పొరేషన్‌ భావిస్తోంది. ఆ తర్వాత రెండు, మూడు దశల పనులు చేపడతారు. 

తొలుత 32 పట్టణ స్థానిక సంస్థల్లో..
► మొదటి దశలో అమృత్‌ పథకం అమలు అవుతున్న 32 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. రెండో దశలో లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీలు, మూడో దశలో లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో వీటిని నెలకొల్పుతారు. 
► నగరం, పట్టణం శివారులో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. అందుకు ఆయా మున్సిపాలిటీలు భూమిని కేటాయిస్తాయి. జనాభా ప్రాతిపదికన ప్లాంట్ల సామర్థ్యాన్ని నిర్ణయించి ఏర్పాటు చేస్తారు. 
► ఒక్కో ట్రీట్మెంట్‌ ప్లాంట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. వాటితోపాటు సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను కొనుగోలు చేస్తారు. 
► మరుగుదొడ్ల అవుట్‌ లెట్‌లను ఎక్కడా వీధి కాలువలలోకి విడిచిపెట్టకుండా కచ్చితంగా నియంత్రిస్తారు. 
► పట్టణాల్లో ప్రతి ఇంటి సెప్టిక్‌ ట్యాంక్‌ కనీసం మూడేళ్లకు ఓసారి శుభ్రం చేయాలన్నది లక్ష్యం. 
► అందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి 5 నుంచి 25 వరకు సెప్టిక్‌ ట్యాంక్‌ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను సమకూరుస్తారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement